రేపు విజయవాడలో రాష్ట్రస్థాయి శిక్షణ

ABN , First Publish Date - 2020-03-08T11:41:43+05:30 IST

కరోనా వైరస్‌ నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కుటుంబ సంక్షేమశాఖ ఇన్‌చార్జి కమిషనర్‌ వి.విజయరామరాజు హెచ్చరించారు

రేపు విజయవాడలో రాష్ట్రస్థాయి శిక్షణ

అమరావతి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కుటుంబ సంక్షేమశాఖ ఇన్‌చార్జి కమిషనర్‌ వి.విజయరామరాజు హెచ్చరించారు. ఈనెల 9న విజయవాడలో రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 13 జిల్లాల డీఎంహెచ్‌వోలు, సర్వేలెన్స్‌ అధికారులు, నోడల్‌ అధికారులతో శనివారం విజయవాడలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా కేసులు నమోదు కాకపోవడం శుభపరిణామంగా పేర్కొన్నారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకూడదని, క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. 108 అంబులెన్స్‌ల నిర్వహణ, ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌(ఆర్‌ఆర్‌టీ), బయోమెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, పారిశుద్ధ్య నిర్వహణ, అంబులెన్స్‌ డ్రైవర్లు, ఈఎంటీలకు శిక్షణపై తీరుపై ఆయన ఆరాతీశారు. రోగులను ఆర్‌ఆర్‌టీ ఆధ్వర్యంలోనే ఐసోలేషన్‌ వార్డుకు తీసుకువెళ్లాలని, నమూనాలు తీసుకున్న వెంటనే రాష్ట్రస్థాయి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు సమాచారం అందించాలని పేర్కొన్నారు. రిపోర్టు నెగిటివ్‌ వచ్చినా కూడా అశ్రద్ధ వహించవద్దని, డిశ్చార్జ్‌ చేసే సమయంలోనూ తాము సూచించిన మార్గదర్శకాలను తప్పక పాటించాలన్నారు. సమావేశంలో డీహెచ్‌ అరుణకుమారి, డీఎంఈ వెంకటేశ్‌, ఏపీవీవీపీ కమిషనర్‌ రామకృష్ణ, ఎన్‌హెచ్‌ఎం ఎస్‌పీఎం అప్పారావు, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-08T11:41:43+05:30 IST