శ్రేణులూ రంగంలోకి దిగండి

ABN , First Publish Date - 2020-11-27T09:36:52+05:30 IST

నెల్లూరు, చిత్తూరు జిల్లాలపై నివర్‌ తుఫాను ప్రభావం, వాటిల్లిన నష్టంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరా తీశారు.

శ్రేణులూ రంగంలోకి దిగండి

సాయం చేయండి... భరోసా ఇవ్వండి.. తుఫాను నష్టంపై బాబు ఆరా


అమరావతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): నెల్లూరు, చిత్తూరు జిల్లాలపై నివర్‌ తుఫాను ప్రభావం, వాటిల్లిన నష్టంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరా తీశారు. గురువారం సాయంత్రం ఆయన ఆ రెండు జిల్లాల పార్టీ నేతలతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తుఫాను తీవ్ర ప్రభావం చూపిందని, భారీ వర్షాలతో నీట మునిగి పంటలకు బాగా నష్టం సంభవించిందని, లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ళు నీట మునిగి ప్రజలు అవస్థలు పడుతున్నారని పార్టీ నేతలు ఆయనకు చెప్పారు. టీడీపీ నేతలు వెంటనే ప్రతిపక్షంగా సంబంధిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించాలని, వారికి తక్షణ సాయం అందేలా అధికార యంత్రాంగంపై ఒత్తిడి తేవాలని చంద్రబాబు వారికి సూచించారు.


పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలని, వీలైనంత మేర ప్రజలకు సాయం చేయాలని, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు కష్టకాలంలో భరోసా కల్పించాలని ఆయన వారికి చెప్పారు.నివర్‌ బాధితులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కదలాలని, సహాయ చర్యలు ముమ్మరం చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో ప్రజలకు ఆహారం, తాగునీరు, మందులు అందించాలని, విద్యుత్‌ సరఫరాను తక్షణం పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-11-27T09:36:52+05:30 IST