ఎక్కడి ధాన్యం అక్కడే!

ABN , First Publish Date - 2020-12-13T09:11:10+05:30 IST

ఈ మాట ప్రకారమే గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రానికి చెందిన ఓ ఉద్యోగి రెండు రోజులపాటు పొలాలకు

ఎక్కడి ధాన్యం అక్కడే!

తడిసిన ధాన్యాన్నీ కొంటాం.. 

రైతులను ఆదుకుంటాం.

కొనుగోలు కేంద్రాలకు రానక్కర్లేదు.. 

పొలాల వద్దే ధాన్యం కొనుగోలు చేస్తాం.

ప్రతి గింజా కొంటామన్న ప్రభుత్వం..

నిబంధనాలతో బేజారవుతున్న రైతులు

అధికారులు సరేనన్నా మిల్లర్ల అడ్డంకులు..

బ్యాంకు గ్యారంటీ లేదని సాకులు

ధర తక్కువొచ్చినా రైతుకు దళారులే దిక్కు..

సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు


తుఫాను వెళ్లిపోయింది. వరి కోతలు, నూర్పిళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కల్లాల్లో ధాన్యాన్ని రాశులుగా పోసుకున్న రైతులు కొనేవారి కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. తడిసి రంగుమారిన ధాన్యాన్ని పొలాల వద్దకే వచ్చి కొంటామని చెబుతున్న అధికారులు తేమ శాతం, ఆర్బీకేల్లో నమోదు వంటి సవాలక్ష నిబంధనల సాకు చూపుతున్నారు. బ్యాంకు గ్యారంటీ లేదనే సాకుతో మిల్లర్లూ సహకరించడం లేదు. దిక్కుతోచని స్థితిలో ధర తక్కువొచ్చినా రైతులు దళారుల వద్దకే వెళుతున్నారు.


.. ఇదీ ప్రభుత్వం చెబుతున్న మాట.

ఈ మాట ప్రకారమే గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రానికి చెందిన ఓ ఉద్యోగి రెండు రోజులపాటు పొలాలకు వెళ్లి 12 మంది రైతుల నుంచి రెండు లారీల ధాన్యాన్ని కొనుగోలు చేశాడు. మళ్లీ వస్తాడు కదా.. మన ధాన్యం కూడా అమ్మేద్దాం అని మిగిలిన రైతులు ఎదురుచూస్తున్నారు. అతను రాకపోయేసరికి ఆ మరుసటి రోజు రైతులే అతని వద్దకు వెళ్లారు. ‘మీ కోసమే ఎదురుచూస్తున్నాం. ఎందుకు రాలేదు. మా ధాన్యం ఎప్పుడు కొంటారు?’ అని ప్రశ్నించేసరికి.. ఆ ఉద్యోగి అసలు విషయం చెప్పేశాడు. మొన్న ధాన్యం కొనుగోలు చేసినందుకే అధికారులతో చీవాట్లు తిన్నానని వాపోయాడు. ‘రైతు నీకు శాంపిల్‌ ఎప్పుడు చూపించాడు? పొలంలోకి ఎప్పుడు వెళ్లావ్‌? రైతు భరోసా కేంద్రంలో రిజిస్ర్టేషన్‌ నంబర్‌ ఎప్పుడు ఇచ్చారు? ఒక్క రోజులో ధాన్యం ఎలా కొన్నావు?’ అంటూ ఉన్నతాధికారులు నిలదీశారని చెప్పి వాపోయాడు.


అమ్మకానికి ని‘బంధానా’లెన్నో!

కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యాన్ని అమ్మాలంటే సవాలక్ష నిబంధనలు పాటించాలి. తొలుత నూర్చిన ధాన్యాన్ని పొలంలోనే ఉంచి శాంపిల్‌ను కొనుగోలు కేంద్రానికి తీసుకువెళ్లాలి. అక్కడ అధికారులు తేమ శాతాన్ని పరిశీలిస్తారు. తేమ 17 వాతం కన్నా తక్కువగా, మొలకలొచ్చిన, నాశిరకం ధాన్యం 10 శాతం కన్నా తక్కువగా ఉంటే సిబ్బంది రైతు పొలం దగ్గరకు వెళతారు. పొలం దగ్గర రాశిలోని ఽధాన్యాన్ని తీసుకుని మరోసారి తేమ, నాశిరకం శాతాలను పరీక్షిస్తారు. అంతా బాగుంటే... రైతు భరోసా కేంద్రంలో పేరు నమోదు చేసుకోవాలని రైతుకు సూచిస్తారు. అక్కడ పేరు నమోదు చేయించుకుంటే అతనికి వీఏఏ శ్లాట్‌ బుక్‌ చేసి, ఒక నంబర్‌ ఇస్తారు. అతని ధాన్యాన్ని ఎన్ని రోజులకు కొనుగోలు చేసేది తెలుపుతూ తేదీని ఇస్తారు. ఇంతటితో అయిపోయిందనుకోకండి. కొనుగోలు కేంద్రాల పరిధిలోని మిల్లర్లు కూడా ఆ ధాన్యం కొనుగోలుకు అంగీకరించాలి. అందుకు వారు బ్యాంకు గ్యారంటీ చూపాలి. ఇదంతా ఒక్కరోజులో అయ్యేపని కాదు. అన్నీ సవ్యంగా సాగితే కనీసం వారం రోజుల పని. బ్యాంకు గ్యారంటీ చూపి మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేసినా.. కాటా ఖర్చు, మిల్లుకు రవాణా ఖర్చులు ఎవరు భరించాలో స్పష్టత లేదు. మరోవైపు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలుకు ఇష్టపడని మిల్లర్లు తమకు బ్యాంక్‌ గ్యారంటీ లేదని సాకులు చెబుతున్నారు. వారిని ప్రభుత్వం నిలదీయలేని పరిస్థితి.


దళారులే మేలు?!

ధర తక్కువ వచ్చినా.. సవాలక్ష నిబంధనలను తట్టుకోలేక రైతులు దళారులకే ధాన్యాన్ని అమ్మేస్తున్నారు. రంగుమారిన, మొలకెత్తిన, పురుగులు తిన్న, తాలు వంటి నాశిరకం ధాన్యం ఐదు శాతం లోపు ఉండి ఎ గ్రేడ్‌ ధాన్యం అయితే క్వింటా రూ.1888కు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. నాశిరకం ధాన్యం 5-10 శాతం మధ్య ఉంటే.. ఒక్కో శాతానికి ఒక్కో ధర ఇస్తుంది. 10 శాతం వరకు నాశిరకం ఉంటే సాధారణ రకానికి రూ.1774.60 చొప్పున చెల్లిస్తుంది. మిల్లర్లు, స్థానిక వ్యాపారులైతే 75 కిలోల బస్తాకు రూ.1100 నుంచి 1150 వరకు చెల్లిస్తున్నారు. దీనివల్ల బస్తాకు రూ.400 నుంచి 500 వరకు నష్టపోతున్నా.. రైతులు ధాన్యాన్ని దళారులకే అమ్మేస్తున్నారు. దళారులు ఎటువంటి పరీక్షలు లేకుండా, నేరుగా పొలంలోకే వచ్చి ధాన్యాన్ని కొంటారు. అయితే డబ్బులు ఇచ్చేందుకు వారం నుంచి నెల రోజులు గడువు పెడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించలేక.. అధికారుల చుట్టూ తిరగలేక రైతులు దళారులను ఆశ్రయిస్తుంటే.. రైతుల దీనస్థితిని ఆసరాగా చేసుకుని మిల్లర్లు, వ్యాపారులు లాభపడుతున్నారు. 

తెనాలి, ఆంధ్రజ్యోతి


ధాన్యం మేమే కొంటాం... : భార్గవి, పౌరసరఫరాల శాఖ ఎండీ

తుఫాన్‌కు తడిసి దెబ్బతిన్న ధాన్యాన్ని నేరుగా రైతుల దగ్గరకే వెళ్లి కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు పౌరసరఫరాల శాఖ ఎండీ భార్గవి శనివారం ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. పొలం నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు కొనుగోలు కేంద్రాల పరిధిలో వాహనాలు పెట్టేందుకు ఒక కాంట్రాక్టర్‌కు బాధ్యతలు అప్పగించినట్టు తెలిపారు. బ్యాంకు సెలవుల కారణంగా బ్యాంకు గ్యారంటీ చూపడానికి మిల్లర్లకు జాప్యం జరిగిందని, సోమ, మంగళవారాల్లో బ్యాంకు గ్యారంటీలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటివరకు జిల్లాలో 541 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, దళారులు, ఇతరులు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని రైతులను కోరారు. బాపట్ల కొనుగోలు కేంద్రం సిబ్బంది ధాన్యం కొనుగోలు చేసిన విషయంలో విజిలెన్స్‌ సిబ్బంది జోక్యం చేసుకున్నారని వచ్చిన ఆరోపణపై విచారిస్తున్నామని చెప్పారు. కొనుగోలు కేంద్రం సిబ్బందిపై ఒత్తిడి తెచ్చినట్టు తేలితే చర్యలు తప్పవన్నారు. 

Updated Date - 2020-12-13T09:11:10+05:30 IST