ఏపీ జాలర్లకు ఆహారం అందించాం
ABN , First Publish Date - 2020-04-05T09:11:59+05:30 IST
లాక్‌డౌన్ వల్ల మహారాష్ట్రలో చిక్కుకుపోయిన 60 మంది ఏపీ జాలర్లను గుర్తించామని, వారికి ఆహారం సరఫరా చేశామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తెలిపారు. వారిని ఆదుకోవాలంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన

- చంద్రబాబు లేఖపై స్పందించిన మహారాష్ట్ర సీఎం
ముంబై, ఏప్రిల్ 4: లాక్‌డౌన్ వల్ల మహారాష్ట్రలో చిక్కుకుపోయిన 60 మంది ఏపీ జాలర్లను గుర్తించామని, వారికి ఆహారం సరఫరా చేశామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తెలిపారు. వారిని ఆదుకోవాలంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖకు గంటల వ్యవధిలోనే ఆయన స్పందించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆ జాలర్లను ఆదుకోవాలంటూ మహారాష్ట్ర సీఎంకు, కేంద్ర హోంశాఖ కార్యదర్శికి వేర్వేరుగా చంద్రబాబు శుక్రవారం లేఖలు రాసిన విషయం తెలిసిందే. ఆ జాలర్లు ముంబై తీరంలోని మాధ్ దీవిలో ఎక్కడ చిక్కుకుపోయారో జిల్లా కలెక్టర్ గుర్తించారని, ఆహారం సరఫరా చేశారని మహారాష్ట్ర సీఎం కార్యాలయం శనివారం ట్వీట్ చేసింది. ‘షెల్టర్ విషయంలో వారికి ఏ విధమైన ఇబ్బందీ లేదు. అయితే, ఆహారమే కొరత. వారికి ఆహారం సరఫరా చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశాం. వారు ఆ దీవిలో ఉన్నంతకాలం ఆహారాన్ని అందజేస్తుంటామని మీకు హామీ ఇస్తున్నాం’ అని మహారాష్ట్ర సీఎంవో పేర్కొంది.