బ్యాంకులపై బండలు

ABN , First Publish Date - 2020-12-27T07:47:09+05:30 IST

బ్యాంకులు చేసేది వ్యాపారమే! కానీ... వాటికి సామాజిక బాధ్యత ఉంది. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేసే పథకాలకు రుణాలు ఇవ్వాలి.

బ్యాంకులపై బండలు

  • ఇప్పటిదాకా బ్యాంకర్లతో ప్రభుత్వాల సుహృద్భావం
  • పథకాల అమలు విషయంలో పరస్పర సహకారం
  • ఇప్పుడు వలంటీర్‌ నుంచి కలెక్టర్‌ దాకా బెదిరింపులు
  • కేబినెట్‌ తీర్మానం పేరుతో ‘బ్లాక్‌మెయిల్‌’
  • తోడు, చేయూత టార్గెట్లపై ప్రతిరోజూ స్వారీ
  • గ్యారెంటీ లేకుండా లోన్లు ఇవ్వాలని ఒత్తిడి
  • ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా పథకాలు
  • బ్యాంకు అధికారుల్లో అలజడి, ఆందోళన
  • రాష్ట్రంలో పని చేయలేమంటూ బదిలీ యత్నాలు
  • వీఆర్‌ఎ్‌సకు దరఖాస్తు చేసుకున్న మరికొందరు
  • జాతీయ స్థాయిలో ‘చెత్త పని’ సంచలనం


సొంత పేర్లతో పథకాలు ప్రవేశపెట్టడం! జనంతో జేజేలు కొట్టించుకోవడం! పేదలకు జరిగే  మేలును తమ ఖాతాలో వేసుకోవడం! ఎవరికైనా పథకం కింద లబ్ధి చేకూరకపోతే... నేరాన్ని బ్యాంకులపైకి నెట్టేయడం! రాష్ట్రంలో ఈ సరికొత్త ‘స్కీమ్‌’ అమలవుతోందనే సందేహాలు తలెత్తుతున్నాయి. ‘పేదలకు ఇళ్లపట్టాలు పంచుతుంటే అడ్డుకుంటున్నారు’ అని ఇన్నాళ్లూ విపక్షాన్ని విమర్శించినట్లే... ‘పేదలకు రుణాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు’ అంటూ బ్యాంకులపై బండలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే... ‘పంటల బీమా’ పరిహారం అందనివారిని రెచ్చగొట్టి బ్యాంకులపైకి ఉసిగొల్పుతున్నారని బ్యాంకర్లు వాపోతున్నారు. నిజానికి... పంటల బీమాతో బ్యాంకులకు సంబంధమే లేదు. ఖాతాలో పడిన సొమ్ములను రైతుకు అందించడమొక్కటే బ్యాంకు పని! అలాగే... వైఎ్‌సఆర్‌ బీమా, జగనన్న తోడు, చేయూత వంటి పథకాలకు బ్యాంకర్లతో సంబంధం లేకుండానే ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసి, రుణాలు ఇచ్చి తీరాల్సిందేనంటూ ఒత్తిడి తెస్తోంది. భవిష్యత్తులో రుణాలు రాని పేదలను బ్యాంకులపై దాడికి ఉసిగొల్పినా ఆశ్చర్యపోనక్కర్లేదని బ్యాంకర్లు ఆందోళన చెందుతున్నారు.



(అమరావతి - ఆంధ్రజ్యోతి): బ్యాంకులు చేసేది వ్యాపారమే! కానీ... వాటికి సామాజిక బాధ్యత ఉంది. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేసే పథకాలకు రుణాలు ఇవ్వాలి. తమకు విధించిన లక్ష్యాల మేరకు ఆయా రంగాలకు ఆర్థికంగా సహకరించాలి. కానీ... దీనికీ ఒక పద్ధతుంది. ప్రభుత్వానికీ- బ్యాంకర్లకూ మధ్య అనుసంధానం కోసం ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం (ఎస్‌ఎల్‌బీసీ) జరుగుతుంది. రుణాల మంజూరుపై ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేస్తుంది. కానీ... రాష్ట్ర ప్రభుత్వానికి ఇవేవీ పట్టడంలేదు. ‘మేం లబ్ధిదారుల దరఖాస్తులు పంపిస్తాం. మీరు లోన్లు ఇవ్వాల్సిందే! లేదంటే... మీ బ్యాంకుల ముందు చెత్తపోస్తాం.  వేధిస్తాం. వెంటాడతాం’... ఇదీ అధికార యంత్రాంగం వైఖరి. కృష్ణా జిల్లాలో చేసిన ఈ ‘చెత్త పని’ జాతీయ స్థాయిలో వివాదాస్పదంగా మారింది.


బ్యాంకుల పాత్ర ఏమిటి?

