‘తిరుగులేని’ తిప్పలు

ABN , First Publish Date - 2020-03-21T08:44:19+05:30 IST

శాసనసభ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన వైసీపీలో ఇటీవల వరుసగా ఎదురవుతున్న పరిణామాలు అంతర్గతంగా ఆందోళనకు దారి తీస్తున్నాయి. పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌

‘తిరుగులేని’ తిప్పలు

  • అధికార పక్షానికి వరుస దెబ్బలు.. 
  • అనేక నిర్ణయాలకు కోర్టుల్లో బ్రేకులు..
  • కీలక బిల్లులకు మండలి తిరస్కారం
  • ‘స్థానికం’ వాయిదాతో దెబ్బతిన్న అహం
  • సుప్రీంను ఆశ్రయించినా లభించని ఫలితం
  • కేంద్రానికి ఎస్‌ఈసీ లేఖ మరో సంచలనం


(అమరావతి - ఆంధ్రజ్యోతి): శాసనసభ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన వైసీపీలో ఇటీవల వరుసగా ఎదురవుతున్న పరిణామాలు అంతర్గతంగా ఆందోళనకు దారి తీస్తున్నాయి. పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ నిర్ణయాలను, సంక్షేమ పథకాలకోసం నిధులు వెచ్చించిన తీరును ప్రత్యర్థి పార్టీలూ విమర్శించేందుకు సాహసించలేకపోయాయి. కానీ కొద్దికాలంలోనే పరిస్థితుల్లో మార్పు వచ్చింది. రివర్స్‌ టెండర్లు, పునఃసమీక్షలు ఇలా పేరు ఏదైనప్పటికీ... అసలు లక్ష్యం మాత్రం తెలుగుదేశమేనని, ‘కక్ష సాధింపు’ చుట్టూ పాలన సాగుతోందనే విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో దూకుడుగా తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల వేగానికి... కోర్టుల్లో బ్రేకులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో... సీఎంపై విమర్శల జడి పెరిగింది. సోషల్‌ మీడియాలో ఇదివరకెన్నడూ లేనంతగా జగన్‌పై ‘ట్రోలింగ్‌’ జరుగుతుండటాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నారు.


‘స్థానికం’ పెద్ద దెబ్బ...

స్థానిక ఎన్నికల్లో 90 శాతం సొంతం చేసుకోవాలని ముఖ్యమంత్రి విధించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు... వైసీపీ యంత్రాంగం దూకుడుగా వ్యవహరించింది. దౌర్జన్యాలు, బలవంతపు ఉపసంహరణలు, ఏకగ్రీవాలపై ఆరోపణల సంగతి పక్కనపెడితే.. కరోనా విజృంభణ నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం హఠాత్తుగా ప్రకటించింది. దీనిపై జగన్‌ తీవ్రంగా స్పందించారు. ఆగమేఘాల మీద మీడియా  సమావేశం పెట్టి ఎస్‌ఈసీ రమేశ్‌ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన సామాజిక వర్గాన్నీ ప్రస్తావించారు. అదే సమయంలో... కరోనాను తేలిగ్గా తీసుకుంటూ జగన్‌ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో అభాసుపాలయ్యాయి. సీఎం బాటలోనే స్పీకర్‌, అనేకమంది మంత్రులు, వైసీపీ నేతలు ఎస్‌ఈసీపై చేసిన తీవ్ర వ్యాఖ్యలపై ప్రజల్లోనూ తీవ్ర చర్చ జరిగింది. తటస్థులు, వైసీపీ అంటే కాస్త అభిమానం ఉన్న వారు కూడా ‘ఇంత దారుణంగా మాట్లాడుతున్నారేంటి’ అని విస్తుపోయారు. ఎన్నికల వాయిదాను సుప్రీంకోర్టు సమర్థించడం ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ! ఆ వెంటనే ఇక్కడి పరిస్థితులను, ‘స్థానిక’ దౌర్జన్యాలను, తనపై శ్రుతిమించి చేసిన దూషణలను పూసగుచ్చినట్లు వివరిస్తూ కేంద్ర హోంశాఖకు ఎస్‌ఈసీ రాసిన లేఖ సంచలనం సృష్టించింది. తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలన్న ఆయన వినతిపై కేంద్రం అప్పటికప్పుడు స్పందించింది. ఎస్‌ఈసీ రాసిన ఈ లేఖను తొలుత ఆకాశరామన్న ఉత్తరమని వైసీపీ నేతలు అన్నారు.  తర్వాత లేఖ ఎలా బయటికి వచ్చిందో ఆరా తీయాలంటూ డీజీపీకి లేఖ రాశారు. ‘‘పరిపాలనలో కొన్ని లోటుపాట్లు, ఆటుపోట్లు సహజం. కొన్నిటిని సామరస్యంగా, మరికొన్నిటిని చాతుర్యంతో పరిష్కరించుకోవాలి. అలాకాకుండా... నాకు తిరుగులేదు, నేను చెప్పిందే జరగాలనే మొండి వైఖరితో కొత్త సమస్యలు ఎదురవుతాయి’’ అని ఒక రాజకీయ విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు.


వరుస దెబ్బలు...

పాఠశాలల్లో తెలుగు మాధ్యమం ఎత్తివేసి పూర్తిగా ఇంగ్లీష్‌ మీడియం మాత్రమే ప్రవేశపెట్టడం, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా కార్పొరేషన్ల ఏర్పాటు, సీఆర్‌డీఏ రద్దు, మూడు రాజధానుల బిల్లులకు శాసన మండలిలో తిరస్కారం ఎదురైంది. దీంతో ఆగ్రహించిన సీఎం... మండలినే రద్దు చేస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. కానీ, కేంద్రంలో కదలిక కనిపించడంలేదు. ఈలోపు ‘కరోనా’ ఉత్పాతం వచ్చి పడింది. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో శాసన మండలి రద్దు అంశం చర్చకు వచ్చే అవకాశమే కనిపించడంలేదు.

Updated Date - 2020-03-21T08:44:19+05:30 IST