55,656 కోట్లకు ఆమోదించండి

ABN , First Publish Date - 2020-12-17T10:27:43+05:30 IST

రాష్ట్ర ప్రజలకు ప్రాణాధారమైన పోలవరం జాతీయ ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనా వ్యయం రూ.55,656 కోట్లకు ఆమోదించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

55,656 కోట్లకు ఆమోదించండి

నిర్వాసితుల సంఖ్య 1.06 లక్షలకు చేరింది

సహాయ పునరావాసం వ్యయమూ పెరిగింది

ఆ 1,779 కోట్లూ రీయింబర్స్‌ చేయండి

పోలవరంపై జలశక్తి మంత్రికి సీఎం వినతి

లభించని ప్రధాని అపాయింట్‌మెంట్‌

సమయమివ్వని నిర్మలా సీతారామన్‌

రాష్ట్రానికి ముఖ్యమంత్రి తిరుగు పయనం

పోలవరం అంచనాలను..

న్యూఢిల్లీ, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజలకు ప్రాణాధారమైన పోలవరం జాతీయ ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనా వ్యయం రూ.55,656 కోట్లకు ఆమోదించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం ఉదయం 9 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు, పురోగతి, ప్రస్తుత పరిస్థితి, పునరావాసం, భూసేకరణ, పరిహారం చెల్లింపు, నిర్మాణ వ్యవధి లక్ష్యం తదితర అంశాలపై దాదాపు 40 నిమిషాలు చర్చించారు. ఈ సందర్భంగా జగన్‌ కేంద్ర మంత్రికి పోలవరంపై వినతి పత్రం సమర్పించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఇంకా జాప్యం జరిగితే నిర్మాణ వ్యయం ఇంకా పెరిగిపోయే అవకాశం ఉన్నందున..


తక్షణమే తాజా సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపి, త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 2017-18 ధరల సూచీని అనుసరించి రూపొందించిన రెండో సవరణ అంచనా వ్యయం రూ.55,656 కోట్లకు ఆమోదించాలని కోరారు. నిర్వాసిత కుటుంబాల సంఖ్య 44,574 నుంచి 1,06,006కు పెరిగిపోయిందని.. ఈ కారణంగా సహాయ పునరావాసం (ఆర్‌ అండ్‌ ఆర్‌) ఖర్చు విపరీతంగా పెరిగిపోయిందని షెకావత్‌ దృష్టికి తీసుకొచ్చారు. ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం పెట్టిన ఖర్చులో ఇంకా రూ.1,779 కోట్లు కేంద్రం నుంచి రావలసి ఉందని.. ఆ మొత్తాన్ని వెంటనే రీయింబర్స్‌ చేయాలని అభ్యర్థించారు.


2018 డిసెంబరు నెలకు సంబంధించిన ఈ బిల్లులు ఇంకా కేంద్రం వద్దే పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి వినతులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సీఎం పేషీ వర్గాలు తెలిపాయి. మరో పది రోజుల్లో పోలవరం పరిశీలనకు రాబోతున్న ట్లు షెకావత్‌ చెప్పారని వెల్లడించాయి. షెకావత్‌తో భేటీ పూర్తికాగానే జగన్‌ రాష్ట్రానికి బయల్దేరారు.


మోదీ అపాయింట్‌మెంట్‌ కోసం..

నిజానికి తన ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీని కూడా కలవాలని జగన్‌ భావించారు. అపాయింట్‌మెంట్‌ లభిస్తే బుధవారం ఢిల్లీలోనే ఉండాలనుకున్నారు. ఆ మేరకు సీఎం పేషీ అధికారులు మంగళవారం నుంచే ప్రయత్నాలు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యే ముందు గానీ, తర్వాత గానీ ఇవ్వాలని.. కనీసం బుధవారం ఎప్పు డు సమయమిచ్చినా పర్వాలేదని పీఎంవోను అభ్యర్థించారు. ఒక దశలో బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రధానిని కలిసే అవకాశం ఉండొచ్చని మంగళవారం రాత్రి సంకేతాలు అందినా ఖరారు కాలేదు. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీకి ప్రయత్నించారు. ఆమె కూడా సమయం ఇవ్వకపోవడంతో.. బుధవారం షెకావత్‌ తో చర్చించాక.. అమరావతికి ప్రయాణమయ్యారు.


ముఖ్యమంత్రి అసహనం..?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వెంట వెంటనే అపాయింట్‌మెంట్‌ లభించినప్పటికీ.. తనకు ప్రధానితో పాటు నిర్మలా సీతారామన్‌ సమయం కూడా దొరక్కపోవడంపై జగన్‌ అసహనానికి గురైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ అంశం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. అయితే అమిత్‌షాతో గంటకుపైగా జరిపిన చర్చలు మాత్రం సంతృప్తినిచ్చాయని సీఎం సన్నిహితులు అంటున్నారు.

Updated Date - 2020-12-17T10:27:43+05:30 IST