గేట్లకు అడ్డంగా గోడలు

ABN , First Publish Date - 2020-07-28T08:13:17+05:30 IST

సచివాలయంలో గేట్లకు అడ్డంగా గోడలు కడుతున్నారు. ఏపీ సచివాలయం చుట్టూ ఆరు గేట్లున్నాయి. అందులో నాలుగు గేట్లు సచివాలయ నిర్మాణ సమయంలోనే ఏర్పాటు చేయగా...

గేట్లకు అడ్డంగా గోడలు

సచివాలయంలో వాస్తు పేరిట వింత నిర్మాణం

భద్రతా కారణాలతోనే అంటున్న అధికారులు


అమరావతి, జూలై 27(ఆంధ్రజ్యోతి): సచివాలయంలో గేట్లకు అడ్డంగా గోడలు కడుతున్నారు. ఏపీ సచివాలయం చుట్టూ ఆరు గేట్లున్నాయి. అందులో నాలుగు గేట్లు సచివాలయ నిర్మాణ సమయంలోనే ఏర్పాటు చేయగా, వాస్తు కోసమంటూ ఏడాదిన్నర కిందట గత ప్రభుత్వం మరో రెండు గేట్లను అమర్చింది. ఏడాది పాలన పూర్తి చేసుకున్న వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ గేట్లకు అడ్డంగా గోడల నిర్మాణానికి పూనుకుంది. సచివాలయానికి ఉత్తరం దిశగా ఉన్న గేటుకు, దానికి ఎదురుగా దక్షిణ దిశలో మొదటి బ్లాకు పక్కనున్న గేటుకు అడ్డంగా సీఆర్‌డీఏ అధికారులు గోడలు నిర్మిస్తున్నారు. అలాగే, సచివాలయం వైపు నుంచి అసెంబ్లీకి వెళ్లే అసెంబ్లీ అయిదవ గేటుకు అడ్డంగా గోడకట్టనున్నట్లు పలువురు చెబుతున్నారు. గోడ నిర్మాణానికి కావలసిన రాళ్లను కూడా ఇప్పటికే అక్కడికి చేర్చారు. అసెంబ్లీ వర్గాల నుంచి అధికారిక అనుమతులు ఇంకా రావాల్సి ఉందని, రాగానే అక్కడా గేటుకు అడ్డంగా గోడ కట్టనున్నట్లు పలువురు అధికారులు చెబుతున్నారు. గేట్లు ఉంటుండగానే ఈ నిర్మాణాలు చేపట్టడం విశేషం. భద్రతాపరమైన చర్యలని అధికారులు అంటుండగా, కాదు వాస్తు కోసమేనని విమర్శకులు అంటున్నారు.   


అంతటా అదే చర్చ..

‘గేట్లకు అడ్డంగా ఆగమేఘాలపై గోడలు కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? వాస్తు కోసమే అయి ఉంటుంది’ అని పలువురు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. భద్రతాపరమైన ఇబ్బందులు ఇప్పుడు సచివాలయానికి కొత్తగా ఏం వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. సచివాలయంలో కొత్తగా ఏదైనా నిర్మాణం చేయాలన్నా, ఇప్పటికే ఉన్న నిర్మాణాన్ని తొలగించాలన్నా సాధారణపరిపాలనశాఖ అనుమతి తప్పనిసరి. అయితే, గేట్లకు అడ్డంగా గోడలు ఎందుకు కడుతున్నారో ఆ శాఖకూ ఇప్పటి వరకు సమాచారం లేదని, నిర్మాణానికి ముందస్తు అనుమతి కూడా లేదనే ప్రచారం జరుగుతోంది. అయితే, పై అధికారులు ఆదేశించారని, అందుకే గోడలు నిర్మిస్తున్నామని సచివాలయ భద్రతాధికారులకు సీఆర్‌డీఏ అధికారులు చెప్పినట్లు తెలిసింది. 

Updated Date - 2020-07-28T08:13:17+05:30 IST