ప్రైవేటు వైద్యంపై అటాక్
ABN , First Publish Date - 2020-05-17T09:44:23+05:30 IST
కడుపు చించుకొంటే కాళ్ల మీద పడుతుంది అన్నట్టే ఉంది రాష్ట్రంలోని ప్రతి కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రి పరిస్థితి! హెల్త్ సెక్టార్ ఎప్పుడూ లేనంత గడ్డు కాలాన్ని ఇప్పుడు చవిచూస్తోంది.

కార్పొరేట్‌నూ కూల్చేసిన కరోనా..
పెద్ద పెద్ద కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ వైద్యులకు 2 నెలలుగా సగం జీతం
నాడు నెలకు 60 బైపాస్ సర్జరీలు
ఇప్పుడు 3 నెలలకు ఐదు ఎక్కువ
‘కరోనా పోనీ..చూద్దాంలే’ అంటూ
వేలాదిగా శస్త్రచికిత్సలు వాయిదా
ఆక్యుపెన్సీ ఐదు శాతానికి పతనం
ఓపీ 20 శాతానికీ.. ఐపీ 5 శాతానికీ
జీతాలు తగ్గించుకోవాలని తాఖీదు
నర్సులకు రేపు.. మాపు.. హామీలు
ఘోరంగా పారామెడికల్ పరిస్థితి
మళ్లీ పిలుస్తామంటూ ఇప్పటికే
కొంతమంది సిబ్బంది ఇంటికి..
స్పెషలిస్టులను పిలిచేవారే లేరు
కరోనా... ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన మహమ్మారి. కంటికి కనిపించని చిన్న వైరస్ ప్రపంచాన్నే స్తంభింప చేసింది. వ్యవస్థల్ని కుప్పకూల్చింది. పెద్దోడికి ఆకలి రుచి చూపించింది. పేదవాడి కడుపుకొట్టింది. కరోనాపై సైన్యంలా యుద్ధం చేస్తున్న వైద్య రంగాన్ని కూడా విడిచిపెట్ట లేదు. ప్రైవేటు ఆస్పత్రుల ఆదాయానికి గండికొట్టి... వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది జీవితాల్ని ప్రశ్నార్థకం చేసింది. కరోనా పుణ్యమా అని మిగిలిన వ్యవస్థల మాదిరిగానే ప్రైవేటు వైద్యులకు కూడా జీతాల్లో కోతలు పడ్డాయి. కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న నర్సులు సైతం జీతాల కోసం ఎదురుచూసే పరిస్థితి! పారామెడికల్ సిబ్బంది అర్ధాకలితో పడుకోవాల్సిన దుస్థితికి కరోనా చేర్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే... ‘ప్రైవేటు వైద్యంపై కోలుకోలేని దెబ్బపడింది.’!
‘‘కార్డియాలజీకి మాది ఫేమస్ ఆస్పత్రి. ప్రతి నెలా 50 నుంచి 60 బైపాస్ సర్జరీలు చేసేవాళ్లం. కార్డియాలజీ రోగులు వందలమంది క్యూ కట్టేవాళ్లు. బెడ్లు లేక వారిలో కొందర్ని వేరే ఆస్పత్రులకు పంపేసేవాళ్లం. ఇదంతా గతం. కరోనా వచ్చింది.. ఆస్పత్రి ఓపీ 10 శాతానికి పడిపోయింది. నెలకు 60 బైపాస్ సర్జరీలు చేసేవాళ్లం. ఇప్పుడు మార్చి, ఏప్రిల్, మే నెలలను కలుపుకొన్నా, ఐదు బైపాస్ సర్జరీలు దాటలేదు. మరో రెండునెలలు ఇలాగే ఉంటే ఆస్పత్రి మూసుకోవాల్సిందే.’’...విజయవాడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం గోడు ఇదీ..
‘‘ఓపీ దారుణంగా పడిపోయింది. శస్త్ర చికిత్సలు జీరో. ఏప్రిల్, మేలో ఆదాయం ఐదుశాతమే. మీ అందరికీ పూర్తిస్థాయిలో జీతాలు ఇవ్వలేం. డాక్టర్లకు 50 శాతం, నర్సులకు 40 శాతం, మిగిలిన సిబ్బందికి 30 శాతం జీతాలు కటింగ్. మరో రెండు నెలలు ఓర్చుకోవాల్సిందే’’.. విశాఖపట్నంలో ఒక ప్రైవేటు ఆస్పత్రి తన సిబ్బందికి ఇచ్చిన తాఖీదు ఇదీ..
