-
-
Home » Andhra Pradesh » AP NEWS
-
సీఎస్‌ను శిక్షించండి!
ABN , First Publish Date - 2020-12-19T08:31:01+05:30 IST
‘‘స్థానిక ఎన్నికలకు సహకరించాలని హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కావాలనే ఉల్లంఘిస్తున్నారు. ఇందుకు బాధ్యులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, పంచాయతీరాజ్ శాఖ...

పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శిని కూడా..
ఎన్నికల నిర్వహణకు సహకరించడం లేదు
హైకోర్టులో నిమ్మగడ్డ కోర్టు ధిక్కరణ పిటిషన్
అమరావతి, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): ‘‘స్థానిక ఎన్నికలకు సహకరించాలని హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కావాలనే ఉల్లంఘిస్తున్నారు. ఇందుకు బాధ్యులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిలను కోర్టు ధిక్కరణ కింద శిక్షించండి’’ అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ కుమార్ శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందు లో నీలం సాహ్ని, ద్వివేదీలను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు. గ్రామ పంచాయతీలకు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించాలని వా రిని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఎస్‌ఈసీకి సహకరించకపోవడంపై హైకోర్టు ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టిందని, కమిషన్‌కు నిధు లు విడుదల చేయడంతో పాటు ఎన్నికల నిర్వహణకు సహకరించాలని ఆదేశిస్తూ నవంబరు 3న ఉత్తర్వులు జారీ చేసిందని పిటిషన్‌లో తెలిపారు.
అయినా పట్టించుకోలేదు..
రాష్ట్ర ఎన్నికల సంఘానికి సహాయ సహకారాలు అందించాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఎస్‌ఈసీ తెలిపారు. కానీ... ఈ విషయంలో సర్కారు విఫలమైందని చెప్పారు. ‘‘ఎస్‌ఈసీకి కేటాయించిన నిధులను విడుదల చేయాలని ప్రభుత్వా న్ని కోరుతూ మరోసారి వినతి పత్రం అందించాం. ప లుమార్లు విజ్ఞప్తి చేసినా, రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించకపోవడం అధికార దుర్వినియోగానికి పాల్పడడమే. రా జ్యాంగంలోని అధికరణ 243కె నిబంధనలు ఉలంఘించడమే. రాజ్యాంగ విధులు నిర్వహణలో భాగం గా ఎస్‌ఈసీ ఎప్పుడు కోరినా సహకరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. కానీ... ఎస్‌ఈసీ స్వతంత్రను దెబ్బతీసి, తన నియంత్రణలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం నుంచి సహకారం అందడంలేదని భావిస్తే తొలుత హైకోర్టును, తర్వాత తమను ఆశ్రయించవచ్చునని 2006లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది’’ అని తెలిపారు.
దీని ప్రకారం తాము హైకోర్టును ఆశ్రయించగా... సీఎ్‌సను న్యాయస్థానం సుమోటోగా ప్రతివాదిగా చేర్చిందన్నారు. ఎస్‌ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించేలా చూడాలని సీఎ్‌సను ఆదేశిస్తూ, 15 రోజుల్లో ఉత్తర్వుల అమలుపై నివేదిక అందించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ‘‘కోర్టు ఆదేశాల మేరకు నిధులు విడుదల చేయాలని, ఎన్నికల నిర్వహణకు సహకరించాలని నవంబరు 5న సీఎ్‌సకు వినతి అందించాం. ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు సహకరించాలని నవంబర్ 23న మరో వినతి సమర్పించాం. గ్రామ పంచాయతీ ఓటర్ల ప్రచురణకు సహకరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. కానీ.. సీఎస్ స్పందించలేదు. ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటుకు సీఎస్, పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి నిరాకరించారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు ఆటంకం కలిగించారు.
కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తరువాత ఎన్నికల నిర్వహణ గురించి చూస్తామని సీఎస్ పేర్కొనడం ఎన్నికల సంఘాన్ని అవమానించడమే’’ అని నిమ్మగడ్డ తెలిపారు. వీటితోపాటు మరిన్ని అంశాలను వివరిస్తూ.. కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు సీఎస్ నీలం సాహ్ని, ద్వివేదిలను కోర్టు ధిక్కరణ కింద శిక్షించాలని, ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
వ్యాక్సినేషన్ ప్రాధాన్యం చెబుతాం: ప్రభుత్వం
మరో వైపు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న ఎస్‌ఈసీ ప్రొసీడింగ్స్‌ను నిలుపుదల చేయాలని అభ్యర్థిస్తూ పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్ సోమయాజులు మరోసారి విచారణ జరిపారు. ప్రభుత్వం పిటిషన్‌పై ఎస్‌ఈసీ కౌంటర్ దాఖలు చేసింది. కౌంటర్‌లోని అంశాలపై ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎస్‌ఈసీ సీరియ్‌స గా తీసుకోనట్లు కనబడుతోంది. వ్యాక్సినేషన్ ప్రాధాన్యాన్ని తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని పిటిషన్ లో ఇంప్లీడ్ చేస్తాం. రిప్లై కౌంటర్ దాఖలుకు గడువు ఇవ్వండి’’ అని కోరారు. ఇందుకు కోర్టు అంగీకరిస్తూ... విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.
