-
-
Home » Andhra Pradesh » BJP state president Somu veeraju
-
రోడ్ల దుస్థితిపై బీజేపీ కన్నెర్ర
ABN , First Publish Date - 2020-12-06T08:47:57+05:30 IST
సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్రమంతా పాదయాత్ర చేసిన జగన్మోహనరెడ్డికి.. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ హెలీకాఫ్టర్ ప్రయాణాలేనని, కాబట్టే రాష్ట్రంలో రోడ్ల

రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
పాదయాత్రల్లేక సీఎంకు రోడ్ల పరిస్థితి తెలియడం లేదు: సోము వీర్రాజు
ప్రజా సమస్యలు వైసీపీకి పట్టడంలేదు
రహదారుల అభివృద్ధి వ్యయంపై శ్వేతపత్రం విడుదల చేయాలి: విష్ణువర్ధన్ రెడ్డి
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్రమంతా పాదయాత్ర చేసిన జగన్మోహనరెడ్డికి.. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ హెలీకాఫ్టర్ ప్రయాణాలేనని, కాబట్టే రాష్ట్రంలో రోడ్ల దుస్థితి తెలియడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. రోడ్ల దుస్థితిపై రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ చేపట్టిన నిరసనల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో చేపట్టిన ధర్నాలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు పాదయాత్ర చేస్తే జగన్మోహనరెడ్డికి ప్రజల కష్టాలు తెలుస్తాయని పేర్కొన్నారు. రోడ్లన్నీ గుంతలమయంగా మారడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని, వారి ఇబ్బందులు ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. యుద్ధప్రాతిపదికన రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టాలని, లేకుంటే కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
కేంద్ర నిధులు దుర్వినియోగం: విష్ణువర్ధన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం ఇస్తోన్న నిధులను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించి రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్‌రెడ్డి మండిపడ్డారు. రహదారుల మరమ్మతు లు చేపట్టాలంటూ విజయవాడలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా మారాయని, కాంట్రాక్టర్లకు ప్రభుత్వం 18 నెలలుగా పైసా ఇవ్వక పోవడంతో టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రావడంలేదని తెలిపారు. కేంద్రం ఇస్తోన్న నరేగా, పీఎంజీవై తదితర నిధులను పక్కదారి పట్టిస్తోన్న ప్రభుత్వం రోడ్లపై బోట్లు వేసుకుతిరిగే దుస్థితికి తెచ్చిందన్నారు. జగన్ ప్రభుత్వం రోడ్ల కోసం చేసిన ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పప్పుబెల్లాల్లా నిధుల పంపకం: మాధవ్
రాష్ట్రంలో రహదారులు చాలా అధ్వానంగా ఉన్నాయని, వాటిని తక్షణమే బాగు చేయాలని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ డిమాండ్ చేశారు. విశాఖలో బీఎ్‌సఎన్‌ఎల్ కార్యాలయం ఎదురుగా బీజేపీ నాయకులతో కలిసి ఆయన ధర్నా నిర్వహించారు. ప్రజలకు కనీస వసతులు సమకూర్చకుండా సంక్షేమ పథకాలు అంటూ ముఖ్యమంత్రి జగన్ నిధులను పప్పుబెల్లల్లా పంచుతున్నారని విమర్శించారు. తక్షణమే రహదారుల మరమ్మతులకు నిధులు విడుదల చేయాలన్నారు.
కుటుంబ పాలన అంతమే లక్ష్యం: సోము
తణుకు టౌన్: ‘‘రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతమొందించడమే బీజేపీ లక్ష్యం. రానున్న రోజుల్లో రాష్ట్రంలో 3వ పార్టీ ఉండదు. జనసేనతో పొత్తుతో అధికారంలోకి వస్తాం. మాజీ సీఎం చంద్రబాబు, బీజేపీని నాశనం చేయాలని శతవిధాలా ప్రయత్నాలు చేశారు’’ అని ఆ పా ర్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. శనివారం పశ్చిమ గోదావరి జిల్లా రేలంగిలో వన సమారాధనలో ఆ యన మాట్లాడారు. కేసీఆర్ కుటుంబ పాలనపై విసుగెత్తి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బుద్ధిచెప్పారన్నారు.
కాగితపు పడవలతో వినూత్న నిరసన
జగనన్న పాలనలో రోడ్లన్నీ అధ్వానమైపోయాయంటూ చిత్తూరు జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు శనివారం జిల్లావ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. తిరుపతిలో ఆ పార్టీ నేత భానుప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో డీబీఆర్ హాస్పిటల్ రోడ్డు గుంతల్లో కాగితం పడవలు వదిలి, వరినాట్లు వేసి వినూత్నంగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏరియల్ సర్వే పేరుతో హెలికాప్టర్‌లో తిరుగుతూ, ఏసీ గదులకు పరిమితమైన ముఖ్యమంత్రి జగన్ ఒకసారి రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని చూడాలని కోరారు. రాష్ట్రంలో పాడైన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తూ, రాస్తారోకోలు నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. వెంటనే రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అట్టాడ రవిబాబ్జీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం-ఆమదాలవలస రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ రోడ్డు అధ్వానంగా మారడం వల్లే ఇటీవల స్పీకర్ కారు ప్రమాదానికి గురైన విషయాన్ని గుర్తుచేశారు. విజయనగరం, అనంతపురం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లోనూ బీజేపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టి, వివిధ రూపాల్లో నిరసన తెలిపాయి.