దండం పెడతా.. అలా చేస్తే నా పదవికే గండం.. ఏపీ మంత్రి షాకింగ్ కామెంట్స్!

ABN , First Publish Date - 2020-12-30T18:00:23+05:30 IST

ఇంతకీ ఓ అమాత్యుడు నిండు సభలో చేసిన ఈ వ్యాఖ్యలు ఎందుకు దుమారం రేపుతున్నాయి.

దండం పెడతా.. అలా చేస్తే నా పదవికే గండం.. ఏపీ మంత్రి షాకింగ్ కామెంట్స్!

ఆ డిపార్ట్‌మెంట్ ఘోరాతి ఘోరమన్నారు. మీ శాఖలో అక్రమాల గురించి నేను సమాచారం ఇస్తే సీన్‌ వేరేలా ఉంటుందన్నారు. అలా చేస్తే నా పదవికే ఎసరు రావొచ్చన్నారు. అధికారుల పాదాలకు దండం పెడుతున్నా..ఇక మీదట ఆ తప్పు చేయొద్దన్నారు. డబ్బుకు,మందుకు అలవాటు పడితే మాత్రం ఆ వ్యవస్దలో మార్పు తీసుకురాలేమన్నారు. ఇంతకీ ఓ అమాత్యుడు నిండు సభలో చేసిన ఈ వ్యాఖ్యలు ఎందుకు దుమారం రేపుతున్నాయి. ఆ మంత్రి ఎవరు..ఏ శాఖను ఉద్దేశించి ఇంతగా స్పందించారు. ఆయన ఆవేదన ఏమిటి. ఇలాంటి ఆసక్తికర ప్రశ్నలకు ఈ ఇన్‌సైడ్‌లో సమాధానాలు చూద్దాం...  


షాకింగ్ కామెంట్స్..

ఏపీలో భూములకు సంబందించి రీ-సర్వేకార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. వై.ఎస్.ఆర్  జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంలో బాగంగా "మీ భూమి-మా హామీ" అనే కార్యక్రమాన్నిఇటీవల ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ప్రారంభించింది. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం ముట్టుకూరు పల్లె వద్ద మీ భూమి-మా హామీ కార్యక్రమాన్ని డిప్యూటి సీఎం నారాయణస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగా సభలో ఆయన రెవిన్యూ వ్యవస్దపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు రెవెన్యూ అధికారులు ప్రవర్తిస్తున్న తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.


పాదాభివందనం చేస్తా..

తాను చిన్పప్పటి నుంచి భూములపై పోరాడిన వ్యక్తిని అని నారాయణస్వామి అన్నారు. కొన్ని ఉదాహరణలతో సర్వేనెంబర్లు చెబుతాను...ఈ విషయం మీరు సీఎంకు చేరవేస్తే నన్ను మంత్రి పదవికి కూడా వద్దంటారు. కలెక్టర్ తపన, జగన్ తపన పలించడంలేదన్నారు. పేదవాడి భూములు లాక్కోవడం..ధనవంతులు కొనుక్కోవడం..ఇవన్నీ సీఎంకు తెలిస్తే పట్టలు ఊడదీస్తారని అన్నారు. రెవిన్యూ డిపార్టుమెంట్‌కు పాదాభివందనం చేస్తా..ఇక మీదట తప్పుచేయకండి.. డబ్బుకు,మందుకు అలవాటు పడితే మాత్రం రెవిన్యూ వ్యవస్దలో మార్పు తీసుకు రాలేమన్నారు. డబ్బు సంపాదించడం అనేది పెద్ద కష్టం కాదనీ...సంపాదించకుండా ఉండాలన్నదే పెద్ద కష్టమన్నారు. గతంలో అధికారుల తీరు వేరు..కానీ ఈరోజుల్లోని అధికారుల తీరు వేరన్నారు.


నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా..

కొందరు రెవిన్యూ అధికారుల తీరుతో భూముల విషయంలో పేదలకు అన్యాయం జరుగుతోందన్నారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. ఉన్నవాళ్ళ కోసం అధికారులు తపన పడొద్దని.. జగన్ లేని వాళ్లకోసం తపన చేస్తున్నారన్నారు. తన నియోజకవర్గంలో గతంలో 40 వేల ఎకరాల భూమిని పేదలకు ఇప్పిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. పేదలు కోర్టుల చుట్టు తిరుగుతున్నారని..అలాంటి పరిస్దితులు లేకుండా అధికారులు కాగితాలు ఇవ్వచ్చుకదా అన్నారు. గతంలో పేదలకు చెందిన 1350 ఎకరాల మామిడి తోటల భూములు ఆక్రమణకు గురైతే.. తమిళనాడు వ్యక్తుల నుంచి పోరాడి వాటిని సాధించానన్నారు. తన క్యారెక్టర్ చూసే సీఎం జగన్ ఈ పదవులు ఇచ్చారన్నారు. నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని.. నారాయణస్వామి కమీషన్లు తీసుకుని పనులు చేస్తున్నారని ఏఒక్కరు చెప్పినా సరే రాజకీయాలనుంచి తప్పుకుంటానని ఆవేశంగా మాట్లాడారు. 


జిల్లాలో హాట్ టాఫిక్‌గా..

ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే మనలో కొంత మార్పు రావాలన్నారు నారాయణస్వామి. ఆపీసర్లు లేకపోతే రాజ్యం లేదన్నారు. తాను ఆపీసర్లను కించపరచేలా మాట్లాడం లేదన్నారు. రెవిన్యూ వ్యవస్దలో 80 శాతం అవినీతిని మానుకుంటే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. కలెక్టర్ ఆవేదన చెప్పినందునే తాను ఇలా మాట్లాడాల్సి వచ్చిందన్నారు. అయితే ఈ మాటలు వింటున్న సంబందిత శాఖ అధికారులు లోలోపల రగిలిపోతున్నారట. మొత్తానికి డిప్యూటీ సీఎం నారాయణస్వామి రెవెన్యూశాఖపై చేసిన వ్యాఖ్యలు చిత్తూరు జిల్లాలో హాట్ టాఫిక్‌గా మారాయి. అయితే డిప్యూటీ సీఎం మాటలను బట్టి అన్యాక్రాంతమైన భూముల సర్వే నెంబర్లు ఆయనకు తెలిసినా..ఎందుకు బయటపెట్టడం లేదని విపక్షనాయకులు ప్రశ్నిస్తున్నారు. బాధితులకు ఆ భూములు దక్కేలా ఎందుకు చొరవ తీసుకోవడం లేదని అడుగుతున్నారు.

Updated Date - 2020-12-30T18:00:23+05:30 IST