మెజారిటీ మనోభావాలు వైసీపీకి పట్టవా?
ABN , First Publish Date - 2020-10-01T07:31:53+05:30 IST
ఇతర దేశాలకు చెందిన మతాన్ని పెంచేందుకే ఆంధ్రప్రదేశ్‌లో హిందూ దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆరోపించారు...
- విదేశీ మత వ్యాప్తికే ఆలయాలపై దాడులు
- పురందేశ్వరికి కులం అంటగడతారా?
- రాజధాని అమరావతిలోనే ఉండాలి
- మా రాష్ట్ర నేతల్లో విభేదాల్లేవు: బీజేపీ కార్యదర్శి సత్యకుమార్
అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఇతర దేశాలకు చెందిన మతాన్ని పెంచేందుకే ఆంధ్రప్రదేశ్‌లో హిందూ దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆరోపించారు. మెజారిటీ ప్రజల మనోభావాలను కాపాడకుండా జగన్ ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వానికి హిందువుల ఓట్లు కావాలి కానీ వారి మనోభావాలు అక్కర్లేదా అని నిలదీశారు. సత్యకుమార్ బుధవారం ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ‘ఓట్ల రాజకీయం చేస్తూ అప్పులు తెచ్చి తాయిలాలు ఇచ్చి జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అగాధంలోకి నెడుతోంది. పాలనను పూర్తిగా గాలికి వదిలేసింది. హిందూ ఆలయాలపై వచ్చే ఆదాయాన్ని ముస్లిం, క్రైస్తవ మత పెద్దలకు పంచడం, విదేశీ మతవ్యాప్తి కోసం ప్రభుత్వం, వైసీపీలోని కొన్ని శక్తులు కుట్ర పన్నినట్లు ప్రజలు భావిస్తున్నారు.’ అన్నారు. ఇంకా ఏమన్నారంటే..
ఆ పార్టీలది మైండ్‌గేమ్..
రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ మైండ్ గేమ్ ఆడుతున్నాయి. అవినీతి, కుటుంబ పార్టీలైన వీటిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రాష్ట్ర బీజేపీలో గ్రూపులు లేవు. కొన్ని అంశాలపై అభిప్రాయాలు వేర్వేరుగా ఉండొచ్చు తప్ప కేంద్ర పార్టీ నిర్ణయానికి రాష్ట్ర పార్టీ కట్టుబడి పని చేస్తుంది. పురందేశ్వరి పదవి విషయంలో కులాన్ని ఆపాదించడం సరికాదు. జాతీయ స్థాయిలో ఆమెకున్న రాజకీయ అనుభవమే బాధ్యత అప్పగింతకు కారణమైంది. అమరావతి రైతులకు న్యాయం చేయడమే మా పార్టీ లక్ష్యం. రాష్ట్ర రాజధాని అమరావతిలోనే ఉండాలనేది మా పార్టీ విధానం. అమరావతి విషయంలో రాష్ట్ర బీజేపీ నాయకులందరిదీ ఒకే మాట. ఇందులో కొందరికి అభిప్రాయ భేదాలు తప్ప విభేదాల్లేవు. మైండ్ గేమ్‌లో ఒక ఆకు ఎక్కువ తిన్న వైసీపీ విషయంలో మేం అప్రమత్తంగా ఉన్నాం. తగిన సమయంలో స్పందిస్తాం.’