మాన్సా్‌సలో మరో కుదుపు
ABN , First Publish Date - 2020-12-29T08:17:05+05:30 IST
మాన్సా్‌సలో మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి.
ప్రధాన కార్యాలయాన్ని విశాఖ తరలించేందుకు నిర్ణయం!
(విజయనగరం/విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): మాన్సా్‌సలో మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి. విజయనగరం కోటలో నడుస్తున్న మాన్సాస్ రెవెన్యూ కార్యాలయాన్ని విశాఖ జిల్లాకు తరలించాలని మాన్సాస్ ట్రస్టు చైర్‌పర్సన్ సంచయిత నిర్ణయం తీసుకున్నారు. విజయనగరం కోటలో అనేక విద్యా సంస్థలు ఉన్నందున ఇబ్బందిగా ఉందని, అందుకే మాన్సాస్ ట్రస్టు రెవెన్యూ కార్యాలయాన్ని విశాఖ జిల్లాలోని పద్మనాభంలో గల ఎంఆర్‌వీఆర్‌ఆర్-2 జూనియర్ కాలేజీ ప్రాంగణంలోకి మారుస్తామని ట్రస్ట్ ఈవో ప్రతిపాదించగా, దానికి అంగీకారం తెలుపుతూ చైర్‌పర్సన్ రెండు రోజుల క్రితం సంతకం చేశారు. ఇందుకు ఆమోదం తెలపాలని కోరుతూ దేవదాయ శాఖకు పంపించారు. కాగా, విశాఖలో తిష్ఠ వేసిన అధికార వైసీపీ నేతలు కొందరు మాన్సాస్ ట్రస్టు భూములపై కన్నేశారని, విలువైన రికార్డులు అక్కడి కోటలో ఉన్నంత వరకు ఏమీ చేయలేమని...తరలిస్తే...మిగిలిన పనులు సులువుగా చక్కబెట్టవచ్చుననే ఉద్దేశంతో రెవెన్యూ కార్యాలయం తరలింపు పేరుతో రికార్డులన్నీ పద్మనాభం తీసుకువస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, మాన్సాస్ కార్యాలయాన్ని విశాఖ జిల్లాకు తరలించే ఏర్పాటు చేయటం వెనుక పెద్ద వ్యూహమే ఉందని ప్రజా సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
భారీ కుట్రలో భాగమే
రికార్డులు ట్యాంపరింగ్ చేయాలన్న కుట్రతోనే మాన్సాస్ రెవెన్యూ కార్యాలయాన్ని మార్చాలని నిర్ణయించుకున్నట్టు భావిస్తున్నాం. ప్రజా పతినిధులంతా మాన్సాస్ భూముల వివరాలు అడిగి నివేదికలు తెప్పించుకుంటున్నారు. అందరి దృష్టి మాన్సాస్ పరిధిలోని భూములపైనే ఉందని స్పష్టమవుతున్నది.
- అదితి గజపతిరాజు (ట్రస్టు పూర్వ చైర్మన్ )