ఉల్లంఘిస్తే చర్యలే!

ABN , First Publish Date - 2020-11-26T08:46:47+05:30 IST

ప్రభుత్వ ఆస్తుల విక్రయ వ్యవహారంలో తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హైకోర్టు స్పష్టంచేసింది.

ఉల్లంఘిస్తే చర్యలే!

ప్రభుత్వ ఆస్తుల విక్రయంపై మా ఆదేశాలు


సుమోటోగా ‘కోర్టు ధిక్కరణ’ చేపడతాం

హైకోర్టు స్పష్టీకరణ.. విచారణ 4కి వాయిదా


అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆస్తుల విక్రయ వ్యవహారంలో తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హైకోర్టు స్పష్టంచేసింది. సుమోటోగా కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని తేల్చిచెప్పింది. ప్రభుత్వ ఆస్తుల విక్రయ వేలంలో టెండర్లను ఖరారు చేయరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తదుపరి విచారణ వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఈ వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై కౌంటర్‌ అఫిడవిట్‌ను నేరుగా అందించేందుకు ప్రభుత్వ న్యాయవాదికి వెసులుబాటు కల్పించింది. తదుపరి విచారణను డిసెంబరు 4వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ డి.రమేశ్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘మిషన్‌ బిల్డ్‌ ఏపీ’ పథకంలో భాగం గా రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలను వేలం వేయతలపెట్టడం, ఆ ప్రక్రియను సవాల్‌ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే.


ప్రభుత్వం విక్రయించదలచిన భూముల్లో దాతలిచ్చినవి ఉన్నాయని.. నిబంధనల మేరకు వాటిని విక్రయించడానికి వీల్లేదని పిటిషనర్లు పేర్కొన్నారు. గతంలో వీటిపై విచారణ జరిపిన ధర్మాసనం.. వేలం ప్రక్రియ కొనసాగించేందుకు అనుమతిస్తూనే తుది టెండర్లను ఖరారు చేయరాదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలిచ్చినప్పటికీ స్థల విక్రయాలపై ప్రభుత్వం ముందుకు వెళ్తోందని.. ఇతర ఆస్తుల విక్రయాలకు నోటిఫికేషన్‌ కూడా జారీ చేసిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు. ఇతర ఆస్తుల విషయంలో అయితే వేరే పిటిషన్లు వేసుకోవాలని వారికి ధర్మాసనం సూచించింది. 

Updated Date - 2020-11-26T08:46:47+05:30 IST