-
-
Home » Andhra Pradesh » ap cm ys jagan sharmila
-
జగన్, షర్మిళ మధ్య దూరం పెరిగిందా?
ABN , First Publish Date - 2020-12-27T20:12:29+05:30 IST
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆయన సోదరి షర్మిళ మధ్య దూరం పెరిగిందా? వారి మధ్య రాజకీయం వైరం నడుస్తోందా? అంటే అవుననే అంటున్నారు కడప వాసులు.

ఇంటర్నెట్ డెస్క్: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆయన సోదరి షర్మిళ మధ్య దూరం పెరిగిందా? వారి మధ్య రాజకీయం వైరం నడుస్తోందా? అంటే అవుననే అంటున్నారు కడప వాసులు. షర్మిళ వ్యవహారం కడప జిల్లాలో హాట్ టాఫిక్‌గా మారింది. ఈసారి ఇడుపులపాయలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు షర్మిళ దూరంగా ఉండటంతో రాజకీయంగా ఇది మరింత చర్చనీయాంశమైంది. ప్రతిసారి క్రిస్మస్ వేడుకలకు కచ్చితంగా హాజరయ్యే ఆమె.. ఈ ఏడాది రాకపోవడంతో పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఆమె కీలకపాత్ర పోషించనున్నారన్న వార్తల నేపథ్యంలో.. వేడుకలకు హాజరుకాకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. అన్నాచెల్లెళ్ల మధ్య మనస్పర్థలు వచ్చాయన్న చర్చ జరుగుతోంది. ఈ ఇద్దరి మధ్యా విభేదాలు ఉన్నాయని గతంలో కూడా వార్తలు వచ్చాయి. జగన్ జైలులో ఉన్నప్పుడు పార్టీ బలోపేతం కోసం షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేపట్టి.. పార్టీ ఉనికిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే జగన్ బయటకు వచ్చాక పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్టుగానే వ్యవహరించారు. జగన్ సీఎం అయ్యాక కూడా ఆమె స్థానం నామమాత్రమే అయ్యింది. పార్టీలో నెంబర్ టు అనుకుంటే.. చివరికి ఏ హోదా లేకుండా.. కేవలం జగన్ అన్న చెల్లిగా.. ఆయన వదిలిన బాణంగా ఉండిపోయారు.
అయితే.. ఎన్ని ఉన్నా, క్రిస్మస్ వేడుకలకు దూరంగా ఉన్నది మాత్రం లేదు. ఏటా క్రిస్మస్ వేడుకల్లో కుటుంబంతో కలిసి పాల్గొనేవారు. ఈసారి ఆమె రాకపోవడానికి కారణం ఆమె తనయుడేనని వైసీపీ వర్గాలు అంటున్నాయి. అమెరికాలోని తన కుమారుడి దగ్గరకు వెళ్లడంతోనే ఆమె క్రిస్మస్ వేడుకలకు దూరంగా ఉన్నారని చెబుతున్నారు.