మంత్రిపై అయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణలు

ABN , First Publish Date - 2020-09-18T17:59:21+05:30 IST

ఆంధ్రప్రదేశ్ కార్మికశాఖ మంత్రి జయరాంపై మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

మంత్రిపై అయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణలు

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాంపై మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. మంత్రి, జగన్ సర్కార్‌పై విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిపరులపై ఫిర్యాదు చేసేందుకు ప్రేవేశపెట్టిన 11440కు లైవ్‌లో కాల్ చేసి మంత్రి కుమారుడు ఈశ్వర్‌పై ఫిర్యాదు చేశారు. మంత్రి జయరాం అవినీతిలో సీఎం జగన్‌కు పోటీ పడుతున్నారని ఆయన ఆరోపించారు.


సంచలన ఆరోపణలు ఇవీ...

మంత్రి కుమారుడు ఈశ్వర్‌కు, ఇప్పటికే ఈఎస్ఐ స్కాములో అరెస్ట్ అయిన ఏ-14 కార్తీక్ గిఫ్ట్ ఇచ్చారు. ఖరీదైన బెంజ్ కారును మంత్రి కుమారుడికి పుట్టినరోజున సందర్భంగా ఇచ్చారు. కారుకు ఫైనాన్స్ చేయించి మరీ కార్తీక్‌ ఇచ్చారు. ఏ సంబంధంతో కారును కానుకగా ఇచ్చారో మంత్రి సమాధానం ఇవ్వాలి. ఏ 14 మంత్రి జయరాంకు బినామీ. అది పుట్టినరోజు కానుక కాదు...మంత్రికి ఇచ్చిన లంచం. కార్మిక శాఖలో అవినీతికి పాల్పడింది అచ్చెన్నాయడు కాదు.. మంత్రి జయరాం. నేనే ఆధారాలతో చూపిస్తున్నా.. నిరూపిస్తా కూడా. దీనిపై విచారణ జరిపించాలి. న్యాయస్థానంతో విచారణ చేయించాలి. ముఖ్యమంత్రికి కార్మికశాఖ మంత్రి జయరాంపై దర్యాప్తు చేసే దమ్ము ఉందా..?. మేము ప్రశ్నిస్తే మమ్మల్ని ముఖ్యమంత్రి బూతులు తిట్టిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ముఖ్యమంత్రి నోరు మెదపరు. జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే మంత్రి జయరాంతో  రాజీనామా చేయించాలి. మంత్రి మండలి నుంచి జయరాంను తప్పించాల్సిందే. బీసీ నేతలను టచ్ చేస్తే ఊరుకోం. మా ఆగ్రహానికి ముఖ్యమంత్రి సమాధి అయిపోతారు. నా ఆరోపణలపై ముఖ్యమంత్రి ఎలా స్పందింస్తారో చూస్తాను. మాకు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు అంటే ఇష్టంఅని అయ్యన్న తీవ్ర ఆగ్రహంతో సంచలన ఆరోపణలు చేశారు.

Updated Date - 2020-09-18T17:59:21+05:30 IST