సర్కారు దురుద్దేశం!

ABN , First Publish Date - 2020-03-21T08:41:06+05:30 IST

కార్యాలయాల తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర విజిలెన్స్‌ కమిషనర్‌, కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వయిరీస్‌ ఆఫీసులను వెలగపూడి నుంచి కర్నూలుకు తరలించేందుకు వీలుగా

సర్కారు దురుద్దేశం!

  • కార్యాలయాల తరలింపు కుదరదు
  • వెలగపూడిలో స్థలాభావం సాకే.. సీఎం నుంచే నేరుగా ‘నోట్‌ ఫైల్‌ షీట్‌’
  • ఎవరూ అడక్కుండానే భవనాలను కలెక్టర్‌ ఎలా వెతికి పెట్టారు?
  • కార్యాలయాలు మాస్టర్‌ ప్లాన్‌లో భాగం.. వాటి తరలింపు చట్ట విరుద్ధమే
  • విజిలెన్స్‌, ఎంక్వైరీస్‌ కమిషనర్‌ కార్యాలయాల తరలింపు జీవో చెల్లదు
  • హైకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు

సూటి మాట

‘ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడ ఉండాలన్న నిర్ణయం ప్రభుత్వ పరిధిలోని అంశమే. కానీ... రాష్ట్ర విజిలెన్స్‌ కమిషనర్‌, కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వయిరీస్‌ ఆఫీసులను వెలగపూడి నుంచి తరలించాలన్న నిర్ణయం సదుద్దేశంతో తీసుకున్నది కాదు. ఈ నిర్ణయం వెనుక దురుద్దేశాలు ఉన్నప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు. సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్‌ 39 కింద ఉన్న జోన్‌లోకి ప్రభుత్వ కార్యాలయాలు వస్తాయి. ఈ చట్టాన్ని ఉపసంహరిస్తూ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన బిల్లులో కూడా మాస్టర్‌ ప్లాన్‌ అమలు ఉంది. దానికి భిన్నంగా కార్యాలయాలను తరలించడం చట్టవిరుద్ధం. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులు శాసన మండలిలో ఆమోదం పొందకపోవడంతో కార్యాలయాల తరలింపునకు ప్రభుత్వం పరోక్షంగా ‘షార్ట్‌ కట్‌’ విధానాన్ని అనుసరించింది.

- హైకోర్టు ధర్మాసనం


అమరావతి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): కార్యాలయాల తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర విజిలెన్స్‌ కమిషనర్‌, కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వయిరీస్‌ ఆఫీసులను వెలగపూడి నుంచి కర్నూలుకు తరలించేందుకు వీలుగా ప్రభుత్వం జనవరి 31న జారీ చేసిన జీవో 13 అమలును న్యాయస్థానం నిలిపివేసింది. ఈ జీవో ఏకపక్షమని, దీని జారీలో దురుద్దేశాలున్నాయని తెలిపింది. ఇందుకు తగిన ప్రాథమిక ఆధారాలున్నాయని పేర్కొంది. ఈ జీవో సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్‌ 39కి విరుద్ధమని స్పష్టం చేసింది. ‘‘విజిలెన్స్‌ కమిషనర్‌, కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వయిరీస్‌ కార్యాలయాలకు తాత్కాలిక సచివాలయంలో తగినంత స్థలం లేదన్న వంకతో వీటిని రాజధానికి 350 కిలోమీటర్ల అవతల ఉన్న కర్నూలుకు తరలించడం ఏమాత్రం సహేతుకం కాదు’’ అని చీఫ్‌ జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నంబరు 13ను సవాల్‌ చేస్తూ ‘రాజధాని రైతు పరిరక్షణ సమితి’ కార్యదర్శి డి.రామారావు, కొండెపాటి గిరిధర్‌, ‘అమరావతి పరిరక్షణ సమితి’ కార్యదర్శి జి.తిరుపతిరావు, మండవ రమేశ్‌ వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. వారి అనుబంధ పిటిషన్లపై విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం ఇరువైపుల వాదనలు విన్న అనంతరం గత నెల 18వ తేదీన తీర్పు రిజర్వు చేసింది. ఆ తీర్పును శుక్రవారం వెల్లడించింది.


స్థలం లేదన్నది ఓ వంక మాత్రమే..

శాసన మండలిలో వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులు ఆమోదం పొందకపోవడంతో, ప్రభుత్వం ఈ రెండు కార్యాలయాల తరలింపునకు స్థలాభావాన్ని సాకుగా చూపిందని ధర్మాసనం తెలిపింది. తాత్కాలిక సచివాలయం ఉన్న వెలగపూడికి 50 నుంచి 100 కిలోమీటర్ల పరిధిలో ప్రత్యామ్నాయాన్ని కూడా అన్వేషించలేదని ఆక్షేపించింది. ‘‘ఈ రెండు కార్యాలయాలకు తగిన స్థలం చూడాలని ప్రభుత్వం కర్నూలు జిల్లా కలెక్టర్‌కు ఎటువంటి లేఖ రాయలేదు. అయినప్పటికీ కర్నూలు కలెక్టర్‌ ఫలానా భవనాలు విజిలెన్స్‌ కమిషనర్‌, కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వయిరీస్‌ కార్యాలయాలకు అనువుగా ఉన్నాయంటూ ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. కలెక్టర్‌ తనంతట తానుగా ఈ లేఖ రాశారా? ఎవరి జోక్యంతోనైనా రాశారా? అన్న విషయంపై స్పష్టత లేదు. నోట్‌ షీట్‌ ప్రకారం ముఖ్యమంత్రి  ఆదేశాల మేరకే కార్యాలయాల తరలింపు జీవో జారీ అయిందన్న విషయం స్పష్టమవుతోంది’’ అని ధర్మాసనం తెలిపింది. మండలి ఆమోదం పొందలేకపోయిన వికేంద్రీకరణ బిల్లులోని సెక్షన్‌ 8 ప్రకారం సదరు కార్యాలయాలను తరలించాలన్న ప్రభుత్వ ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది. ‘‘సచివాలయంలో ఈ కార్యాలయాలకు తగిన స్థలం లేకపోతే.. విజయవాడ, గుంటూరు, ఏలూరుల్లో 50 నుంచి 100 కి.మీ. పరిధిలో కార్యాలయాలను ఏర్పాటు చేయవచ్చు. ఆ పని చేయకుండా, ఎవ్వరూ అడగకుండానే కర్నూలులో ఈ రెండు కార్యాలయాలకు తగిన స్థలం ఉందన్న కలెక్టర్‌ లేఖ ఆధారంగా ప్రభుత్వం ఈ జీవో జారీ చేసింది’’ అని ధర్మాసనం పేర్కొంది.


