ఉసిగొల్పిన ఉన్నతాధికారి!

ABN , First Publish Date - 2020-12-27T08:07:01+05:30 IST

దేశవ్యాప్తంగా బ్యాంకులు, ఆర్థిక నిపుణుల్లో సంచలనం సృష్టించిన ‘చెత్త పని’కి ఒక ఉన్నతాధికారే కారణమని తెలుస్తోంది.

ఉసిగొల్పిన  ఉన్నతాధికారి!

  • రెచ్చిపోయిన జిల్లా స్థాయి అధికారులు
  • బ్యాంకుల ముందు ‘చెత్త పని’కి అదే కారణం!
  • చెత్త పోయిస్తా.. తాళాలు వేయిస్తా!
  • బ్యాంకర్ల భేటీలో అధికారి విశ్వరూపం 

అమరావతి, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా బ్యాంకులు, ఆర్థిక నిపుణుల్లో సంచలనం సృష్టించిన ‘చెత్త పని’కి ఒక ఉన్నతాధికారే కారణమని తెలుస్తోంది. ‘పథకాలకు రుణాలు ఇవ్వనందుకు నిరసన’ పేరిట కృష్ణా జిల్లాలోని బ్యాంకుల ముందు చెత్తగుమ్మరించింది లబ్ధిదారులు కాదని... ఒక అధికారి పరోక్ష ఆదేశాల మేరకే ఇదంతా జరిగిందని కేంద్రానికి సమాచారం అందింది. స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దీనిపై స్పందించడంతో... ఈ ఘటనకు మసిపూసి మారేడుకాయ చేసి, సదరు అధికారిని వదిలేసి, పారిశుధ్య కార్మికులను బలి చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల కలెక్టర్లు, ఇతర అధికారులతో జరిగిన సమావేశంలో ఒక ఉన్నతాధికారి... ‘పథకాలకు రుణాలు ఇవ్వని బ్యాంకుల కథ తేల్చాల్సిందే’ అనేలా మాట్లాడారు. అప్పటి నుంచి కలెక్టర్లు బ్యాంకులపై రెచ్చిపోవడం మొదలుపెట్టారు. కృష్ణా జిల్లాలో ఒక అధికారి ఏకంగా బ్యాంకుల ముందు ‘నిరసన’గా చెత్త పోయించారు.


ఈ ఘటన జరగడానికి ముందురోజే, జిల్లాస్థాయి బ్యాంకర్లతో సదరు అధికారి సమావేశమయ్యారు. ‘‘పథకాలకు మీరు రుణాలు ఇవ్వకుంటే బ్యాంకుల ముందు చెత్త పోయిస్తా. కరెంట్‌, వాటర్‌  కనెక్షన్లు కట్‌ చేయిస్తా. బ్యాంకులకు తాళాలు వేయించేస్తా. మీరు లేకున్నా వచ్చే నష్టమేమీ లేదు’’ అనే స్థాయిలో విశ్వరూపం ప్రదర్శించారు. ఈ హెచ్చరికలతో బ్యాంకర్లు ఖిన్నులయ్యారు! ప్రభుత్వ పెద్దల వద్ద మార్కులు కొట్టేందుకు బ్యాంకులపై రెచ్చిపోయి... ఆ అధికారి ‘చెత్తపని’ చేయించారు. జాతీయ స్థాయిలో వివాదాస్పదం కావడంతో ఉక్కిరి బిక్కిరయ్యారు. గురువారం సాయంత్రం బ్యాంకు అధికారులతో సమావేశమై... ‘‘మీరు బాగా సహకరిస్తున్నారు. ఎక్కడన్నా, ఏదైనా జరిగి ఉంటే దానిని రుణాలందని వారు చేసినవిగానే పరిగణించండి’’ అని వేడుకోవడం కొసమెరుపు.

Updated Date - 2020-12-27T08:07:01+05:30 IST