అమరావతి, మే 16 (ఆంధ్రజ్యోతి): కడుపు చించుకొంటే కాళ్ల మీద పడుతుంది అన్నట్టే ఉంది రాష్ట్రంలోని ప్రతి కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రి పరిస్థితి! హెల్త్ సెక్టార్ ఎప్పుడూ లేనంత గడ్డు కాలాన్ని ఇప్పుడు చవిచూస్తోంది. మార్చి నెల సగం వరకూ చాలా ఆస్పత్రుల్లో పడకలు పూర్తిగా నిండిపోయి ఉండేవి. ఆ నెల 25 తర్వాత దేశంలో కరోనా విజృంభించింది. లాక్‌డౌన్ అమలులోకి వచ్చింది. అప్పటి నుంచే ఆస్పత్రులు ఖాళీ కావడం మొదలయింది. కొత్తవారు రావడం కాదు.. అప్పటికే ఉన్నవారూ బిల్లులు చెల్లించేసి ఇంటిముఖం పట్టారు. ‘కరోనాతో కష్టం’ అనే భావనతో వేలాదిమంది శస్త్ర చికిత్సలు కూడా వాయిదా వేసుకున్నారు. ఇలా రెండు నెలలు తిరిగేటప్పటికి అంతా తలకిందులై పోయింది. హెల్త్ సెక్టార్ మొత్తంగానే కుదేలయింది. కరోనా దెబ్బకి పెద్ద పెద్ద ఆస్పత్రులే సంక్షోభంలో పడ్డాయి. ఈ ఎఫెక్ట్ అంతా వైద్యులు, నర్సులు ఇతర సిబ్బందిపై పడింది. గతంలో వేలకు వేలు ఓపీలతో నడిచే చాలా ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇప్పుడు అవుట్ పేషెంట్లను వేళ్ల మీద లెక్కపెట్టుకోవాల్సిందే! అన్నిరకాల సమస్యలతో వచ్చేవారు తగ్గిపోయారు. గుండె, కిడ్నీ, గ్యాస్ సంబంఽధిత సమస్యలున్నవారే వైద్యం కోసం వస్తున్నారు. దీంతో ఆక్యుపెన్సీ 5 శాతానికి పడిపోయింది.
జీతాలు 50 శాతం కట్
ప్రతి ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం వైద్యులతో పాటు మిగిలిన సిబ్బంది కూడా జీతాలు ఇవ్వలేక దాదాపుగా చేతులేత్తేసిం ది. కొన్ని చోట్ల వైద్యుల జీతాల్లో 50 శాతం, నర్సుల జీతాల్లో 40 శాతం, పారామెడికల్ సిబ్బంది జీతాల్లో 30 శాతం కోతలు వేశాయి. ఇచ్చే జీతాలు ఆధారంగా శ్లాబ్‌లు పెట్టి మరీ భారీగా కత్తెర వేశారు. ఇక కన్సల్టెంట్ వైద్యులు రెండు నెలల ఖాళీగా కూర్చున్నారు. కన్సల్టెంట్ వైద్యులంటే వారు చూసిన ఓపీలు, చేసిన శస్త్ర చికిత్సల్లో కొంత భాగం ఆస్పత్రికి ఇచ్చి, కొంత భాగం వైద్యులు తీసుకుంటారు. వారికి ఇప్పుడు పని లేదు. కార్డియాలజీ, గ్యాస్ట్రో, రేడియాలజీ, ఆంకాలజీ, నెఫ్రాలజీ స్పెషలిస్టులు ఇళ్లకే పరిమితం అయ్యారు.
రోజువారి కూలీ...
ఎంబీబీఎస్ వైద్యుల పరిస్థితి మరి దారుణంగా మారింది. వీరంతా స్పెషలిస్టుల కింద సహాయకులుగా విధులు నిర్వహిస్తారు. లేదంటే ఎమర్జెన్సీ వార్డులలో ప్రాథమిక చికిత్స అందిస్తారు. వీరి జీతాలు రూ. 25 వేలు నుంచి 30 వేలు సగటున ఉంటాయి. మరీ సీనియర్ అయితే 40 వేలుపైగా తీసుకొంటారు. కరోనా సమయంలో స్పెషలిస్ట్ వైద్యులకే పని లేకపోవడంతో ఎంబీబీఎస్ వైద్యులను తగ్గించుకోడానికి కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు సిద్ధమయ్యాయి. నెలనెలా జీతాలు ఇవ్వలేమని తేల్చేసి...‘అవసరం అయితే పిలుపిస్తాం’ అని ఇంటికి పంపిస్తున్నారు. మరికొన్ని ఆస్పత్రులయితే.. నెల జీతం తీసుకొనే వైద్యులకు ఏ రోజుకు ఆ రోజు పేమెంట్ చేస్తోంది. వారు తీసుకొనే వేతనం ఆధారంగా రోజుకు ఎంత పడుతుందో లెక్కవేసి చేతిలో పెడుతున్నాయి. అంటే రోజుకూలీ అన్నమాట! ఇది కూడా నెలలో 15 రోజులకు మాత్రమే ఇస్తున్నాయి. ఉదాహరణకు.. ఏప్రిల్ నెలలో విజయవాడలో చాలా మంది సహాయ వైద్యులకు రూ.5 వేలు నుంచి రూ.6 వేలు మాత్రమే చేతికి వచ్చాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పవచ్చు.
సేవకు ఇస్తే..
కరోనాను ఎదుర్కొనేందుకు ప్రైవేటు ఆస్పత్రుల సేవలనూ ప్రభుత్వం వినియోగించుకొంటోంది. వీటిలో ప్రైవేటు ఆస్పత్రులు, ప్రైవేటు మెడికల్ కాలేజీలు కూడా ఉన్నాయి. అప్పటినుంచి సాధారణ రోగులు ప్రైవేటు ఆస్పత్రుల దిక్కే చూడటం లేదు. అక్కడ కొవిడ్ కేసులు మాత్రమే చూస్తారనే భావం బాగా వ్యాప్తి చెందటంతో ఈ ఆస్పత్రుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వాటిలో విధులు నిర్వహించే వైద్యులు, నర్సింగ్, ఇతర సిబ్బంది పరిస్థితి దారుణంగా ఉంది. సిబ్బందిని తొలగించేందుకు కొన్ని ఆస్పత్రులు సిద్ధమయ్యాయి. ప్రభుత్వం చెబితేనే కొవిడ్ ఆస్పత్రులుగా మారిన దరిమిలా.. అక్కడ విధులు నిర్వహించే వైద్యులు, ఇతర సిబ్బందిని ప్రభుత్వమే ఆదుకోవాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.