3 రాజధానులతో అధోగతే

ABN , First Publish Date - 2020-12-13T09:21:14+05:30 IST

అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన మహాపాదయాత్రలో రైతులు, మహిళలు కదం తొక్కారు. మూడు రాజధానులతో రాష్ట్రం అధోగతి

3 రాజధానులతో అధోగతే

అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం మనుగడ ప్రశ్నార్థకం 

మహాపాదయాత్రలో అమరావతి అన్నదాతల గర్జన

పోరు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిక 

17 వరకు వివిధ రూపాల్లో నిరసనలు: జేఏసీ 

ఉపరాష్ట్రపతి చొరవ తీసుకోవాలి: నారాయణ 

పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే: ఎంపీ గల్లా 


గుంటూరు, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన మహాపాదయాత్రలో రైతులు, మహిళలు కదం తొక్కారు. మూడు రాజధానులతో రాష్ట్రం అధోగతి పాలవుతుందని... సీఎం జగన్‌ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని నినాదాలు చేశారు. డిసెంబరు 17నాటికి ఉద్యమం చేపట్టి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా అమరావతి జేఏసీ పిలుపు మేరకు గుంటూరులో శనివారం మహాపాదయాత్ర నిర్వహించారు. మధ్యాహ్నం 3.30గంటలకు ప్రారంభమైన ఈ యాత్రలో వేలసంఖ్యలో రైతులు, మహిళలతో పాటు పెద్దఎత్తున విద్యార్థి, యువజన, కుల సంఘాల నేతలు, వివిధ వ్యాపార ప్రజలు పాల్గొన్నారు. దాదాపు 4 కిలోమీటర్ల మేర రెండు గంటల పాటు యాత్ర కొనసాగింది. శుభం కల్యాణ మండపం నుంచి అంబేద్కర్‌ కూడలి వరకు మహాపాదయాత్ర నిర్వహించి అక్కడే భారీ మానవహారంగా ఏర్పడ్డారు.


అమరావతికి మద్దతుగా, మూడు రాజధానులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్‌ నిరంకుశ విధానాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మహిళలు ఆక్షేపించారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ మాట్లాడుతూ, రాజధాని అంశం కేంద్రం పరిధిలోనే ఉందన్నారు. రాజధాని మార్చాలంటే పార్లమెంట్‌లో చర్చ తప్పనిసరని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ అమరావతిలోనే రాజధాని ఉండాలన్నారు. అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్రం భరించాలన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పెద్ద మనిషిగా ఉన్న ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చొరవ తీసుకుని కేంద్రంతో మాట్లాడి ఏపీకి, అమరావతికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. మహిళల కన్నీరు దేశానికి మంచిది కాదని.. మహిళలతో కన్నీరు పెట్టించిన రావణాసురుడు, దుర్యోధనుడు నాశనమైనట్లుగానే వైసీపీ సర్కారు పతనమవుతుందని నారాయణ హెచ్చరించారు.


కాగా, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి శనివారం నుంచి 17 వరకు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జేఏసీ నేతలు చెప్పారు. 14న తుళ్లూరులో కిసాన్‌ సమ్మేళనం, 15న విజయవాడలో పాదయాత్ర, 17న ఉద్దండరాయునిపాలెంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో సీపీఐ నేత రామకృష్ణ, టీడీపీ నేతలు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, జీవీ ఆంజనేయులు, తెనాలి శ్రావణ్‌ కుమార్‌, నాదెండ్ల బ్రహ్మం చౌదరి తదితరులు పాల్గొన్నారు. 


361వ రోజు కొనసాగిన రైతుల నిరసనలు 

మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 29 గ్రామాల రైతులు వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. 361 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు.  

Updated Date - 2020-12-13T09:21:14+05:30 IST