రేపు ముద్రగడ ఇంట్లో కాపు నేతల కీలక సమావేశం

ABN , First Publish Date - 2020-09-20T23:36:39+05:30 IST

మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఇంట్లో కాపు జేఏసీ నేతలు కీలక సమావేశం కానున్నారు...

రేపు ముద్రగడ ఇంట్లో కాపు నేతల కీలక సమావేశం

ఏలూరు : మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఇంట్లో కాపు జేఏసీ నేతలు కీలక సమావేశం కానున్నారు. కొద్దిరోజుల క్రితం తాను కాపు ఉద్యమ నేతగా తప్పుకుంటున్నట్లు కీలక ప్రకటన చేసిన విషయం విదితమే. నాటి నుంచి ఆయన మీడియా మీట్‌లు పెట్టడం కానీ.. రిజర్వేషన్ల గురించి మాట్లాడటం కానీ చేయలేదు. దీంతో ఆదివారం నాడు పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమలలో ఏపీలోని  13 జిల్లాల కాపు జేఏసీ నేతల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై నిశితంగా చర్చించిన నేతలు.. సోమవారం నాడు ముద్రగడతో భేటీ కావాలని నిర్ణయించారు. 


ముద్రగడే మా నాయకుడు..!

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కాపు నేతలు.. ముద్రగడను కలిసి రాష్ట్ర కాపు జేఏసీకి నాయకత్వం వహించాలని కోరతామన్నారు. కాపు జేఏసీ ముద్రగడ నాయకత్వంలోనే ముందుకు వెళ్తుంది. ఆయనే మా నాయకుడు. రాష్ట్రంలో ఎన్ని కాపు సంఘాలు ఉన్న వాటి ముఖ్య ఉద్దేశం రిజర్వేషన్ సంకల్పం. కాపు సంక్షేమం, అభివృద్ధి కోసం ఎవరు పాటుపడిన కాపు జేఏసీ స్వాగతిస్తుంది. రాష్ట్రం గర్వపడే ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం. ఆయన నాయకత్వంలోనే రిజర్వేషన్ సాధ్యమవుతుందని మేమందరం తీర్మానించాం. రేపు కిర్లంపూడిలో ముద్రగడ ఇంట్లో కాపు సమావేశమవుతాం. ఉద్యమం నుంచి తప్పుకోవద్దని ముద్రగడను మేమందరం కోరుతాం. తిరిగి ఉద్యమంలో కొనసాగాలని కోరుతాం అని కాపు నేతలు మీడియాకు వెల్లడించారు.


అయితే.. కాపునేతలతో భేటీ అనంతరం ముద్రగడ ఏం ప్రకటించబోతున్నారు..? ఉద్యమంలో ఆయన కంటిన్యూ అవుతారా..? లేకుంటే సైలెంట్‌గానే ఉంటారా..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Updated Date - 2020-09-20T23:36:39+05:30 IST