స్టే ఉత్తర్వులు నెల పొడిగింపు..

ABN , First Publish Date - 2020-03-28T09:22:27+05:30 IST

హైకోర్టుతో పాటు దిగువ కోర్టుల్లోని మధ్యంతర ఉత్తర్వులు, రెండు వారాల్లోపు ముగిసే స్టే ఉత్తర్వులను ధర్మాసనం నెల రోజుల పాటు పొడిగించింది. క్రిమినల్‌ వ్యవహారాల్లో ఇప్పటికే జారీ చేసి ఉన్న బెయిల్‌/సస్పెన్షన్‌ లేదా ముందస్తు బెయిల్‌ తదితరాలను

స్టే ఉత్తర్వులు నెల పొడిగింపు..

  • అండర్‌ట్రయల్స్‌కు మధ్యంతర బెయిల్‌
  • వారంతా స్వీయ గృహనిర్బంధంలో ఉండాలి
  • షరతులు ఉల్లంఘిస్తే బెయిల్‌ రద్దు
  • ఓడరేవులకు నౌకలు వస్తున్నాయి
  • అధికారులు చర్యలు చేపట్టాలి: హైకోర్టు


హైకోర్టుతో పాటు దిగువ కోర్టుల్లోని మధ్యంతర ఉత్తర్వులు, రెండు వారాల్లోపు ముగిసే స్టే ఉత్తర్వులను ధర్మాసనం నెల రోజుల పాటు పొడిగించింది. క్రిమినల్‌ వ్యవహారాల్లో ఇప్పటికే జారీ చేసి ఉన్న బెయిల్‌/సస్పెన్షన్‌ లేదా ముందస్తు బెయిల్‌ తదితరాలను నెల పాటు పొడిగించింది. కూల్చివేత, తొలగింపు, వేలం తదితరాలపై ఉన్న నిలుపుదల ఉత్తర్వులనూ నెల రోజులు పొడిగించింది. ఫైనలైజ్‌ చేయని టెండర్ల వ్యవహారంలో మాత్రం నెలరోజుల వ్యవధి ఇవ్వబోమని పేర్కొంది. లాక్‌డౌన్‌ వ్యవధి ముగిశాక ప్రక్రియ చేపట్టవచ్చని తెలిపింది. లాక్‌డౌన్‌ కారణంగా కోర్టుకు రాలేని ప్రజల కోసం న్యాయవాదులు ఈ-ఫైలింగ్‌ చేసేందుకు అనువుగా regjudaphc@nic.in అనే ఈమెయిల్‌ను ఏర్పాటు చేసింది. అదేవిధంగా ప్రభుత్వం తమ అభ్యంతరాల్ని హైకోర్టు న్యాయమూర్తితో ఏర్పాటైన ధర్మాసనాలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తెలియజేయవచ్చని, అవసరాన్ని బట్టి వ్యక్తిగత హాజరు ఉంటుందని తెలిపింది. ‘ఆంధ్ర, తెలంగాణ అధికారులు జాతీయ ప్రొటోకాల్‌ను అనుసరించాలి. 


రాష్ట్రంలోకి ప్రజల్ని భారీగా అనుమతించరాదు. ప్రత్యేక పరిస్థితుల కారణంగా తెలంగాణ నుంచి వచ్చే వారిని అనుమతించినప్పటికీ వారిని గృహ స్వీయనిర్బంధంలో ఉంచాలి. పసికందులున్న మహిళలు, గర్భిణుల పట్ల మానవతా దృక్పథంతో చర్యలు తీసుకోవాలి. ఈ నెల 26వ తేదీన సుప్రీంకోర్టు నియమించిన కమిటీ చేసిన తీర్మానాల మేరకు ఏడేళ్లలోపు శిక్ష పడిన నేరస్థులు, కారాగారాల్లో ఉంటూ విచారణ ఎదుర్కొంటున్న (అండర్‌ ట్రయల్స్‌) నిందితుల నుంచి బెయిల్‌ బాండ్లు తీసుకుని వారికి మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలి. అయితే వారు పోలీసుల సాయంతో, వైద్యుడి పర్యవేక్షణలో 14 రోజుల పాటు స్వీయ గృహనిర్బంధంలో ఉండాలి. షరతులు ఉల్లంఘిస్తే మధ్యంతర బెయిల్‌ రద్దవుతుంది. వెంటనే వారిని అదుపులోకి తీసుకోవచ్చు. చైల్డ్‌ కేర్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌, స్పెషలైజ్డ్‌ అడాప్ట్‌ ఏజెన్సీల్లో సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. లాక్‌డౌన్‌ కారణంగా విమానాలు, రైళ్లు, రోడ్డు రవాణా నిలిచిపోయాయి. కానీ సముద్రతీరంలో ఉన్న విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, కళింగపట్నం తదితర ఓడరేవులకు నౌకలు వస్తున్నందున ఆయా అధికారులు కేంద్రప్రభుత్వం నిర్దేశించిన చర్యల్ని తప్పక చేపట్టాలి’ అని ధర్మాసనం నిర్దేశించింది.

Updated Date - 2020-03-28T09:22:27+05:30 IST