సంక్షేమ పథకాలకు బ్యాంకుల నుంచి సహకారం పొందడం... సుహృద్భావ వాతావరణంలో జరగాలి. ఇప్పటిదాకా అదే జరిగింది. ఇప్పుడు ఒక్కసారిగా సీన్‌ మారింది. వలంటీర్‌ నుంచి కలెక్టర్‌ వరకు బ్యాంకులపై స్వారీ చేస్తున్నారు. రుణాల మంజూరుపై బ్యాంకులకు ప్రత్యేకంగా నిబంధనలు ఉంటాయి. ఆర్బీఐ నిబంధనలనూ అనుసరిస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా... లబ్ధిదారుడి గ్యారెంటీ లేదా ప్రభుత్వ కౌంటర్‌ గ్యారెంటీ లేకుండా రుణాలు మంజూరు చేయవు. ఎందుకంటే... బ్యాంకులు రుణాలుగా ఇచ్చేది కూడా ప్రజల సొమ్ములనే! ఆ డబ్బులకు బ్యాంకులు జవాబుదారీగా ఉండాల్సిందే. అందుకే రుణాలకు ష్యూరిటీ తీసుకుంటాయి. పట్టణ ప్రాంతాల్లో తోపుడు బండ్లు, చిరువ్యాపారులకు కౌంటర్‌ గ్యారెంటీ ఇస్తూ ‘పీఎం స్వానిధి’ పథకం ద్వారా కేంద్రం రుణాలు ఇప్పిస్తోంది. ‘జగన్న తోడు’ కూడా ఇలాంటిదే. కానీ, దీనిని గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించారు. ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వకుండానే 5 లక్షల మందికి రుణాలివ్వాలని సూచించడంతో సమస్య మొదలైంది. లబ్ధిదారుల్లో ఎవరైనా రుణం చెల్లించకపోతే పరిస్థితి ఏమిటనేది బ్యాంకుల ప్రశ్న! 


‘చేయూత’ పథకానిదీ ఇదే పరిస్థితి. దీని ద్వారా రూ.75 వేల చొప్పున లబ్ధి చేకూరుస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందులో రూ.18,750 లబ్ధిదారుడి వాటా! మిగిలిన రూ.56,250లు బ్యాంకులు రుణంగా ఇచ్చేలా ఈ పథకాన్ని రూపొందించారు. రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం రూ.50 వేల పైబడిన రుణాలకు పూచీకత్తు తప్పనిసరి. ఇది పట్టించుకోకుండా ‘రుణాలు ఇస్తారా... చస్తారా’ అనేలా వ్యవహరిస్తుండటంతోనే సమస్య మొదలైంది. వైఎ్‌సఆర్‌ బీమా, పంటల పరిహారం తదితర పథకాల అమలులోనూ ఆచరణలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. అవేవీ పట్టించుకోకుండా... ‘మేం చెప్పినట్లు చేయాల్సిందే’ అంటూ బ్యాంకులపై ఒత్తిడి తెస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన లక్షల కోట్ల లావాదేవీలు బ్యాంకుల ద్వారా జరుగుతున్నాయి. గతంలోకంటే బ్యాంకర్లపై పనిభారం కూడా పెరిగింది. ప్రతి పథకం నగదు బదిలీ (డీబీటీ) విధానంలో అమలవుతుండటంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ బ్యాంకులతో  లింకయ్యాయి. దీనికితోడు సిబ్బంది కొరత తమను వేధిస్తోందని బ్యాంకర్లు వాపోతున్నారు.


ఎవరి మాట వినాలి?

ఏపీలో వలంటీర్ల నుంచి కలెక్టర్ల వరకు బ్యాంకులు తమ చేతికింద నడుస్తున్న సంస్థలుగా భావిస్తున్నారని పలువురు బ్యాంకు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో పనిచేయలేమంటూ పలువురు ఉన్నతాధికారులు బదిలీలకు, వీఆర్‌ఎ్‌సకు కూడా దరఖాస్తు చేసుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాయలసీమ జిల్లాకు చెందిన ఒక కలెక్టర్‌ ఒత్తిళ్లకు తట్టుకోలేక లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌  టెలీకాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేయగా... ఆ జిల్లాలో 200 మంది బ్యాంకు మేనేజర్లు ఫోన్లు స్విచ్ఛాప్‌ చేసి కూర్చున్నారు. ‘ఈ ఒత్తిడి తట్టుకోలేం బాబోయ్‌’ అంటూ ‘మౌన’ సందేశాలు పంపించారు. ‘ఎటూ రుణాలివ్వలేకపోతున్నారు, ఫోన్లు కూడా కలపలేకపోతున్నారా? అంటూ ఆ జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ను కలెక్టర్‌ దెప్పిపొడిచారట! పలు జిల్లాల్లో తమ అనుచరులు, కార్యకర్తలను బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లుగా నియమించాలంటూ ఎమ్మెల్యేలు ఒత్తిడి తెస్తున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో జగనన్న తోడు, చేయూత పథకాల అమలులో బ్యాంకర్ల పాత్రపై చర్చించారు. ఈ సందర్భంగా బ్యాంకులపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అన్ని జిల్లాల యంత్రాంగాలకు చేరిపోయింది. అప్పటి నుంచి అధికారులు, వైసీపీ నేతలు బ్యాంకర్లపై రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. బ్యాంకులను హెచ్చరిస్తూ కేబినెట్‌లో తీర్మానం చేసే అవకాశం ఉందనే సంకేతాలతో మేనేజర్లు బెంబేలెత్తుతున్నారు. ‘‘రాష్ట్ర కేబినెట్‌లో ఇలాంటి తీర్మానం చేసే అవకాశం ఇవ్వొద్దు. సెలవు రోజులైన 26, 27వ తేదీల్లోనూ మీ శాఖలు తెరిచి పథకాల సంగతి చూడండి’’ అంటూ ఎస్‌బీఐ రీజినల్‌ మేనేజర్‌ ఒకరు గురువారం ఆదేశాలు జారీ చేశారు. ‘చెత్త పని’ వెలుగులోకి వచ్చిన తర్వాత, ఉన్నతాధికారుల జోక్యంతో ఈ సర్క్యులర్‌ను తర్వాత ఉపసంహరించుకున్నారు. 


