మరికాసేపట్లో ఏపీ ఎస్ఈసీ రమేష్ కీలక ప్రకటన
ABN , First Publish Date - 2020-03-16T18:36:12+05:30 IST
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయమై గవర్నర్ హరిచందన్‌కు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను గవర్నర్ తన కార్యాలయానికి పిలిపించారు. సోమవారం ఉదయం గవర్నర్‌తో భేటీ అయిన రమేష్.. సుమారు 45 నిమిషాల పాటు ఈ వ్యవహారంపై నిశితంగా వివరణ ఇచ్చారు. ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడేందుకు రమేష్ నిరాకరించారు. గవర్నర్ కార్యాలయం నుంచి నేరుగా బందర్ రోడ్డులోని తన కార్యాలయానికి వెళ్లిన ఆయన ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
కాసేపట్లో కీలక ప్రకటన..
ఈ సందర్భంగా గవర్నర్‌తో చర్చించిన అంశాలను అధికారులకు ఆయన వివరించారు. కాగా మరికాసేపట్లో ఎన్నికల కమిషన్ కీలక పత్రికా ప్రకటన విడుదల చేయనున్నది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై పత్రికా ప్రకటనలో వివరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఆ ప్రకటనలో ఏం ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు..? అనే విషయాన్ని ప్రకటనలో ఎస్ఈసీ క్లారిటీగా తెలియజేయనున్నారని సమాచారం.
ఇదిలా ఉంటే.. ఎన్నికలు యథావిథిగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరోవైపు.. స్థానిక ఎన్నికలు వెంటనే జరిపించాలంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలైంది. తాండవ యోగేష్, జనార్ధన్ అనే వ్యక్తులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్‌కు ధర్మాసనం అనుమతించింది. ఇవాళ మధ్యాహ్నం విచారణకు రానుంది.