శిరసు వంచి.. చేతులు జోడించి కోరుతున్నా..చర్చిద్దాం రండి

ABN , First Publish Date - 2020-12-19T07:43:47+05:30 IST

సాగు చట్టాలను ప్రధాని నరేంద్ర మోదీ మరోమారు సమర్థించుకొచ్చారు. వీటి రద్దు కోసం గట్టిగా పట్టుబడుతూ చర్చలకు రావడానికి రైతులు భీష్మిస్తుండడంతో ఆయన 12 గంటల వ్యవధిలో వారికి రెండోసారి వ్యక్తిగతంగా విజ్ఞాపన చేశారు.

శిరసు వంచి.. చేతులు జోడించి కోరుతున్నా..చర్చిద్దాం రండి

రైతు ప్రయోజనాలను దెబ్బతీసే ఏ చర్యా తీసుకోం

సాగు చట్టాలు రాత్రికి రాత్రి చేసినవి కావు

ఎంఎస్పీ ఎత్తేస్తామంటే అంతకంటే ద్రోహం ఉండదు

క్రెడిట్‌ తనకు దక్కలేదనే కాంగ్రెస్‌ అక్కసు: మోదీ


న్యూఢిల్లీ, డిసెంబరు 18: సాగు చట్టాలను ప్రధాని నరేంద్ర మోదీ మరోమారు సమర్థించుకొచ్చారు. వీటి రద్దు కోసం గట్టిగా పట్టుబడుతూ చర్చలకు రావడానికి రైతులు భీష్మిస్తుండడంతో ఆయన 12 గంటల వ్యవధిలో వారికి రెండోసారి వ్యక్తిగతంగా విజ్ఞాపన చేశారు. ‘శిరసు వంచి ముకుళిత హస్తాలతో మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.. మీకు చట్టాలపై అనుమానాలు, ఆందోళన ఉంటే.. చర్చలకు రండి. సావధానంగా మాట్లాడదాం. మీ ప్రయోజనాల్ని దెబ్బతీసే ఏ చర్యనూ మేం తీసుకోలేదు, తీసుకోం కూడా..’ అని ఆయన మధ్యప్రదేశ్‌కు చెందిన రైతులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చేసిన ప్రసంగంలో అన్నారు. ఇన్నాళ్లూ ట్విటర్‌ ద్వారానో లేదా ఇతరత్రా వేదికలమీదో రైతు ఆందోళనను, ప్రభుత్వ వైఖరిని ప్రస్తావిస్తూ వచ్చిన మోదీ తొలిసారిగా రైతులతో నేరుగా సంభాషించారు. చట్టాలకు అనుకూలంగా బీజేపీ చేపట్టిన దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా ఏర్పాటైన ఈ సమావేశంలో ఆయన సాగు సంస్కరణల అవసరాన్ని విశదీకరించారు. ‘ఈ చట్టాలు రాత్రికి రాత్రి చేసినవి కావు.


వీటి వెనుక రెండు దశాబ్దాల అధ్యయనం ఉంది.  గత ప్రభుత్వాలు, అనేక రాష్ట్రప్రభుత్వాలు, వ్యవసాయ రంగ నిపుణులు, రైతాంగ ప్రతినిధులు వీటిపై చర్చిస్తూనే వచ్చారు. మేనిఫెస్టోలో పెట్టి కూడా- కాంగ్రె్‌స-సారథ్య ప్రభుత్వాలు వీటిని తేలేక నానుస్తూ వచ్చాయి. ఇపుడు మేం నెరవేర్చేసరికి వ్యతిరేకత వ్యక్తం చేసి రైతులను రెచ్చగొడుతున్నాయి. వారి ఆందోళన ఒకటే... మేం చేయలేని పనిని మోదీ ఎలా చేశారా... అని! క్రెడిట్‌ తమకు దక్క లేదన్నది వారి అక్కసు. అందుకే రైతుల్లో అయోమయం సృష్టిస్తున్నారు. రైతుల భుజాలపై తుపాకీ ఆన్చి కాల్పులు జరుపుతున్నారు. వారికి నా విన్నపం ఒకటే... కావలిస్తే క్రెడిట్‌ మీరే తీసుకోండి. రైతులను మాత్రం తప్పుదోవ పట్టించకండి’’ అని మోదీ చెప్పుకొచ్చారు. ‘కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) ఎప్పటినుంచో ఉన్నది. మేం ఈచట్టాలు చేసి ఆరునెలలైంది. ఆ తరువాతా రైతులు మండీల్లో ఎంఎస్పీ రేటు కు తమ పంటను అమ్ముకోగలిగారు. బుద్ధి ఉన్నవారెవరూ ఎంఎస్పీ వ్యవస్థను రద్దు చేస్తామంటే ఊరుకోరు. ఆ వ్యవస్థ ఎప్పటికీ కొనసాగుతుంది’’ అని మోదీ స్పష్టం చేశారు. 


