మనపైనే నిఘానా?

ABN , First Publish Date - 2020-06-26T08:18:05+05:30 IST

జగన్‌ ప్రభుత్వం మన పార్టీపై వైసీపీ దృష్టి సారించడం ఏంటి..? మన నాయకులను ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు..? ..

మనపైనే  నిఘానా?

సుజనా, కామినేని-నిమ్మగడ్డ భేటీపై రాద్ధాంతం

జగన్‌ ప్రభుత్వ తీరుపై బీజేపీ గుర్రు... జాతీయ నాయకత్వం ఆరా


అమరావతి, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): జగన్‌ ప్రభుత్వం మన పార్టీపై దృష్టి సారించడం ఏంటి..? మన నాయకులను ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు..? మన ఎంపీపైన, నేతలపైన పొరుగు రాష్ట్రంలో నిఘా పెడతారా అని బీజేపీ ఆంధ్ర నేతలు ఆగ్రహంతో ఉన్నారు. హైదరాబాద్‌ పార్క్‌ హయత్‌ హోటల్లో ఎంపీ సుజనా చౌదరి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ భేటీపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై బీజేపీ ఢిల్లీ పెద్దలు ...రాష్ట్ర నేతలకు ఫోన్లు చేసి వివరాలడిగారు. రాష్ట్రంలో 108 వాహనాల నిర్వహణ కాంట్రాక్టులో జరిగిన భారీ కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ ప్రభుత్వం ఈ ఎత్తు వేసిందని రాష్ట్ర నాయకులు చెప్పినట్లు తెలిసింది. నిమ్మగడ్డ తొలగింపును వ్యతిరేకిస్తూ కామినేని హైకోర్టును ఆశ్రయించి విజయం సాధించడం, సుప్రీంకోర్టులో కూడా కేవియట్‌ వేయడం జగన్‌ ప్రభుత్వానికి నచ్చలేదని.. అందుకే ఆ హోటల్‌లో ఏదో జరిగిపోయినట్టు చిత్రిస్తోందని పెద్దల దృష్టికి తెచ్చారు. ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర శాఖ వైసీపీ నేతలపై దాడి మొదలుపెట్టింది.


‘మీ ప్రభుత్వ విధానాల నుంచి.. మీ ఎంపీలు, ఎమ్మెల్యేల నిరసనల నుంచి దృష్టి మళ్లించడానికి హోటల్‌ విషయాన్ని మాట్లాడుతున్నారు. నిమ్మగడ్డను మీరు ఎస్‌ఈసీగా గుర్తించారా? కోర్టు ఉత్తర్వులు అమలు చేస్తున్నారా? మీతో నీతులు చెప్పించుకునే స్థాయంలో బీజేపీ లేదు’ అని ట్విటర్‌లో విరుచుకుపడింది. ఇదే వ్యవహారంపై బీజేపీ రాష్ట్రకార్యదర్శి జయప్రకాశ్‌ నారాయణ మాట్లాడుతూ.. ‘నిమ్మగడ్డ, సుజనా ఫ్యామిలీ ఫ్రెండ్స్‌.. బీజేపీ నాయకుడు కామినేని అదే సమయంలో వెళ్లడం యాదృచ్ఛికం. అందులో రహస్యం ఏమీ లేదు.. రహస్యంగా కలిసే వారికే అలాంటి ఆలోచనలు వస్తాయి’ అని ధ్వజమెత్తారు.


టీడీపీ కంటే బలంగా నిలదీస్తున్నామనే..  ప్రజాసమస్యలపై టీడీపీ కన్నా బలంగా జగన్‌ ప్రభుత్వాన్ని బీజేపీ నిలదీస్తున్నందునే తమపై వైసీపీ బురద జల్లే ప్రయత్నాలు చేస్తోందని రాష్ట్ర నేతలు ఢిల్లీ పెద్దలకు చెప్పినట్లు తెలిసింది. మొత్తం వివరాలు సేకరించిన కేంద్ర నాయకత్వం.. నిఘా వర్గాల నుంచి కూడా సమాచారం సేకరించినట్లు తెలిసింది. సీఎం జగన్‌ గానీ, ఇతర వైసీపీ నేతలు గానీ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు వ్యతిరేకంగా మాట్లాడకపోవడం.. రాజ్యసభలో బిల్లులకు సహకరిస్తుండడంతో వారి పట్ల బీజేపీ అగ్రనాయకత్వం దూకుడుగా లేదు. అయితే జగన్‌ ఏడాది పాలనపై ప్రజల్లో వ్యతిరేక అభిప్రాయం ఏర్పడిందని, ఇక దూకుడుగా వెళ్లడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే.. 108స్కాంను వదిలేప్రసక్తే లేదని కమలనాథులు స్పష్టం చేస్తున్నారు.

Updated Date - 2020-06-26T08:18:05+05:30 IST