న్యాయ సమీక్ష చేయవచ్చు...

‘‘కార్యాలయాల తరలింపుపై ప్రభుత్వ నిర్ణయం సదుద్దేశంతో తీసుకున్నది కానేకాదు. ఇందుకు తగిన ప్రాథమిక ఆధారాలు కూడా ఉన్నాయి. కార్యాలయాల తరలింపు విషయంలో ప్రభుత్వానికి ఉన్న అధికారాల గురించి అడ్వకేట్‌ జనరల్‌ ప్రస్తావించిన తీర్పులు రెండూ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణమైనవి కావు. ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడ ఉండాలన్న నిర్ణయం ప్రభుత్వ పరిధిలోనిదే. కానీ  ఈ నిర్ణయం వెనుక దురుద్దేశాలు ఉన్నప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు’’ అని కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో చెప్పిందని, అయితే అదే సుప్రీంకోర్టు ప్రభుత్వ నిర్ణయాలు నిబంధనలకు అనుగుణంగా, సహేతుకంగా లేనప్పుడు న్యాయసమీక్ష చేయవచ్చని చెప్పిందని గుర్తు చేసింది. వెలగపూడిలో ఉన్న కార్యాలయాలను 350 కిలోమీటర్ల అవతల ఉన్న కర్నూలుకు తరలించడం వల్ల విచారణ ఎదుర్కొనే ఉద్యోగులు, సాక్షులుగా వున్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపింది. అంతేగాక ఖర్చు, పనిదినాలు కూడా వృథా అవుతాయని పేర్కొంది. తరలింపు జీవో జారీ చేసే ముందు ప్రభుత్వం ఈ ప్రతికూల ప్రభావాల గురించి ఏమాత్రం ఆలోచన చేయలేదంది. రాష్ట్ర యంత్రాంగం మొత్తం ప్రస్తుతం వెలగపూడి, దాని చుట్టుపక్కలే పని చేస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. ‘‘కేవలం విజిలెన్స్‌ కమిషనర్‌, కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వయిరీస్‌ కార్యాలయాలను మాత్రమే కర్నూలుకు తరలించడం వల్ల విజిలెన్స్‌ వ్యవహారాలను సమర్థంగా పర్యవేక్షించడం విజిలెన్స్‌ కమిషన్‌కు కష్టతరమవుతుంది. కమిషన్‌ ఏర్పాటు ఉద్దేశమే నెరవేరకుండా పోతుంది. ప్రతీ శాఖకు చెందిన చీఫ్‌ విజిలెన్స్‌ అధికారులు  చీఫ్‌ విజిలెన్స్‌ కమిషనర్‌కు నివేదిక సమర్పించాలన్నా, నేరుగా కలవాలన్నా 350 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇందుకు రెండు పని దినాలు పోతాయి. ప్రజల ఇబ్బందుల గురించి ప్రభుత్వం పట్టించుకోనట్లు కనిపిస్తోంది’’ అని వ్యాఖ్యానించింది.


మాస్టర్‌ ప్లాన్‌కు విరుద్ధం...

సీఆర్‌డీఏ చట్టంలోని మాస్టర్‌ ప్లాన్‌లో పలు జోన్లు ఉన్నాయని... ఆ చట్టంలోని సెక్షన్‌ 39 కింద ఉన్న జోన్‌ పరిధిలోకి ప్రభుత్వ ఆఫీసులు వస్తాయని ధర్మాసనం గుర్తుచేసింది. ‘‘విజిలెన్స్‌ కమిషనర్‌, కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వయిరీస్‌ కార్యాలయాలూ ఈ జోన్‌ పరిధిలోకే వస్తాయి. సీఆర్‌డీఏ చట్టాన్ని ఉపసంహరిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులో మాస్టర్‌ ప్లాన్‌ అమలు ఉంది. దానికి విరుద్ధంగా కార్యాలయాలను తరలించరాదు. అలా తరలించడం సెక్షన్‌ 39కు విరుద్ధం. అందువల్ల, కార్యాలయాల తరలింపుపై అధికార యంత్రాంగం తీసుకున్న నిర్ణయం చట్ట విరుద్ధమవుతుంది’’ అని తేల్చిచెప్పింది. ఇలాంటి నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

Updated Date - 2020-03-21T08:41:06+05:30 IST