-
-
Home » Andhra Pradesh » BEML Company Moving
-
విజయవాడలో బిఇఎంఎల్ శాఖ మూసివేతకు రంగం సిద్ధం..!
ABN , First Publish Date - 2020-12-06T14:39:35+05:30 IST
బిఇఎంఎల్ విజయవాడ శాఖను శాశ్వతంగా మూసివేయడానికి వేగంగా పావులు కదుపుతోంది.

విజయవాడ: అమరావతికి అంకురార్పణతో అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు అమరావతికి వచ్చాయి. అలా వచ్చిన బిఇఎంఎల్ లిమిటెడ్ బెజవాడలో బ్రాంచ్ ఏర్పాటు చేసింది. అయితే ఆ సంస్థ ఆనందం ఐదేళ్లు నిండకుండానే ఆవిరైపోతోంది. కొత్త రాజధాని, కొత్త భవనాలు వెరసి.. వ్యాపారం అదిరిపోతుందనుకుంది. కట్ చేస్తే.. ఇప్పుడు నిలబడిన చోట నుంచి కదిలిపోయే పరిస్థితి వచ్చింది.
అమరావతిలో రాజధానితోపాటు అనేక బహుళజాతి కంపెనీలు వెలసాయి. కేంద్రప్రభుత్వ రంగం సంస్థలు సయితం తమ బ్రాంచ్‌లను ఏర్పాటు చేసేందుకు పోటీ పడ్డాయి. అయితే రక్షణశాఖకు అనుబంధంగా పనిచేసే ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎర్త్ మూవర్ లిమిటెడ్ (బిఇఎంఎల్) విజయవాడ శాఖను శాశ్వతంగా మూసివేయడానికి వేగంగా పావులు కదుపుతోంది. ఆ శాఖలోని ఉన్నతాధికారులు రూపొందించుకున్న వ్యూహాలు ఒక్కొక్కటి నెమ్మదిగా అమలు చేస్తున్నారు. ఒక శాఖను శాశ్వతంగా మూసివేయాలన్నా.. మరో చోటుకు తరలించాలని అనుకున్నా ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు లేవని చూపించుకోవాలి. దీన్ని ముందుగా అమలు చేసిన అధికారులు తాజాగా భవనాన్ని ఖాళీ చేస్తున్నట్లుగా యజమానికి నోటీసు ఇచ్చారు. మరోవైపు ఇంత కీలకమైనటువంటి సంస్థ తరలిపోతుంటే ఏపీ ప్రభుత్వం కూడా చోద్యం చూస్తోంది.