అమరావతి విషయంలో జగన్ చారిత్రక తప్పిదం
ABN , First Publish Date - 2020-11-21T09:27:17+05:30 IST
అమరావతి విషయంలో జగన్ చారిత్రక తప్పిదం
ముందు సై అని తర్వాత నై అంటావా?
అమరావతి శంకుస్థాపన ప్రాంతంలో
కాంగ్రెస్ మహా సదస్సు
తుళ్లూరు, నవంబరు 20: అమరావతిని విస్మరించి మూడు రాజధానులు అంటూ ముఖ్యమంత్రి జగన్ చారిత్రక తప్పిదం చేశారని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ తాను శంకుస్థాపన చేసిన అమరావతిని మరిచిపోవడం, బీజేపీ నాయకులు అమరావతిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మరిన్ని తప్పిదాలని దుయ్యబట్టారు. ఈ మేరకు రాజధానిలోని ఉద్దండరాయునిపాలెంలో అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రదేశంలో ‘అమరావతి రాజధాని పరిరక్షణ కాంగ్రెస్ కమిటీ’ శుక్రవారం భారీ సదస్సును నిర్వహించింది. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు శైలాజానాథ్ మాట్లాడుతూ..‘‘జగన్మోహన్‌రెడ్డీ నీవు ఏ నీరు తాగావయ్యా? సీమ వాళ్లు మాటిస్తే నిలబెట్టుకుంటారు. మరి నీవు.. అమరావతికి ఎన్నికలకు ముందు సై అని ఆ తరువాత నై అనటం సిగ్గుగా లేదా? మాకే సిగ్గుగా ఉందే!’’ అని దుయ్యబట్టారు. అమరావతి ఉద్యమంలో కాంగ్రెస్ ప్రత్యక్షంగా పాల్గొంటుందని, జాతీయ స్థాయికి తీసుకువెళ్తుందన్నారు.
339వ రోజుకు అమరావతి ఆందోళనలు
అహింసాయుతంగా అమరావతి పోరాటం కొనసాగిస్తామని రాజధాని రైతులు తెలిపారు. అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగాలని కోరుతూ రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళనలు శుక్రవారంతో 339వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఒక్క వైసీపీ మినహా అన్ని పార్టీలు మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. ఎన్నికలకు ముందు అమరావతిలో సొంత ఇల్లు కట్టుకున్నానని, సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు అద్దె ఇంటిలో ఉంటున్నారని చెప్పిన జగన్ ఇప్పుడు మూడు రాజధానుల ప్రకటన ఎందుకు చేశారో చెప్పాలన్నారు.