-
-
Home » Andhra Pradesh » ap news
-
సత్వరమే సాయం
ABN , First Publish Date - 2020-11-27T09:21:19+05:30 IST
భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఏదైనా నష్టం జరిగితే సత్వరమే సాయమందించడానికి సిద్ధం కావాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.

తుఫాన్‌పై అధికారులకు సీఎం ఆదేశాలు
అమరావతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఏదైనా నష్టం జరిగితే సత్వరమే సాయమందించడానికి సిద్ధం కావాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. నివర్ తుఫాను పరిస్థితులపై గురువారం ఉదయం ఆయన సమీక్షించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో.. అవసరమైన సహాయ, పునరావాస చర్యలన్నీ తీసుకోవాలన్నారు. వర్షాల అనంతరం పంట నష్టంపై అంచనాలు రూపొందించాలని చెప్పారు. ‘తుఫాన్ తీరాన్ని తాకింది. క్రమంగా బలహీనపడుతోంది. తీవ్రత కూడా తగ్గుతోంది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కడప, అనంతపురం జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు జిల్లాలో 7సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సోమశిల ఇప్పటికే నిండినందున, ఇక వచ్చే ఇన్‌ఫ్లోను దృష్టిలో పెట్టుకుని నీటిని విడుదల చేస్తాం. అక్కడక్కడా పంటలు నీట మునిగిన ఘటనలున్నాయి. వర్షాలు తగ్గగానే నష్టం మదింపు కార్యక్రమాలు చేపడతాం. మల్లెమడుగు రిజర్వాయర్ సమీపంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నాం‘ అని అధికారులు సీఎంకు వివరించారు. కాగా, నెల్లూరు జిల్లాలో విద్యుదాఘాతంతో మరణించిన కుటుంబాన్ని ఆదుకోవాలని అఽధికారులను సీఎం ఆదేశించారు.
ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్..
తుఫాను నేపథ్యంలో జిల్లాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా చూడాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ గిరిజాశంకర్ సూచించారు. ప్రతి జిల్లాలో ఒక కంట్రోల్ రూం ఏర్పాటుచేసి 24 గంటలూ అందుబాటులో ఉంచి ఎవరికి ఏ సాయం కావాలన్నా... తక్షణమే అందేలా అధికారులకు తగిన సూచనలు ఇవ్వాలన్నారు.
విద్యుత్ శాఖకు కోటిన్నర నష్టం
తుఫాన్ ప్రభావంతో దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థ పరిధిలో రూ.కోటిన్నర మేర విద్యుత్ వ్యవస్థకు నష్టం వాటిల్లినట్లు ఆ శాఖ అంచనా వేసింది. ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ పలు జిల్లాల అధికారుల తో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. 154కిలోమీటర్ల మేర 33 కేవీ లైన్లు, 420 కి.మీ. మేర 11 కేవీ లైన్లు, 1100 వరకూ విద్యుత్ స్తంభాలు తుఫాన్ ధాటికి దెబ్బ తిన్న ట్లు తెలుసుకున్నారు. నెల్లూరు, చిత్తూరు, కడప, ప్రకా శం జిల్లాల్లో విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండా లని శ్రీకాంత్ ఆదేశించారు. విద్యుత్ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు.