ఆర్థికస్థితిని బట్టే నిర్ణయాలు

ABN , First Publish Date - 2020-12-11T07:12:53+05:30 IST

రాష్ట్ర ఆర్థికస్థితిని బట్టే ప్రభుత్వ నిర్ణయాలుంటాయని అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం హైకోర్టుకు వివరించారు.

ఆర్థికస్థితిని బట్టే నిర్ణయాలు

ప్రజా ప్రయోజనాల కోసమే 3 రాజధానులు

హైకోర్టులో ఏజీ శ్రీరాం వాదనలు

విచారణ నేటికి వాయిదా


అమరావతి, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థికస్థితిని బట్టే ప్రభుత్వ నిర్ణయాలుంటాయని అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం హైకోర్టుకు వివరించారు.  ప్రజా ప్రయోజనాల కోసం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాజధాని పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం రోజువారీ తుదివిచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనలు ముగియడంతో గురువారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున  ఎస్‌.శ్రీరాం వాదనలు వినిపించారు. 3 రాజధానుల నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైనదని, ఇది ప్రజా ప్రయోజనాల కోసమే తీసుకున్న నిర్ణయమని ఆయన వివరించారు.


ఇలాంటి నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకునేందుకు వీల్లేదన్నారు. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ను మార్చడానికి వీలు లేదని పిటిషనర్లు చెప్పడం సరి కాదన్నారు. గతంలోనూ పలుమార్లు మాస్టర్‌ ప్లాన్‌ను మార్చిన సందర్భాలున్నాయని, అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకని ప్రశ్నించారు. రైతుల హక్కులకు సీఆర్‌డీఏ రద్దు చట్టంలో రక్షణ కల్పించామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారి హక్కులకు భంగం వాటిల్లబోదని చెప్పారు. ప్రైవేటు వ్యక్తుల ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఉంటుందని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. పలు సుప్రీంకోర్టు తీర్పులను ఆయన ధర్మాసనం ముందుంచారు. ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి శాసనపరమైన మద్దతు ఉందన్నారు. అడ్వకేట్‌ జనరల్‌ వాదనల కొనసాగింపు కోసం తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.

Updated Date - 2020-12-11T07:12:53+05:30 IST