సామరస్య వాతావరణంలోనే...

కరోనా సమయంలోనూ బ్యాంకులు విస్తృతస్థాయిలో సేవలందించిన విషయం విదితమే. ఈ సందర్భంగా కేంద్రం ఇచ్చిన సాయం పేదలకు అందించడంలో బ్యాంకులు కీలకపాత్ర పోషించాయి. విద్యార్థుల స్కాలర్‌షిప్పులు, గ్యాస్‌ సబ్సిడీ, రైతు భరోసా తదితర అనేక డీబీటీ చెల్లింపులు బ్యాంకులు ద్వారానే జరుగుతున్నాయి. ఇప్పటిదాకా ప్రభుత్వాలన్నీ బ్యాంకులను ఒప్పించి, మెప్పించి లక్ష్యాలను చేరుకున్నాయి. అలా కాకుండా బ్యాంకులతో ఘర్షణ వైఖరికి దిగితే పథకాల అమలు అసాధ్యమని ప్రభుత్వ అధికారులే చెబుతున్నారు. తమపై స్వారీ చేయడం వల్ల వ్యవస్థ మొత్తం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారయ్యే ప్రమాదముందని బ్యాంకు అధికారులూ హెచ్చరిస్తున్నారు. ‘‘బ్యాంకులు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు! రాష్ట్ర ప్రభుత్వానికి వాటిపై ఎలాంటి అథారిటీ లేదు. ఈ విషయం తెలియకుండా అధికారులు, కార్యకర్తలు బ్యాంకులపై రెచ్చిపోవడం వల్ల ప్రభుత్వ పథకాలు మూలనపడే ప్రమాదముంది’’ అని స్పష్టం చేస్తున్నారు.


ఎవరు ‘బాస్‌’?


కృష్ణా జిల్లాలో ఓ వలంటీరు నేరుగా బ్యాంకు శాఖకు వెళ్లాడు. బ్యాంకు సీనియర్‌ మేనేజర్‌ ముందు కూర్చుని... ‘జగనన్న తోడు పథకం గ్రౌండింగ్‌పై ప్రతిరోజూ సాయంత్రానికి నాకు నివేదిక ఇవ్వండి’ అని సూటిగా చెప్పాడు. తన సర్వీసులో మొట్టమొదటిసారిగా ఎదురైన ఈ అనుభవంతో సదరు బ్యాంకు అధికారి నివ్వెరపోయి, బిక్కమొహం వేయాల్సి వచ్చింది. 


జగనన్న తోడు పథకానికి సంబంధించి తమకు 70 దరఖాస్తులు అందగా... ఒక బ్యాంకు మేనేజర్‌ 69 క్లియర్‌ చేశారు. నిబంధనలకు పూర్తి విరుద్ధంగా ఉండటంతో ఒక్కరికి మాత్రం మంజూరు చేయలేదు. ‘అదేంటి. అదెలా పక్కన పెడతారు. మేం పంపిన దరఖాస్తులన్నింటినీ ఆమోదించి, రుణాలు మంజూరు చేయాల్సిందే’ అని స్వయంగా జిల్లా కలెక్టర్‌ ఫోన్‌ చేసి దబాయించారు. బ్యాంకు మేనేజర్‌ వివరణను కూడా పట్టించుకోలేదు.


రాయలసీమకు చెందిన ఓ కలెక్టర్‌ బ్యాంకర్లను తెగ వేధిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘స్టాండప్‌ ఇండియా’ కింద ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రూ.10 లక్షల నుంచి రూ.కోటి దాకా రుణాలిప్పించి ముఖ్యమంత్రి వద్ద మార్కులు కొట్టేయాలని భావించారు. ఒక్కో బ్యాంకుకు 10 నుంచి 50 దాకా దరఖాస్తులు పెట్టించారు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు రుణాలు అందితే మంచిదే. కానీ... నిబంధనల ప్రకారం ఈ పథకం కింద ఒక్కో బ్యాంకు ఇద్దరికి మాత్రమే లోన్లు ఇవ్వగలదు. దీనిని కలెక్టర్‌ పట్టించుకోలేదు. ‘లంచాలు ఇస్తేనే చేస్తారా?’ అంటూ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మేనేజర్‌ను ఒక సమావేశంలో దూషించారు. 

Updated Date - 2020-12-27T07:47:09+05:30 IST