చిరుతిళ్లు తెగతినేస్తున్నారు

ABN , First Publish Date - 2020-09-29T08:16:38+05:30 IST

చిరుతిళ్లు తెగతినేస్తున్నారు

చిరుతిళ్లు  తెగతినేస్తున్నారు

పట్టణ ప్రజల ఆహారంలో 11 శాతం చిప్స్‌, స్వీట్లే

అసమతుల ఆహారంతో ఊబకాయం, మధుమేహం

పప్పుధాన్యాలు, పౌలీ్ట్ర ఉత్పత్తులు, చేపల వంటి 

ప్రొటీన్‌ ఆహారాన్ని తినేది 12 శాతమే

   

మన దేశంలో బియ్యం లేదా గోధుమలేమో ఎక్కువ తింటున్నారు. అధిక పోషకాలు ఉండే కూరగాయలు, ఆకుకూరలు, పాలు, పప్పు ధాన్యాలు, పౌలీ్ట్ర ఉత్పత్తులు, చేపలను మాత్రం తినాల్సిన దానికంటే తక్కువగా తింటున్నారు! ఇది... జాతీయ పోషకాహార సంస్థ నివేదికలో తేలిన విషయం!


ప్రత్యేకించి పట్టణ ప్రజలైతే.. తగినన్ని పోషకాలున్న ఆహారం తినకపోయినా చిప్స్‌, బిస్కెట్లు, చాక్లెట్లు, స్వీట్లను తెగలాగించేస్తున్నారని  ఎన్‌ఐఎన్‌ పేర్కొంది. పట్టణ ప్రజలు ఒక రోజులో తినే ఆహారంలో 11 శాతం దాకా ఇవే ఉంటున్నాయని.. గ్రామీణ ప్రజలూ వారి ఆహారంలో 4 శాతం మేర చిప్స్‌, చాక్లెట్స్‌, బిస్కెట్లే తీసుకుంటున్నారని  తెలిపింది. దేశంలో 97.1 శాతం మంది గ్రామీణులు, 68.8 శాతం మంది పట్టణ ప్రజలు సూచించిన పరిమాణం కంటే  అధిక మొత్తంలో తృణధాన్యాలు తీసుకుంటున్నారని వివరించింది.  

పండ్లు, కూరగాయలు, పాలు, పాల ఉత్పత్తులు సూచించిన దానికంటే తక్కువగా తింటూ, అసమతుల ఆహారం తీసుకోవడం వల్ల మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధుల బారిన పడుతున్నారని ఆ సంస్థ తాజా నివేదికల్లో స్పష్టం చేసింది.


పట్టణ ప్రజల్లో 18 శాతం, గ్రామాల్లో కేవలం 5 శాతం మంది ప్రజలు మాత్రమే సూచించిన పరిమాణంలో ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే పప్పులు, విత్తనాలు, పాలు, మాంసాహారం వంటివి తింటున్నారు. దేశ ప్రజల్లో 66 శాతం మంది కంటే ఎక్కువ మంది తగినంత ప్రొటీన్‌తో కూడిన ఆహారం తినడం లేదని జాతీయ పోషకాహార సంస్థ నివేదించడం గమనార్హం. 



45 శాతం మించితే చిక్కే


పోషకాహార నిపుణుల సూచనల ప్రకారం మనం తినే ఆహారంలో తృణధాన్యాలు 45 శాతానికి మించకూడదు. కానీ పట్టణ ప్రజల ఆహారంలో 51 శాతం, గ్రామీణ ప్రజల ఆహారంలో 65 శాతం బియ్యం, గోధుమలు, చిరుధాన్యాలే ఉంటున్నాయి. అలాగే మనం రోజూ తీసుకునే ఆహారంలో పప్పుధాన్యాలు, విత్తనాలు, మాంసం, చేపలు 17 శాతం ఉండాలని నిపుణులు సూచిస్తుండగా.. వాస్తవానికి ప్రజల ఆహారంలో 11 శాతం మాత్రమే పోషకవిలువలు ఉండే ఆహారం ఉంటోంది. 

-స్పెషల్‌ డెస్క్‌




‘మై ప్లేట్‌ ఫర్‌ ది డే ’...


రోజూ మనం తినే ఆహారంలో ఏ పదార్థాలు ఎంత మొత్తంలో ఉండాలనే వివరాలతో ‘మై ప్లేట్‌ ఫర్‌ ది డే ’ నివేదికను ఎన్‌ఐఎన్‌ వెల్లడించింది. మన భోజనంలో 270 గ్రాముల అన్నం లేదా తృణధాన్యాలు తీసుకోవాలి. 350 గ్రాముల కూరగాయలు, ఆకుకూరలు, 150 గ్రాముల పండ్లు, 20 గ్రాముల బాదం, బీన్స్‌ తదితర విత్తనాలు ఆహారంగా తీసుకోవాలి.


అలాగే పప్పుధాన్యాలు, గుడ్డు, మాంసాహారం 90 గ్రాములు తీసుకోవాలి. 27 గ్రాముల మాంసకృత్తులు, నూనెలను ఆహారంలో భాగంగా చేసుకోవాలని ఆ నివేదికలలో తెలిపారు.


Updated Date - 2020-09-29T08:16:38+05:30 IST