విశాఖలో మరో పేలుడు

ABN , First Publish Date - 2020-07-14T08:35:53+05:30 IST

ఎల్జీ పాలిమర్స్‌, సాయినార్‌ ఫార్మా ఘటనలు మరువకముందే విశాఖపట్నంలో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. పరవాడ రాంకీ ఫార్మాసిటీలోని విశాఖ

విశాఖలో మరో పేలుడు

  • విశాఖ సాల్వెంట్స్‌లో రాత్రి 11 గంటలకు భారీ ప్రమాదం
  • పరవాడ ఫార్మాసిటీలో ఎగసిపడుతున్న మంటలు
  • గాయాలతో బయటికొచ్చిన ఒకరు
  • మరో నలుగురు లోపల ఉన్నట్టు సమాచారం

విశాఖపట్నం/పరవాడ, జూలై 13 (ఆంధ్రజ్యోతి):ఎల్జీ పాలిమర్స్‌, సాయినార్‌ ఫార్మా ఘటనలు మరువకముందే విశాఖపట్నంలో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. పరవాడ రాంకీ ఫార్మాసిటీలోని విశాఖ సాల్వెంట్స్‌ కంపెనీలో సోమవారం రాత్రి భారీ ప్రమాదం చోటుచేసుకుంది.  రాత్రి 11 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ శబ్దం పది కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది. ప్రజలంతా ఉలిక్కిపడి బయటకు వచ్చిచూడగా పెద్దఎత్తున మంటలు ఎగిసిపడుతూ కనిపించాయి. మంటలు పక్కనున్న కంపెనీలకు కూడా వ్యాపించే అవకాశం ఉందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పేలుడు శబ్దాలు ఒక దాని తరువాత ఒకటిగా వస్తుండటంతో లోపల రియాక్టర్లు పేలుతున్నాయేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదం నుంచి ఒక వ్యక్తి బయటపడ్డాడని, మరో నలుగురు లోపల ఉన్నారని చెబుతున్నారు.


ఏ విషయమూ అధికారికంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. విశాఖ ఆర్‌డీవో కిశోర్‌ రాత్రి 11 గంటలకు ప్రమాద స్థలానికి బయల్దేరి వెళ్లారు. పరవాడ రాంకీ ఫార్మాసిటీలోని విశాఖ సాల్వెంట్స్‌ కంపెనీ వ్యర్థాలను సేకరించి శుద్ధి చేస్తుంది. సాల్వెంట్స్‌ను పంపిణీ చేస్తుంది. ఒక రియాక్టర్‌లో సాల్వెంట్స్‌ వేస్తుండగా పేలుడు సంభవించిందని ప్రాథమిక సమాచారం. పేలుడు తరువాత మంటలు పెద్దఎత్తున రావడం, ఎంతకీ తగ్గకపోవడంతో సమీప ప్రాంత ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. కొందరు స్థానికులు ప్రమాద తీవ్రతను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవడానికి సమాయత్తమయ్యారు. ఎగసిపడుతున్న మంటల నుంచి రసాయనంతో కూడిన దుర్వాసన వెలువడటంతో దానిని పీలిస్తే ఏమవుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఫార్మాసిటీకి చెందిన అగ్నిమాపకదళం ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ మంటలు ఉవ్వెత్తున ఎగసిపడుతుండడంతో అగ్నిమాపక సిబ్బంది దగ్గరకు వెళ్లలేకపోతున్నారు. వెనకవైపు నుంచి వెళ్లే ప్రయత్నం చేస్తున్నామని అగ్నిమాపకదళం పేర్కొంది.


ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో ఎంత మంది ఉన్నారనే దానిపై సమాచారం ఇచ్చేందుకు యాజమాన్య ప్రతినిధులు ఎవరూ అందుబాటులో లేరు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్నట్టు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. విశాఖ సాల్వెంట్స్‌లో ప్రమాదం జరిగిందని, అయితే ఈ ఘటనలో ఎవరూ చనిపోలేదని ప్రాథమిక సమాచారం వచ్చిందని, ఇంకా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ చెప్పారు.

Updated Date - 2020-07-14T08:35:53+05:30 IST