దిక్కు మా ఫిర్యాదులను పట్టించుకోరా?

ABN , First Publish Date - 2020-12-11T07:53:33+05:30 IST

‘మా ఆడపడుచులను సోషల్‌ మీడియా వేదికగా అనరాని మాటలు అంటున్నారని సాక్ష్యాలు చూపుతూ ఫిర్యాదు చేశాం.

దిక్కు మా ఫిర్యాదులను పట్టించుకోరా?

అమరావతి రైతుల ఆవేదన

359వ రోజు కొనసాగిన ఆందోళనలు


గుంటూరు, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి):  ‘మా ఆడపడుచులను సోషల్‌ మీడియా వేదికగా అనరాని మాటలు అంటున్నారని సాక్ష్యాలు చూపుతూ ఫిర్యాదు చేశాం. మహిళలపై రాళ్ల దాడి చే శారని ఫిర్యాదు చేశాం.. మా బాధలను పోలీసులు కనీసం పట్టించుకోవటం లేదు’ అంటూ అమరావతి రైతులు వాపోయారు. ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని నినాదంతో ఆ ప్రాంత రైతులు, కూలీలు చేస్తున్న ఆందోళనలు గురువారానికి 359వ రోజుకు చేరాయి. ఈ నెల 6న ఉద్దండరాయునిపాలెంలో రైతుల శిబిరంపై దాడి చేసిన ఘటనలో తమ ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ ఆ గ్రామ మహిళలు, రైతులు మోకాళ్లపై నిల్చొని నిరనస గళాన్ని వినిపించారు. ఉద్యమం ప్రారంభించి దాదాపు ఏడాది  పూర్తవుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడాన్ని తప్పు పడుతూ  29 గ్రామాల రైతులు వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగించారు.


ఆగిన మరో గుండె..

రాజధాని తరలిపోతుందన్న ఆవేదనతో మరో గుండె ఆగింది. తుళ్లూరుకు చెందిన జమ్ముల గోపాలరావు (70) గురువారం గుండెపోటుతో మరణించారు. గోపాలరావు తనకున్న ఎకరం భూమిని అమరావతి నిర్మాణానికి ఇచ్చారు. ఉద్యమంలో ఆయన తరచూ పాల్గొంటూ అమరావతిని కొనసాగించాలంటూ నినాదాలు చేసే వారని తోటి రైతులు తెలిపారు. 


17న చలో అమరావతి

విజయవాడ: అమరావతి ఉద్యమం ఆరంభమై ఈనెల 17వ తేదీకి ఏడాది పూర్తికావస్తున్న నేపథ్యంలో అమరావతి పరిరక్షణ సమితి ఉద్యమ కార్యాచరణను రూపొందించింది. ఈ నెల 12నుంచి 17వ తేదీ వరకు వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. 17న ఉద్దండరాయునిపాలెంలో చలో అమరావతి పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. 

Updated Date - 2020-12-11T07:53:33+05:30 IST