మూడు రాజధానులు జగన్ అజెండాలో లేవా?
ABN , First Publish Date - 2020-12-11T17:37:09+05:30 IST
పాలనా వికేంద్రీకరణ వట్టిమాటేనా? మూడు రాజధానులు జగన్ అజెండాలోలేవా?
అమరావతి: పాలనా వికేంద్రీకరణ వట్టిమాటేనా? మూడు రాజధానులు జగన్ అజెండాలోలేవా? అమరావతిని దెబ్బకొట్టి విశాఖ రియల్ ఎస్టేట్‌లో డబ్బులు దండుకోవడమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్నారా? కర్నూలు జ్యూడీషియల్ క్యాపిటల్ కేవలం ప్రతిపాదన మాత్రమే అంటూ అసలు సంగతి బయటపెట్టేశారా? జ్యూడీషియల్ క్యాపిటల్‌కు రాష్ట్రపతి ఆమోదం లభించాలంటూ కోర్టులో చెప్పడంతో అసలు నాటకం అందరికీ అర్థమైందా? అమరావతిని కదిలించడం అంత సులభం కాదన్న నిపుణుల మాటలే నిజమవుతున్నాయా?
అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ మూడుముక్కలాట బయటపడినప్పటినుంచీ అమరావతి కొనసాగింపుపై అనుమానాలు తలెత్తాయి. ఎన్నో ఆశలతో అమరావతికి 33వేల ఎకరాల భూములిచ్చిన రైతులు ఉద్యమబాటపట్టారు. రోజు రోజుకు వారికి మద్దతు భారీగా పెరుగుతోంది. అమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తికావస్తోంది. అమరావతి ఉద్యమకారులు, వారి మద్దతుదారులు పాదయాత్రకు సిద్ధమవుతున్నారు.
విశాఖకు రాజధాని తరలింపు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కీలక ప్రభుత్వ కార్యాలయాలను అక్కడకు మార్చు దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖలోనే ఉంటూ పనులు పర్యవేక్షిస్తున్నారు. ఇదంతా మన కంటికి కనిపించే మిథ్య నిజానికి అసలు సంగతి వేరే ఉందని మారుతున్న ప్రభుత్వ తీరునుచూస్తే అర్థమవుతోంది. హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాది వివరణ.. మూడు రాజధానుల వ్యవహారంపై అనుమానాలను మరింత బలోపేతం చేస్తోంది.
కర్నూలులో న్యాయరాజధాని అంశంపై హైకోర్టులో విచారణ జరిగినప్పుడు ప్రభుత్వం తరఫున ఇచ్చిన వివరణ, పాలనా వికేంద్రీకరణకు పడుతున్న అడుగులు వేగం తగ్గాయనే అనిపిస్తోంది. రాజధాని అమరావతిలో హైకోర్టు ఏర్పాటును నోటిఫై చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువరించాక.. మళ్లీ కర్నూలులో ఏర్పాటయ్యేలా ఎలా చట్టం చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లుల్ని శాసనమండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీకి సిఫారసు చేసి తర్వాత వాటిని శాసనసభలో మరోమారు ప్రవేశపెట్టి ఎలా ఆమోదిస్తారని నిలదీసింది. ఇది సభా వ్యవహారాల నిబంధనలను ఉల్లంఘించినట్లు కాదా అని వ్యాఖ్యానించింది. రాజధాని విషయంపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు కమిటీలను ఏర్పాటు చేయాల్సిన అవసరమేముందని ప్రశ్నించింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే సమాధానమిస్తూ.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు సంబంధించిన చర్యలు మాత్రమే ప్రారంభమయ్యాయని, అది కేవలం ప్రతిపాదన మాత్రమేనన్నారు. అయితే దీనిపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు అనువుగా ‘జ్యుడీషియల్ కేపిటల్’ పేరుతో పాలనా వికేంద్రీకరణ చట్టం చేసేశాక.. అది కేవలం ప్రతిపాదన మాత్రమేనని ఎలా చెబుతున్నారని ప్రశ్నించింది. ఇందుకు దవే బదులిస్తూ.. హైకోర్టు ప్రధాన బెంచ్ ఏర్పాటు కోసం తుదిగా రాష్ట్రపతి ఆమోదం తెలపాల్సి ఉంటుందని వివరించారు.