కంట్రోల్ సెంటర్‌లో మరో కేసు
ABN , First Publish Date - 2020-04-26T08:59:07+05:30 IST
కరోనా కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విధులు నిర్వహించిన మరో ఉద్యోగికి కూడా కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. ఇప్పటికే ఏపీ మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్

ఏపీఎంఎస్‌ఐడీసీలో మరొకరికి కరోనా
అమరావతి, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): కరోనా కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విధులు నిర్వహించిన మరో ఉద్యోగికి కూడా కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. ఇప్పటికే ఏపీ మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్(ఏపీఎంఎ్‌సఐడీసీ)లో విధులు నిర్వహించిన బయోమెడికల్ ఇంజనీర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన కంట్రోల్ సెంటర్‌లో విధులు నిర్వహించారు. ఈ విషయాన్ని శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. దీంతో ఆ సెంటర్‌లోని నాలుగో ఫ్లోర్‌ని అధికారులు ఖాళీ చేశారు. ఎందుకైనా మంచిదని ఉద్యోగులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఉన్నతాధికారి డ్రైవర్‌కు కూడా కరోనా ఉన్నట్లు తేలింది. ఈ డ్రైవర్ కంట్రోల్ సెంటర్‌లో సుమారు 30 రోజుల నుంచి విధుల్లోవున్నారు. ఆయనకి పాజిటివ్ రావడంతో ఇంకెంత మందికి సోకిందోనన్న భయం వెంటాడుతోంది.
అధికారుల వింత వైఖరి
కార్పొరేషన్‌లో ఇద్దరు ఉద్యోగులకు కరోనా వచ్చినప్పటికీ అధికారుల స్పందన చిత్రంగా ఉంది. సోమవారం నుంచి యథావిథిగా మంగళగిరి కార్యాలయానికి వచ్చి విధులు నిర్వహించాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. ఒకవైపు ఉద్యోగులు తీవ్రంగా భయపడుతుంటే, కార్పొరేషన్ అధికారులు మాత్రం ఇవేవీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ సమయంలో వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాల్సిన అధికారులు, అందరినీ ఆఫీసుకు రావాలనడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.