వలంటీర్లే వారధులు

ABN , First Publish Date - 2020-03-28T09:13:17+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో పలు శాఖలు మార్గదర్శకాలను విడుదల చేశాయి. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది కోవిడ్‌-19ను అరికట్టేందుకు సిబ్బంది

వలంటీర్లే వారధులు

  • కరోనాపై ప్రచారం, రోగులను గుర్తించడంలో వారే కీలకం
  • గ్రామాల్లో కార్యదర్శే ప్రత్యేక అధికారి
  • ఉపాధి సిబ్బందికీ పలు సూచనలు.. మార్గదర్శకాలు విడుదల


అమరావతి, మార్చి 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో పలు శాఖలు మార్గదర్శకాలను విడుదల చేశాయి. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది కోవిడ్‌-19ను అరికట్టేందుకు సిబ్బంది తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలు విడుదల చేశారు. గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందితో సమన్వయం చేసుకొంటూ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1.95 లక్షల మంది వలంటీర్లు కరోనాపై అవగాహన కల్పించడంలో ప్రభుత్వానికి, కుటుంబాలకు వారధిగా నిలుస్తారని పేర్కొన్నారు. వారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి కరోనా వ్యాధి సోకిన వారిని గ్రామ సచివాలయంలో వైద్య సిబ్బంది సహకారంతో ఐసొలేషన్‌కు తరలించాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శిని కోవిడ్‌-19కు ప్రత్యేకాధికారిగా నియమించామన్నారు. ఆయా పంచాయతీల్లో గ్రామ వలంటీర్లను, ఇతర సిబ్బందిని సమన్వయం చేసుకొని సమర్థవంతంగా కరోనాను ఎదుర్కోవడానికి అన్ని చర్యలనూ తీసుకోవాలని వివరించారు. ఎంపీడీఓలు, డీఎల్‌పీఓలు ఆయా మండలాల్లో సమన్వయం చేసుకొంటూ లాక్‌డౌన్‌ను కచ్చితంగా అమలు చేయాలన్నారు. అన్ని వేళలా అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు జడ్పీ సీఈఓ, డీపీఓలకు సమాచారమందించాలన్నారు. ఆయా జిల్లాల సీఈఓ, డీపీఓలు సమిష్టిగా కోవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో జిల్లాలో కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామీణాభివృద్ధి శాఖ అడిషనల్‌ కమిషనర్‌ ఉపాధి సిబ్బందికి పలు జాగ్రత్తలను సూచించారు. కార్యాలయాల్లోకి సందర్శకులను అత్యవసరమైతే తప్ప అనుమతించవద్దని సూచించారు.

Updated Date - 2020-03-28T09:13:17+05:30 IST