జగన్ ఇలాకాలో బీజేపే మార్క్.. బీజేపీ టార్గెట్ ఏంటి?
ABN , First Publish Date - 2020-06-25T15:12:04+05:30 IST
జగన్ ఇలాకాలో బీజేపే మార్క్.. బీజేపీ టార్గెట్ ఏంటి?

ప్రధాని నరేంద్రమోదీ ప్రభావం ఏపీ సీఎం జగన్ ఇలాకాపై కూడా ప్రసరిస్తోందా? వైసీపీ ప్రాబల్యం అధికంగా ఉన్న కడప జిల్లాను బీజేపీ పెద్దలు రాజకీయంగా టార్గెట్ చేశారా? ప్రస్తుతం ఆ జిల్లాలో ప్రధాని మోదీ జపం ఎక్కువగా ఎందుకు వినిపిస్తోంది? కడప గడపలో కమలం పార్టీకి కలిసొస్తున్న అంశాలేంటి? పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే.
కడప జిల్లా అంటే రాజకీయంగా వై.ఎస్. కుటుంబానికి కంచుకోటగా ఉండటం తెలిసిన విషయమే. జిల్లా రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత తెలుగుదేశం పార్టీకి మాత్రమే పట్టు ఉంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన రాష్ట్ర విభజన నిర్ణయం.. ఆ పార్టీ ప్రాభావాన్ని కోల్పోయేలా చేసింది. అయితే ఆ పార్టీ తన ఉనికిని కోల్పోకుండా ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తోంది. ఇలా కడప జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు తప్ప ఇతర పార్టీలేవీ రాణించలేవనే భావన ఉంది. కానీ ఇప్పుడు సీఎం జగన్ ఇలాకాలో కూడా రాజకీయ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ మానియా.. కడప జిల్లాపై కూడా పడిందని తెలుస్తోంది. ఒకప్పుడు బీజేపీ అంటే కడప జిల్లా వాసులకు తెలియదంటే అతిశయోక్తి కాదు. అలాంటిది ఇప్పుడు ఇక్కడ కమలం పార్టీ వికాసం మొదలవడంతో.. ప్రధానమంత్రి మోదీ ప్రభావం బాగా పని చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఇటీవల బీజేపీలోకి చాపకింద నీరులా వలసలు ప్రారంభమయ్యాయని చెబుతున్నారు. దశాబ్దం క్రితం కడప జిల్లాలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి చిన్నపాటి ద్వితీయస్థాయి నాయకులు ఒకరిద్దరు ఉండేవారు. వారికి ప్రజల్లో గుర్తింపు కూడా ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత జిల్లాలో రాజకీయంగా పెనుమార్పులు జరిగాయి. ప్రస్తుతం కడప జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకులే బీజేపీ కండువాలు కప్పుకున్నారు.
నిజానికి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో వైసీపీ నాయకులకు గాలం వేయాలని కమలనాథులు మొదట పథకరచన చేశారట. అయితే ఆ ప్రభావం టీడీపీపై పడింది. ఆ పార్టీ నేతలే బీజేపీలోకి వలసబాట పట్టారు. జిల్లాలో ఇప్పటికే ఎంపీ సీఎం రమేశ్, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి వంటి సీనియర్ నాయకుల చేరిక.. కమలం పార్టీకి ప్లస్ అయింది. ఇప్పుడు మరికొందరు టీడీపీకి చెందిన ద్వితీయస్థాయి నాయకులు.. కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఒకప్పుడు కడప జిల్లాలో బీజేపీ అంటే తెలియని జనం.. ఇప్పుడా పార్టీ నాయకత్వ పటిమపై చర్చించుకుంటున్నారు. ఆర్టికల్ 370 రద్దు, బాలాకోట్ వైమానిక దాడులు, వన్ పెన్షన్, వన్ ర్యాంక్, త్రిపుల్ తలాక్ బిల్లు వంటి నిర్ణయాలను ప్రధాని మోదీ తీసుకోవడం నిజంగా సాహసమేనని మాట్లాడుకుంటున్నారు.
కడప జిల్లాలో బీజేపీ బలపడుతూ ఉండటానికి పలు కారణాలున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. జిల్లాలోని ప్రొద్దుటూరుకు చెందిన సత్యకుమార్ ఎన్నో ఏళ్లుగా వెంకయ్యనాయుడుకి ప్రియశిష్యుడుగా ఉంటూ.. ఇప్పుడు బీజేపీ జాతీయ కార్యదర్శి హోదాలో ఉన్నారు. జిల్లాలో కమలం పార్టీలోకి చేరికల వెనుక ఈయన క్రియాశీలకంగా పనిచేస్తున్నారని సమాచారం. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ లాక్ డౌన్ కు ముందు తరచూ జిల్లాలో పర్యటించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కడప జిల్లా ఇన్ ఛార్జి మంత్రిగా ఆయన ఉండేవారు. దీంతో జిల్లాలో చిన్నస్థాయి నుండి పెద్ద నాయకుల వరకు కన్నాతో మంచి సంబంధాలున్నాయి. అంతేకాకుండా ఆయన సామాజికవర్గం వారు కడప జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ఉండటం కూడా.. కమలం పార్టీకి కలిసివస్తోందనే చర్చ జరుగుతోంది.
ఇదిలాఉంటే, జిల్లా వైసీపీలోని అసంతృప్త నేతలు, ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలతో విభేదిస్తున్న నాయకులు కూడా బీజేపీ వైపు చూస్తున్నారట. ప్రధానంగా ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాల్లో.. అలాంటివారు ఎక్కువగా ఉన్నారట. ఇప్పటికే బీజేపీలో చేరిన ఎంపీ సీఎం రమేష్, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిలతో వారు టచ్ లో ఉన్నారని సమాచారం. లాక్ డౌన్ ముగియగానే సీఎం జగన్ ఇలాకాలో బీజేపీ పెద్దలు మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ పై ప్రత్యేక దృష్టి పెడతారని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మరి కమలనాథుల ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.