విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది: సీఎస్

ABN , First Publish Date - 2020-05-09T01:30:04+05:30 IST

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది: సీఎస్

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది: సీఎస్

విశాఖపట్నం: గ్యాస్ లీకేజీ గురించి తెలియగానే జిల్లా యంత్రాంగం అక్కడకు చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించిందని ఏపీ సీఎస్ నీలం సహానీ స్పష్టం చేశారు. సుమారు 11 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఆమె చెప్పారు. 17 చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, 454 మంది ఆస్పత్రుల్లో చేరారని, వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉందని చికిత్స అనంతరం, ప్రస్తుతం వారు కోలుకున్నారని సీఎస్ తెలిపారు. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారని, ఘటనాస్థలంలో గాలిలో స్టైరిన్ శాతాన్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నామని చెప్పారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి దగ్గర ఉన్న వెంకటాపురంలో గాలిలో స్టైరిన్ శాతం కొద్దిగా ఎక్కువ ఉందని, మిగిలిన వైపు సాధారణ స్థాయిలో స్టైరిన్ ఉందన్నారు. మరో 48 గంటల్లో అక్కడ కూడా స్టైరిన్ తగ్గుముఖం పట్టి సాదారణ స్థితికి వస్తుందన్నారు. కంపెనీకి సమీపంలో ఉన్న ఐదు గ్రామాల ప్రజలు మరో 48 గంటలపాటు బయటే ఉండాలని సీఎస్ పేర్కొన్నారు. వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని, మృతులు, క్షతగాత్రులకు పరిహారంకు సంబంధించిన ప్యాకేజీని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించడం జరిగిందన్నారు. అవసరమైన నిధులను కూడా విడుదల చేయడం జరిగిందని, త్వరలో పరిహారం చెల్లిస్తామని సీఎస్ వెల్లడించారు. నష్టపరిహారాన్ని ఒక వేళ కంపెనీ చెల్లించాలనుకుంటే తీసుకుంటామని, ఈ ఘటనపై సమగ్ర విచారణకు కమిటీ వేయడం జరిగిందని, ఆ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎస్ స్పష్టం చేశారు.

Updated Date - 2020-05-09T01:30:04+05:30 IST