ఏపీ బీజేపీ రథ సారథి ఏది చెబితే అది ఫైనల్..

ABN , First Publish Date - 2020-03-24T17:18:38+05:30 IST

ఏపీ బీజేపీ రథ సారథి ఏది చెబితే అది ఫైనల్..

ఏపీ బీజేపీ రథ సారథి ఏది చెబితే అది ఫైనల్..

"పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే ఫైనల్. ఆయన ఏమి చెబితే అది వినాల్సిందే. అందుకు భిన్నంగా జరిగితే ఊరుకునేది లేదు. ప్రభుత్వం తీసుకునే ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రజాబాహుళ్యంలో ఎండగట్టాల్సిందే. పార్టీ ఏకగ్రీవ తీర్మానానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే''- ఇదీ బీజేపీ అంతర్గత సమావేశంలో పార్టీ రాష్ట్ర నేతలకు చేసిన ఉపదేశం. అసలు ఎందుకు ఇదంతా జరిగిందని అనుకుంటున్నారా? ఆ వివరాలు తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే!


   'ఊరంతా ఒకదారైతే ఉలిపిరికట్టది మరొకదారి' అన్నచందంగా ఉందట ఏపీ బీజేపీలో కొందరు నేతల తీరు. అలాంటి వారికి ఇటీవల జరిగిన బీజేపీ కేంద్ర బాధ్యుల సమావేశంలో గట్టిగానే డోసు ఇచ్చారట. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధికారంలో లేకపోయినప్పటికీ, 2019 ఎన్నికల్లో పార్టీకి అతితక్కువ ఓట్లు వచ్చినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాల్లో కమలదళం నాయకులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార పక్షం, ప్రతిపక్షం వారు చేసే విమర్శల కంటే, బీజేపీ నేతలు చేసే విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, మరికొందరు నేతలు.. అటు టీడీపీ, ఇటు వైసీపీపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఇసుక కొరత, గ్రామవలంటీర్ల నియామకం, రాజధాని తరలింపు, స్థానిక సంస్థల ఎన్నికల్లో హింస వంటి అనేక సంఘటలపై కన్నా లక్ష్మీనారాయణ గళం వినిపించారు. ఆయా అంశాలపై ముఖ్యమంత్రికి లేఖలు రాయడంతోపాటు రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు కూడా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలు, బీజేపీ కార్యకర్తలపై దాడులు వంటి ఘటనలపై ఏకంగా వీడియో సాక్ష్యాధారాలను కేంద్ర నేతలకు పంపారు. జగన్ సర్కారుపై ఘాటైన విమర్శలు చేశారు. చివరకు స్థానిక ఎన్నికలను కరోనా వైరస్ కారణంగా వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.


    ఇదిలాఉంటే, ఇటీవల ఏపీ బీజేపీ నేతలతో కేంద్ర పార్టీ బాధ్యుల సమావేశం జరిగింది. ముఖ్యమైన నేతలందరినీ పిలిపించారు. ఇంతకుముందే రాష్ట్ర కమలదళంలో కొందరు నేతలు పార్టీ నిర్ణయాలకు భిన్నంగా మాట్లాడటంపై పలువురు నాయకులు  కేంద్ర పార్టీకి ఫిర్యాదు చేశారు. కొందరు ఎంపీలు కూడా ఇదే అంశంపై కేంద్ర పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ నేతలతో కేంద్ర పార్టీ బాధ్యులు నిర్వహించిన సమావేశం వాడివేడిగా సాగింది. రాష్ట్రంలోని కమలదళంలో భిన్నస్వరాలు వినిపించేందుకు వీలులేదని కేంద్ర పార్టీ బాధ్యులు గట్టిగా చెప్పారట. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయానికి, పార్టీ చేసిన తీర్మానానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని వారు స్పష్టం చేశారట. రాజధానిగా అమరావతి కొనసాగాల్సిందేననీ, పరిపాలనా వికేంద్రీకరణకు బీజేపీ వ్యతిరేకమనీ, అభివృద్ధి వికేంద్రీకరణను పార్టీ సమర్ధిస్తుందనీ స్పష్టత ఇచ్చారట. ఈ తీర్మానానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని కేంద్ర పార్టీ బాధ్యులు తేల్చిచెప్పినట్లు సమాచారం. 


    మొత్తంమీద ఆంధ్రప్రదేశ్‌లో ప్రజావ్యతిరేక నిర్ణయాలు ఏమైనా ఉంటే.. వాటిపై నిర్మొహమాటంగా మాట్లాడవచ్చునని బీజేపీ కేంద్ర పెద్దలు స్పష్టం చేశారని తెలిసింది. వైసీపీకి, టీడీపీకి... బీజేపీ సమదూరం పాటిస్తోందనీ, అదే బాటలో పార్టీ రాష్ట్ర నాయకులు నడవాలనీ సూచించారట. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య బలాబలాల్లో ఎంతో వ్యత్యాసం ఉందనీ, ఈ రాజకీయ శూన్యతను కమలదళం ఉపయోగించుకుని బలమైన శక్తిగా ఎదగాలనీ కేంద్ర పార్టీ బాధ్యులు దిశానిర్దేశం చేశారని సమాచారం. పార్టీ హైకమాండ్ ఆదేశాలను అందరూ విధిగా పాటించాలని నొక్కి మరీ వక్కాణించారట. ఇప్పటికైనా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలకు ఒత్తాసు పలుకుతున్న కొందరు బీజేపీ నేతలు.. తమ తీరు మార్చుకుంటారా? లేక పార్టీనే మారుతారా? అనే చర్చ కమలనాథుల్లో జోరుగా జరుగుతోంది. మరి మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో.. లెట్ వెయిట్ అండ్ సీ.

Read more