అనధికారిక చర్చలు: తోమర్‌

రైతులతో అనధికారికంగా చర్చ లు జరుగుతున్నాయని, ఈ ఏడాది చివర్లోపు ఏదో ఒక పరిష్కారం సాధ్యమవుతుందని భావిస్తున్నామని వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్‌ చెప్పారు. చట్టాల రద్దు గురించే రైతులు పట్టుబట్టరాదన్నారు. సమాంతర చర్చలు జరపరాదన్న రైతు నేతల డిమాండ్‌ను ఆయన కొట్టిపడేశారు. రైతు సమస్యల గురించి వారు ఆలోచించాలే తప్ప చట్టాల రద్దు గురించో లేక సమస్యల పరిష్కార యత్నాల గురించో కాదన్నారు. కాగా, ఢిల్లీలో రైతుల ఉద్యమానికి మద్దతుగా చెన్నైలో డీఎంకే నేతృత్వంలో అఖిల పక్షం నేతలు, కార్యకర్తలు శుక్రవారం నిరాహారదీక్ష చేపట్టారు. పోలీసులు అనుమతి నిరాకరించినా పట్టించుకోకుండా నుంగంబాక్కం వళ్లువర్‌కోట్టమ్‌ వద్ద దీక్షను ప్రారంభించారు. 


ఆ స్కీముల్నీ సంస్కరణల్లో చేర్చాలి: కేపీఎంజీ

కాగా- సాగు సంస్కరణలపై తీవ్రమైన సమాచార లోపం ఉందనీ, తప్పుడు ప్రచారం జరుగుతోందని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ వ్యాఖ్యానించింది. ఈ సంస్కరణలను సమర్థిస్తూ- పీఎం ఫార్మలైజేషన్‌ ఆఫ్‌ మైక్రో ఫుడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (పీఎంఎ్‌ఫఎంఈ), ఫార్మర్‌ ప్రొడ్యూస్‌ ఆర్గనైజేషన్స్‌ (ఎఫ్‌పీవో) లాంటి ప్రస్తుత స్కీములను కూడా ఈ సంస్కరణల్లో కలిపేయాలని, అపుడే ఓ నూతన దృక్పథం సాధ్యమవుతుందనీ కేపీఎంజీ- ఓ నివేదికలో పేర్కొంది. 


కేజ్రీపై బీజేపీ కేసు

రైతులను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ బీజేపీ -ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై పోలీస్‌ కేసు పెట్టింది. ‘ఆయన ముఖ్యమంత్రి. ఆ హోదాలో ఉండి రాజ్యాంగబద్ధమైన చట్టాలను అసెంబ్లీలో చించేయడం త ప్పు. ఈ చర్యకు ద్వారా ఆయన శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులను రెచ్చగొట్టారు. అంతేకాక-ఢిల్లీలో ఘర్షణలకు తావిస్తున్నారు’ అని బీజేపీ ఢిల్లీ శాఖ ఐటీ విభాగం చీఫ్‌ అభిషేక్‌ దూబే ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 


మత గురువుకు వేల మంది నివాళి

రైతుల ఆందోళనకు మద్దతుగా బలవన్మరణానికి పాల్పడ్డ సిక్కు మత బోధకుడు సంత్‌ రామ్‌సింగ్‌ అంత్యక్రియలు శుక్రవారం జరిగాయి. వేల మంది కడసారి నివాళులర్పించారు. వీరిలో హరియాణ మాజీ సీఎం భూపిందర్‌సింగ్‌ హూడా, ఆయన కుమారుడు దీపిందర్‌ హూడా, సుఖ్‌భీర్‌ బాదల్‌, హర్‌సిమ్రత్‌ కౌర్‌, ఎస్‌జీపీసీ చీఫ్‌ బీబీ జాగీర్‌ కౌర్‌, బీకేయూ నేత గుర్నామ్‌సింగ్‌, కాంగ్రెస్‌ నేత సెల్జా తదితరులున్నారు. ఆయన అంత్యక్రియలకూ వేల సంఖ్యలో హాజరయ్యారు. 

Read more