నేటి నుంచి రైతు భరోసా

ABN , First Publish Date - 2020-05-30T15:00:29+05:30 IST

నేటి నుంచి రైతు భరోసా

నేటి నుంచి రైతు భరోసా

 జిల్లాలో 706 కేంద్రాలు 

తొలివిడత 622 ఆర్‌బీకేలు సిద్ధం 

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రైతులతో మాట్లాడనున్న సీఎం జగన్‌   

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)  ప్రభుత్వపరంగా అన్నదాతల అవసరాల కోసం ఏర్పాటుచేసిన ‘రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకే)’ సేవలు శనివారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమరావతి నుంచి ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభిస్తారు. జిల్లాకు 706 కేంద్రాలు మంజూరయ్యాయి. జిల్లాలో 739 గ్రామ సచివాలయాలు వుండగా, ప్రతి సచివాలయం పరిధిలో ఒక భరోసా కేంద్రం ఏర్పాటుచేయాలని భావించారు. అయితే భీమిలి మండలంలో ఐదు గ్రామ పంచాయతీలను జీవీఎంసీలో విలీనం చేయడం, మేజరు పంచాయతీల్లో ఐదారు గ్రామ సచివాలయాలున్నచోట ఒకటి లేదా రెండు కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేయడంతో వీటి సంఖ్య 706కు తగ్గింది. వివిధ శాఖలకు చెందిన భవనాలు, అద్దె ఇళ్లల్లో ఏర్పాటుచేసిన 622 కేంద్రాలను శనివారం ప్రారంభించనున్నారు. ఇంటర్నెట్‌ సదుపాయం, భవనాలు అందుబాటులో లేనిచోట కేంద్రాలను తర్వాత ప్రారంభిస్తారు. కాగా ఆర్‌బీకేలకు సొంత భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఒక్కొక్కటి రూ.22 లక్షల వ్యయంతో 800 నుంచి 100 చదరపు అడుగుల విస్తీర్ణంలో పక్కా భవనాలు నిర్మిస్తారు.     


  జిల్లాలో 622 రైతు భరోసా కేంద్రాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శనివారం ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎస్‌.రాయవరం మండలం గుడివాడ రైతు భరోసా కేంద్రంలో రైతులతో మాట్లాడతారు. నాతోపాటు పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, ఇతర అధికారులు కూడా పాల్గొంటారు.     

ఆర్‌బీకేల్లో అందే సేవలు...  ప్రతి ఆర్‌బీకేలో ఒక డిజిటల్‌ కియోస్క్‌ ఉంటుంది. రైతులు తమకు కావాల్సిన వ్యవసాయ ఉత్పాదక సేవలను ఆర్డర్‌ చేసి 48 గంటల్లో ఆన్‌లైన్‌లో పొందవచ్చు.  గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా జిల్లాస్థాయిలో వున్న వ్యవసాయ నిపుణులు/ శాస్త్రవేత్తల నుంచి  పంటల సాగుకు సంబంధించి సమగ్ర సూచనలు, సలహాలు పొందవచ్చు. వాతావరణ సమాచారం, మార్కెటింగ్‌...అంటే వివిధ ప్రాంతాల్లోని మార్కెట్‌లలో ఆయా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఏ విధంగా వున్నాయో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.  ఈ కేంద్రాల్లో తరచూ రైతులతో సమావేశాలు నిర్వహిస్తూ, పంట సాగులో మెలకువలు, సలహాలు, సూచనలు ఇస్తారు.  వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాలైన పశుసంవర్థక, మత్స్య, తదితర శాఖల సేవలు కూడా పొందవచ్చు.

Updated Date - 2020-05-30T15:00:29+05:30 IST