బంధంపై కత్తి!

ABN , First Publish Date - 2020-12-06T08:40:08+05:30 IST

బంధువులు, రక్త సంబంధికుల మధ్య రేగిన ఘర్షణల్లో చోటుచేసుకుంటున్న ఘాతుకాలెన్నో! ‘మాకు ఆస్తులే ముఖ్యం’ అని ఆత్మీయులను పొట్టనబెట్టుకొన్న

బంధంపై కత్తి!

ఆస్తుల కోసం ఆత్మీయులు బలి.. కుటుంబాల్లోనే హంతకులు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

బంధువులు, రక్త సంబంధికుల మధ్య రేగిన ఘర్షణల్లో చోటుచేసుకుంటున్న ఘాతుకాలెన్నో! ‘మాకు ఆస్తులే ముఖ్యం’ అని ఆత్మీయులను పొట్టనబెట్టుకొన్న కేసులు వీటిలో కొన్ని! ‘మాకు కక్షలే కావాలి’ అని కుటుంబసభ్యులపైనే కత్తులు దూసిన ఉదంతాలు మరికొన్ని! రాష్ట్రంలో జరుగుతున్న హత్యల్లో సుమారు 14శాతం కుటుంబ కలహాలకు సంబంధించినవేనని ఎన్‌సీఆర్‌బీ (నేషనల్‌ క్రైమ్‌ రికార్డు బ్యూరో) తాజాగా విడుదల చేసిన 2019- రిపోర్టు పేర్కొంది.

 

కొడుకు కన్నా కరెన్సీయే ముద్దయింది..

విశాఖకు చెందిన జలరాజు ముంబై పోర్టులో సీ మెన్‌గా పనిచేసేవాడు. తండ్రి వీర్రాజుతో ఆర్థిక లావాదేవీల విషయంలో అతడికి విభేదాలు ఉన్నాయి. ఈఏడాది ఆగస్టు 14వ తేదీన జలరాజు నెత్తిమీద సుత్తితో కొట్టి వీర్రాజు అతని ప్రాణాలుతీశాడు. అదేగనుక కొంతైనా జలరాజు ఆలోచించి ముందే సర్దుబాటు చేసుకున్నట్లయితే తన ప్రాణం పోయేది కాదేమో. కుమారుడే కదా అనుకుని  వీర్రాజు ఆలోచించినా జైలు తప్పేది! 


ఇప్పుడు తండ్రి వంతు..

రెండు రోజుల క్రితం అనంతపురం జిల్లాలో కుమారుడు గణేశ్‌ తన భార్యతో కలిసి తండ్రి నారాయణ స్వామిని కొడవలితో నరికి చంపేశాడు. తండ్రిని అడ్డు తప్పిస్తే ఆస్తి దక్కుతుందన్న ఉద్దేశంతోనే ఈ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. 


కర్రలతో కొట్టి.. వైద్యం అడ్డుకొన్నారు..

గుంటూరు జిల్లాకు చెందిన తాడికొండ సుబ్బారావుకు పదెకరాల ఆస్తి ఉంది. ఆ  ఆస్తిలో కుమారులకు తక్కువ పంచి తాను ఎక్కువగా అట్టిపెట్టుకున్నాడు. దీంతో ఆగ్రహించిన వెంకటేశ్వరరావు, గోవిందు... ఈ ఏడాది అక్టోబరు నాలుగో తేదీన కర్రలతో కొట్టి తండ్రిని తీవ్రంగా గాయపరిచారు. బంధువులు ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తే, అడ్డుకొన్నారు. సకాలంలో వైద్యం అందక ఆ తరువాత కొన్ని గంటల్లోనే సుబ్బారావు చనిపోయాడు. 


అన్నను చంపి.. శవం మాయం

ఆస్తితో పాటు ఉద్యోగం చేస్తున్న అమ్మ పదవీ విరమణ డబ్బు కోసం సొంత అన్న శేఖరబాబును చంపేసింది చెల్లెలు హేమలత. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో రక్షాబంధన్‌కు పదిరోజుల ముందు ఈ హత్య జరిగింది.! తన భర్త సురేశ్‌ కుమార్‌తో కలిసి రోకలిబండతో మోది శేఖర్‌కు కడతేర్చింది. అనంతరం మృతదేహాన్ని మాయం చేసింది. 


తాడు బిగించి.. నీట ముంచాడు..

ఆస్తి పంపకాల్లో అన్యాయం జరిగిందనే కోపంతో సొంతచిన్నాన్న కుమారులనే కడతేర్చాడు. అనంతపురం జిల్లా గార్లదిన్నెలో ఇద్దరు చిన్నారులను చాక్లెట్‌ కొనిస్తానని తీసుకెళ్లిన పెదనాన్న కుమారుడు రాము హత్య చేయడం కలకలం సృష్టించింది. ఈ ఏడాది అక్టోబరు ఎనిమిదో తేదీన మూడేళ్ల చిన్నారి మెడకు తాడు బిగించి, ఆరెళ్ల బాలుడిని నీటిలో పడేసి చంపేశాడు. 


ఎందుకింత ఉన్మత్తత!

తల్లి, తండ్రి, పిల్లలూ ఒకే ఇంట్లో ఉన్నా మానసికంగా దగ్గర కాలేకపోతుండటమే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. రాజీపడే ధోరణి లేకపోవడం, తనకు దక్కాల్సింది ఎలాగైనా సాధించుకోవాలన్న నైజంతో విచక్షణ కోల్పోతున్న వ్యక్తుల వల్ల కుటుంబాల్లో అల్లకల్లోలర  రేగుతోందని విశ్లేషిస్తున్నారు.  

Updated Date - 2020-12-06T08:40:08+05:30 IST