కొత్త పథకాలతో ఎస్సీ, ఎస్టీలకు లబ్ధి
ABN , First Publish Date - 2020-07-18T08:23:00+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త పథకాలతో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు లబ్ధి చేకూరుతోందని సీఎం జగన్ తెలిపారు. తమ ప్రభుత్వం అనేక కొత్త సంక్షేమ

- అంబేడ్కర్ జయంతి నాటికి బెజవాడలో ‘పార్కు’ పూర్తి: సీఎం జగన్
అమరావతి, జూలై 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త పథకాలతో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు లబ్ధి చేకూరుతోందని సీఎం జగన్ తెలిపారు. తమ ప్రభుత్వం అనేక కొత్త సంక్షేమ కార్యక్రమాలను అమల్లోకి తెచ్చిందన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఎస్సీ, ఎస్టీ అభివృద్ధిమండలి 6వ సమావేశంలో మాట్లాడారు. సమాజంలో అట్టడుగు స్థానంలో ఉన్న పేదవారికి ఎంత మంచి జరిగితే అంత మంచిదన్నారు. ‘‘ఆసరా, చేయూత పథకాలు ఈ ఏడాది నుంచి కొత్తగా అమలవుతున్నాయి. దీంతో ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చు మరింతగా పెరగనుంది. ‘వైఎస్సార్ ఆసరా’ పథకం కింద కనీసం 25 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది. ఆయా పథకాలతో మహిళల ఆర్థిక పరిస్థితి, జీవన ప్రమాణాలు మెరుగవుతాయి’’ అని సీఎం అన్నారు. మహిళల స్వయం సాధికారితకు ఈ రెండు పథకాలు ఉపయోగపడతాయని చెప్పారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమల అభివృద్ధికి ‘అమూల్’ సంస్థతో ఈ నెల 21న అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటున్నట్టు తెలిపారు.
ఈ రంగంలోనూ మహిళలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సీఎం చెప్పారు. ఈ సందర్భంగా అధికారులు ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం చేసిన ఖర్చును సీఎంకు వివరించారు. కాగా, విజయవాడ స్వరాజ్ మైదాన్‌లో నిర్మించతలపెట్టిన అంబేడ్కర్ పార్కును వచ్చే ఏడాది ఏప్రిల్ 14న నిర్వహించే రాజ్యాంగ నిర్మాత జయంతి నాటికి పూర్తి చేయాలని సీఎం జగన్ మంత్రులు, అధికారులను ఆదేశించారు. పార్కు పనులు, విగ్రహ నిర్మాణం, ల్యాండ్ స్కేపింగ్ పనులను రెండుగా విభజించాలని సూచించారు. 20 ఎకరాల్లో నిర్మించే ఈ పార్కుతో విజయవాడ నగరం నడిబొడ్డున ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందన్నారు.