‘వైఎస్సార్ చేయూత’పై ఏపీ ప్రభుత్వం క్లారిటీ

ABN , First Publish Date - 2020-08-11T22:52:29+05:30 IST

మహిళా సాధికారత దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన ‘వైఎస్సార్ చేయూత’ పథకంపై గత కొన్నిరోజులుగా గందరగోళం నెలకొన్న విషయం విదితమే.

‘వైఎస్సార్ చేయూత’పై ఏపీ ప్రభుత్వం క్లారిటీ

అమరావతి : మహిళా సాధికారత దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన ‘వైఎస్సార్ చేయూత’ పథకంపై గత కొన్నిరోజులుగా గందరగోళం నెలకొన్న విషయం విదితమే. అసలు ఎవరులబ్దిదారులు..? ఈ పథకం ఎంత వయసున్నవారికి, ఎవరెవరికి వర్తిస్తుంది..? అనే దానిపై జనాల్లో పలు సందేహాలు నెలకొన్నాయి. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై మంగళవారం నాడు ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చుకుంది.  


క్లారిటీ..

45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయస్సు లోపు ఉన్న బీసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు 75,000 ఆర్థిక సహాయం కోసం వైఎస్సార్ చేయూతను ప్రారంభించామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏడాదికి రూ. 18,750 చెల్లించేందుకు ఇది వరకే ఉత్తర్వులు ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రతి ఏడాది ఆగస్టు 12 నాటి 45 ఏళ్లు నిండిన వారు మాత్రమే ఈ పథకానికి అర్హులని తాజాగా విడుదల చేసిన ఉత్వర్వుల్లో సర్కార్ స్పష్టం చేసింది.


అంతేకాకుండా.. పథకం మధ్యలో 60 ఏళ్లు నిండితే వారికి అప్పటి నుంచి ‘వైఎస్సార్ చేయూత’ వర్తించదని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే బడుగు, బలహీన వర్గాలకు చెందిన 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలు రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల నుంచి లక్షలాది మంది గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకున్న విషయం విదితమే.

Updated Date - 2020-08-11T22:52:29+05:30 IST