ఒక్క ఎకరం ఆయకట్టు పెరగదు

ABN , First Publish Date - 2020-10-07T10:09:02+05:30 IST

కృష్ణా ట్రైబ్యునల్‌ కేటాయింపుల మేరకే కృష్ణా జలాలను వినియోగించుకునేందుకు వీలుగా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని చేపడుతున్నామని ఏపీ సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

ఒక్క ఎకరం ఆయకట్టు పెరగదు

ట్రైబ్యునల్‌ కేటాయింపుల మేరకే సీమ స్కీం

జూరాలపై కొత్త ప్రాజెక్టు కడితే మేం ఊరుకుంటామా?

సీమ పథకం కుదరదంటే శ్రీశైలం ఎడమగట్టు,

సాగర్‌ కుడికాలువ మాకు అప్పగించండి

అసలు ‘కృష్ణా’ ప్రాజెక్టులన్నీ మీరే తీసుకోండి

కేంద్రానికి జగన్మోహన్‌రెడ్డి సూచన


కృష్ణా ట్రైబ్యునల్‌ కేటాయింపుల మేరకే కృష్ణా జలాలను వినియోగించుకునేందుకు వీలుగా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని చేపడుతున్నామని ఏపీ సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ట్రైబ్యునల్‌ కేటాయింపులకుమించి ఒక టీఎంసీ అదనంగా అవసరం లేదని.. ఒక్క ఎకరా ఆయకట్టు కూడా పెరగదని చెప్పారు. సమన్యాయం పాటించేలా తెలంగాణతో సమానంగా శ్రీశైలం నుంచి 800 అడుగుల ఎత్తు నుంచే తాము కూడా నీటిని వాడుకుంటామన్నారు. తెలంగాణలో చాలా ప్రాజెక్టులు తన తండ్రి వైఎస్‌ హయాంలో చేపట్టినవేనన్నారు. జూరాల దిగువన కొత్త ప్రాజెక్టు నిర్మిస్తామంటే చూస్తూ ఊరుకుంటామా అన్నా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. తెలంగాణలో కృష్ణా, గోదావరి నదుల పై నిర్మిస్తున్న ప్రాజెక్టులకు డీపీఆర్‌లు ఉన్నాయా, కాళేశ్వరం మూడోదశకు డీపీఆర్‌ ఉందా అని అడిగారు.


శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులతోపాటు కృష్ణానదిపై నిర్మించిన అన్ని ప్రా జెక్టులనూ కేంద్రమే స్వాధీనం చేసుకుని.. వాటిని నిర్వహించాలని సూచించారు. కేంద్రం పర్యవేక్షణ చేపడితేనే ఇరు రాష్ర్టాలకు నీటి వినియోగంలో సమన్యాయం, శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకానికి తెలంగాణ తమకు సహకరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కృష్ణా బోర్డు కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలని, గోదావరి-కృష్ణా బోర్డుల పరిఽధిని ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 841 అడుగులకు తగ్గితే సీమ, నెల్లూరు జిల్లాల దాహార్తిని తీర్చలేని పరిస్థితి ఎదురవుతుందని, అందుకే సీమ ఎత్తిపోతలను చేపట్టామన్నారు.


ఇది సాధ్యపడకపోతే శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం, సాగర్‌ కుడి కాలువను ఏపీకి స్వాధీనపరచాలని కోరినట్లు తెలిసింది. కాగా.. సీమ ప్రాజెక్టుతో తెలంగాణకు ఎలాం టి నష్టం వాటిల్లదని ఆంధ్ర అధికారులు పేర్కొన్నట్లు తెలిసింది. ఈ స్కీంను వ్యతిరేకిస్తూ.. శ్రీశైలం జలాశయం నిర్వహణ బాధ్యతలు తెలంగాణకు అప్పగించాలంటూ కేసీఆర్‌ కేంద్రాని కి లేఖ రాయడంపై వారు అభ్యంతరం చెప్పినట్లు సమాచా రం. వీడియో కాన్ఫరెన్స్‌లో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, జలవనరుల మంత్రి అనిల్‌కుమార్‌, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యద ర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఇంజనీర్‌-ఇన్‌-చీఫ్‌ సి.నారాయణరెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ పాల్గొన్నారు.

Read more