ఏపీలో బ్రిటన్‌ భయం!

ABN , First Publish Date - 2020-12-27T07:01:28+05:30 IST

రాష్ట్రాన్ని బ్రిటన్‌ భయం వెంటాడుతోంది. యూకే నుంచి ఏపీకి వచ్చిన వారిలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు రాష్ట్ర ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ తెలిపారు.

ఏపీలో బ్రిటన్‌ భయం!

  • యూకే నుంచి వచ్చిన ఆరుగురికి పాజిటివ్‌
  • తూర్పు, అనంత, నెల్లూరు కృష్ణాలో ఒక్కొక్కరికి
  • గుంటూరు జిల్లాలో మరో 2 కేసులు నమోదు
  • బ్రిటన్‌ నుంచి 1,214మంది రాక.. 
  • 1,158 మంది గుర్తింపు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): రాష్ట్రాన్ని బ్రిటన్‌ భయం వెంటాడుతోంది. యూకే నుంచి ఏపీకి వచ్చిన వారిలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు రాష్ట్ర ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ తెలిపారు. బాధితులను కొవిడ్‌ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు. తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్కరికి, గుంటూరులో ఇద్దరికి పాజిటివ్‌గా తేలినట్టు తెలిపారు. వారి శాంపిల్స్‌ను పుణెలోని వైరాలజీ, హైదరాబాద్‌లోని సీసీఎంబీకి ల్యాబ్‌లకు పంపామని చెప్పారు. బ్రిటన్‌లో కరోనా కొత్త స్ర్టెయిన్‌ కలకలం రేపిన నేపథ్యంలో.. కొత్త వైర్‌పై అపోహలు వద్దని ఆయన సూచించారు. యూకే నుంచి ఇటీవలికాలంలో  1,213 మంది రాష్ట్రానికి వచ్చారని, వారిలో 1,158 మందిని ఇప్పటికే గుర్తించామని, మరో 56 మంది వివరాలు తెలియాల్సి ఉందని వెల్లడించారు.


బ్రిటన్‌లో కరోనా కొత్త స్ర్టెయిన్‌ కలకలం రేపిన నేపథ్యంలో ఈ మధ్యకాలంలో బ్రిటన్‌ నుంచి గుంటూరు జిల్లాకు 255 మంది, కడప జిల్లాకు 23 మంది వచ్చినట్టు గుర్తించారు. ఇటీవల బ్రిటన్‌ నుంచి 255 మంది రాగా వారిలో 534 మంది చిరునామాలు గుర్తించామని, మరో 21 మందిని గుర్తించేందుకు సర్వైలెన్స్‌ బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. డిసెంబరు 24 తర్వాత వచ్చిన వారిని మాత్రం క్వారంటైన్‌ సెంటర్లకు తరలిస్తామని చెప్పారు. కాగా.. గత నెల 23 నుంచి ఇప్పటివరకు బ్రిటన్‌ నుంచి 23 మంది కడప జిల్లాకు వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. 


కొత్తగా 282 కరోనా కేసులు

రాష్ట్రంలో కొద్ది రోజులుగా కరోనా కేసుల నమోదు తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 42,911 శాంపిల్స్‌ను పరీక్షించగా 282 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. దీంతో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 8,80,712కి పెరిగింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 56 కేసులు నమోదవగా.. తూర్పుగోదావరిలో 53, చిత్తూరులో 39, కృష్ణాలో 38 మంది వైరస్‌ బారినపడ్డారు. గత 24 గంటల్లో ఒక కరోనా మరణం నమోదవగా మృతుల సంఖ్య 7,092కి పెరిగింది.

Updated Date - 2020-12-27T07:01:28+05:30 IST