అవే రంగులు

ABN , First Publish Date - 2020-04-24T08:46:24+05:30 IST

ఎన్నెన్నో వర్ణాలు! అందులో... మన అధికారులకు అధికార పార్టీ జెండాలోని నీలం, తెలుపు, ఆకుపచ్చ మాత్రమే కనిపించాయి. కొత్తగా వీటితోపాటు... ‘ఎర్రమట్టిరంగు’ అనేది ఉందని...

అవే రంగులు

  • పంచాయతీ భవనాలకు వైసీపీ వర్ణాలే!
  • కొత్తగా మట్టిరంగు పూయాలని ఆదేశం
  • నీలాల నీళ్లు, పైరు పచ్చ, పాడి తెలుపు 
  • ఒక్కో వర్ణానికి ఒక్కో అర్థం చెప్పిన ప్రభుత్వం
  • హైకోర్టు ఆదేశాలకు ‘కొత్త కలరింగ్‌’


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఎన్నెన్నో వర్ణాలు! అందులో... మన అధికారులకు అధికార పార్టీ జెండాలోని నీలం, తెలుపు, ఆకుపచ్చ మాత్రమే కనిపించాయి. కొత్తగా వీటితోపాటు... ‘ఎర్రమట్టిరంగు’ అనేది ఉందని తెలిసొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ భవనాలకు ఈ రంగులే వేయాలని తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు చెప్పినా సరే.... ‘మా రంగు, మా హంగు మాదే’ అని చెప్పకనే చెప్పినట్లయింది. ప్రభుత్వ భవనాలకు పార్టీల పతాకాల్లోని రంగులు వేయడం సరికాదని హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రభుత్వానికి చుక్కెదురైంది.


మూడు వారాల్లోపు ప్రభుత్వ భవనాలపై వైసీపీ రంగులు తొలగించాలని, ఆ తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో భవనాలకు ఏ రంగులు వేయాలన్న దానిపై ప్రభుత్వం ఐఏఎస్‌ అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మేధోమథనం చేసి... గ్రామపంచాయతీ భవనాలకు, ఇతర ప్రభుత్వ భవనాలకు వేయాల్సిన రంగులను ఖరారు చేసింది. దీనిపై గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీ భవనాలకు ఇప్పటికే వేసిన నీలం, తెలుపు, ఆకుపచ్చతోపాటు, కొత్తగా ఎర్రమట్టి రంగు వేయాలని సూచించారు. ఒక్కోరంగుకు ఒక్కో భాష్యం కూడా చెప్పారు. ఏపీ వ్యవసాయ ప్రధాన రాష్ట్రమైనందున పంచాయతీ కార్యాలయాలకు రైతుల సంక్షేమం, వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలకు అనుగుణంగా భవనాల రంగులు ఉండాలని చెప్పారు.


పంటలను ప్రతిబింబించేలా ఆకుపచ్చ, నీళ్లు-ఆక్వాకు సూచికగా నీలం, పాలు-పశువుల పెంపకానికి ప్రతీకగా తెలుపు వేయాలని నిర్దేశించారు. ఇవన్నీ ఇప్పటికే పంచాయతీ కార్యాలయాలకు వేసిన ‘వైసీపీ పతాక’ వర్ణాలే! కొత్తగా... భూమికి సంకేతంగా ఎర్రమట్టి రంగు వేయాలని పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో స్థానిక సంస్కృతిని బట్టి ఇంకేమైనా రంగులు వేసుకోవచ్చునని సూచించారు. స్థూలంగా చెప్పిందేమిటంటే... పాతరంగులు అలాగే ఉంచండి, కొత్తగా ఏదో ఒక చోట ఎర్రమట్టి రంగు వేయండి!


మిగతావి మీ ఇష్టం... మిగతా శాఖలకు సంబంధించిన భవనాలకు వాటికి అనుగుణంగా రంగులు వేసుకోవచ్చని ఆదేశాలలో తెలిపారు. అన్నీ ఒకే విధంగా ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. ‘‘ఈ రంగులు రాజకీయ పార్టీలను, గుర్తులు పోలి ఉండరాదు. జాతీయ బిల్డింగ్‌ ప్లాన్‌ నిబంధనలకు లోబడి ఉండాలి’’ అని తాజా ఉత్తర్వుల్లో పేర్కొనడం కొసమెరుపు!


Updated Date - 2020-04-24T08:46:24+05:30 IST