సీఎస్‌ జీవోకు బ్రేక్‌!

ABN , First Publish Date - 2020-10-27T08:12:22+05:30 IST

అది స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేసిన జీవో! అదేదో వేలకోట్ల ఖర్చుతో కూడుకున్నది కాదు! వివాదాస్పద అంశమూ..

సీఎస్‌ జీవోకు బ్రేక్‌!

మరోసారి పరాభవం..

ఉద్యోగినుల సెలవు జీవో ‘రద్దు’


అమరావతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): అది స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేసిన జీవో! అదేదో వేలకోట్ల ఖర్చుతో కూడుకున్నది కాదు! వివాదాస్పద అంశమూ కాదు! మహిళా ఉద్యోగినుల విన్నపం మేరకు... మంగళవారం ఆప్షనల్‌ హాలిడేగా ప్రకటిస్తూ జారీ చేసిన ఉత్తర్వు అది! శుక్రవారం జారీ అయిన ఆ జీవో... ఆదివారం ఆకస్మికంగా మాయమైంది. ఒక అధికారి నిర్ణయమే దీనికి  కారణమని తెలుస్తోంది. దీంతో... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి పరిపాలనపరంగా మరోసారి పరాభవం ఎదురైందని సచివాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.


కేంద్ర ప్రభుత్వంతోపాటు తెలంగాణ సర్కారు సోమవారం (అక్టోబరు 26) సెలవుగా ప్రకటించడంతో... ఏపీలో మహిళలకు మాత్రం ఆప్షనల్‌ హాలిడే ఇచ్చారు. సీఎస్‌ నీలంసాహ్ని ఈ జీవో జారీ చేశారు. ఇది ఆదివారం నుంచి ప్రభుత్వ అధికారిక జీవోల వెబ్‌సైట్‌లో కనిపించడం లేదు. అలాగని జీవోను పూర్తిగా తొలగించలేదు. జీవో నంబరు అలాగే ఉంచి ‘జారీ చేయలేదు’ (నాట్‌ ఇష్యూడ్‌) అని మార్పు చేశారు. అంటే,  సోమవారం యథావిధిగా మహిళా ఉద్యోగులు కార్యాలయాలకు  వచ్చి విధులు నిర్వహించాలి... ఆప్షనల్‌ హాలిడే తీసుకోవడం కుదరదనేది దాని అర్థం. ఈ సమాచారం చాలా మంది మహిళా ఉద్యోగులకు తెలియలేదు. తెలిసినవారు విస్మయానికి గురయ్యారు. అప్పటికే హైదరాబాద్‌కు వెళ్లిన వారు, పండగకు సొంత ఊళ్లకు వెళ్లిన వారు సోమవారం విధులకు రాలేకపోయారు. ఓహెచ్‌ జీవోను ఎందుకు మాయం చేశారనే దానిపై ఉద్యోగ సంఘాల నాయకులు ఆరా తీయగా... సీఎస్‌ ఇచ్చిన జీవోతో సీఎం కార్యాలయంలో ఒక అధికారి విభేదించారని, దానిని ఉన్నపళంగా నాట్‌ ఇష్యూడ్‌ అని మార్చారని తెలిసినట్టు తెలిసింది. మహిళా ఉద్యోగుల సెలవు గురించి ప్రభుత్వంలోని ఉన్నతస్థాయిలోని అధికారులు ఇంత హైడ్రామా ఆడడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Updated Date - 2020-10-27T08:12:22+05:30 IST