సముద్రం పక్క స్థలాలా!
ABN , First Publish Date - 2020-03-08T10:51:36+05:30 IST
సముద్రం పక్క స్థలాలా!

పేదలను ముంచేలా సేకరణ తీరు
తీరానికి 200 మీటర్ల దూరంలోనే..
ముంపును అడ్డుకొనే ఇసుకమేటల్నిచదును చేస్తున్న కృష్ణా అధికారులు
500 మీటర్లలోపు నిర్మాణాలు వద్దన్న సీఆర్‌జెడ్ నిబంధనలూ బేఖాతరు
గొల్లగూడెంగ్రామ పేదలంతా గగ్గోలు..
విజయవాడ/మచిలీపట్నం, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): స్థలాలు సేకరించామా, పేదలకు ఇచ్చామా! అంతవరకే లెక్క! అవి సముద్రంలో మునుగుతాయా లేక జనసంచారమేలేని మారుమూల కొండప్రాంతాల్లో ఉన్నాయా అన్నది మాత్రం పట్టదు. కృష్ణాజిల్లా అధికార యంత్రాంగం చేపడుతున్న స్థల సేకరణ తీరు ఇలాగే ఉంది. బందరు మండలం పెదపట్నం పంచాయతీలోని గొల్లగూడెం గ్రామానికి సముద్రం 200 మీటర్ల దూరంలోనే ఉంది. అలాంటిచోట సుమారు 1.60 ఎకరాలు సేకరించాలని అధికారులు నిర్ణయించారు. అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తే మేం ఏం చేసుకుంటామని పేదలు గగ్గోలుపెడుతున్నా అధికారులు వినే పరిస్థితిలో లేరు. ‘కావాలంటే తీసుకోండి.. లేకుంటే మీ ఖర్మ’ అంటూ చేతులు దులుపుకొంటున్నారు. ఈ గ్రామానికి, సముద్రానికి మధ్య ఇసుకమేటలు ఉన్నాయి. తుఫానులు, సునామీ వంటి విపత్తుల సమయంలో వేసవిలో కత్తెరపోట్లు, అమావాస్య, పౌర్ణమి సమయాల్లో సముద్రపు నీరు గ్రామంలోకి చొచ్చుకురాకుండా ఈ ఇసుకమేటలు, వాటిపై పెరిగిన చెట్లు రక్షణ కవచంగా ఉంటాయి. ఈ గ్రామంలో 300లకు పైగా కుటుంబాలు నివాసం ఉంటుండగా, లబ్ధిదారులుగా ప్రభుత్వం 71 కుటుంబాలను ఎంపిక చేసింది. వారిలో 30 మందికి సముద్రానికి దూరంగా ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు భూమిని గుర్తించారు. మరో 41మందికి మాత్రం సముద్రం పక్కనే 1.60 ఎకరాల ప్రభుత్వ భూమిని స్థలాల కింద ఇవ్వడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. దానికోసం ఇసుకమేటలు చదును చేసే పనులను ఇప్పటికే ప్రారంభించారు. అక్కడ పెరిగిన వేప, ఇతర రకాల చెట్లను తొలగించారు. అయితే ఆ కలప ఏమైందో లెక్కాపత్రం లేదు. 2004 డిసెంబరు 26న సునామీ సంభవించగా గొల్లగూడెం గ్రామం వరకు నీరు వచ్చింది. ఇసుకమేటలు సహా మొత్తం ముంపునకు గురైంది. సీఆర్‌జెడ్ (తీరప్రాంత నియంత్రణ జోన్) నిబంధనల ప్రకారం సముద్రం నుంచి 500 మీటర్లలోపు ఎలాంటి కట్టడాలు నిర్మించకూడదు. ఆ నిబంధనలను సైతం తుంగలో తొక్కి సముద్రానికి 200 మీటర్ల దూరంలో ఇళ్ల స్థలాలు కేటాయించడం పేదల ప్రాణాలను ప్రమాదంలో పడేయడమే అవుతుంది.
అప్పుడు పీకేశారుగా!
గొల్లగూడెం గ్రామస్థులకు సముద్రపు వేటే ఆధారం. 2005లో 10 కుటుంబాలు ఇప్పుడు ఇళ్లస్థలాలు ఇస్తామంటున్న ప్రాంతంలోనే చిన్నపాటి పాకలు వేసుకొని ఉండేవారు. సముద్రం పక్కనే నివాసం ఉంటే విపత్తుల బారిన పడతారంటూ ఈ కుటుంబాలను అప్పట్లో అధికారులు ఖాళీ చేయించారు. వారి పాకలు పీకేయించారు. అప్పటినుంచి ఈ కుటుంబాలవారు సమీపంంలోని సరంగిపాలెంలో నివాసం ఉంటున్నారు. అప్పట్లో ఖాళీ చేయించిన ప్రాంతంలోనే ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇవ్వడం గమనార్హం!
కొండలు, గుట్టల్లో స్థలాలా!
విజయవాడలోని ఇళ్లు లేని పేదల కోసం ఈ నగరానికి 20 కిలో మీటర్ల దూరంలోని గన్నవరం మండలం కొండపావులూరు, సూరంపల్లి గ్రామాలకు సుదూరంగా 300 ఎకరాలలో లే అవుట్లు వేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. కొండపావులూరు గ్రామానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ ప్రాంతంలోని మామిడి తోటల నడుమ 200 ఎకరాలు, సూరంపల్లి గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న మామిడి తోటల మధ్యన 100 ఎకరాలలో లేఅవుట్లు వేస్తున్నారు. ఈ రెండు లే అవుట్లలోకి వెళ్లేందుకు సరైన దారి కూడా లేదు. సాయంత్రం అయితే ఈ ప్రాంతంలో నరమానవుడు కూడా సంచరించడు. ఈ ప్రాంతాలకు వెళ్లాలంటే వాగు డొంకలను దాటుకుని వెళ్లాలి. అలాంటి ప్రాంతంలో ఇళ్లస్థలాలు కేటాయిస్తే ఎలా ఉండాలని పేదలు వాపోతున్నారు.
ముంచేస్తున్నారు
‘‘సముద్రానికి దగ్గర్లో ఇళ్లస్థలాలు వద్దని అధికారులకు చెబితే వినడం లేదు. పైగా ఆహ్లాదకరంగా ఉంటుందని చెబుతున్నారు. సముద్రపు వాగ ఎత్తుగా వస్తే ఇప్పుడు స్థలాలు ఇచ్చే ప్రాంతం, మేమూ మునిగిపోతాం’’
- బసవాని జగదీశ్, గొల్లగూడెం
వేరే చోట ఇస్తే వెళతాం
‘‘మా గ్రామంలోని 30 మందికి వేరుశనగ పండేభూమిలో ఇళ్లస్థలాలు ఇస్తున్నారు. మాకు సముద్రానికి దగ్గరలో ఇస్తామంటున్నారు. ఇక్కడున్న వాస్తవ పరిస్థితులను అధికారులు గ్రహించాలి. వేరేచోట మాకు స్థలాలు ఇవ్వాలి’’
బసవాలక్ష్మయ్య, గొల్లగూడెం