డా. సుధాకర్ కుటుంబసభ్యులను పరామర్శించిన అనిత

ABN , First Publish Date - 2020-05-17T22:02:11+05:30 IST

డాక్టర్ సుధాకర్ కుటుంబసభ్యులను తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత పరామర్శించారు.

డా. సుధాకర్ కుటుంబసభ్యులను పరామర్శించిన అనిత

విశాఖ: డాక్టర్ సుధాకర్ కుటుంబసభ్యులను తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి వాదార్చారు. సుధాకర్‌ను పిచ్చాసుపత్రికి తరలించడం దారుణమన్నారు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో అనిత మాట్లాడుతూ డాక్టర్ సుధాకర్ తల్లి షాక్‌లో ఉన్నారన్నారు. కొడుకును ఈ స్టేజ్ వరకు చదివించడానికి తల్లిదండ్రులు చాలా కష్టపడతారని, ఆ కష్టం ఇవాళ బూడిదలోపోసిన పన్నీరయిందన్నారు. కేవలం మాస్కులు అడిగిన పాపానికి తన కొడుకును పిచ్చోడిని చేశారని ఆ తల్లి కన్నీటిపర్యంతమైన్నారు. డాక్టర్ సుధాకర్ 26 ఏళ్ల సర్వీసులో ఎక్కడ చిన్న రిమార్క్ కూడా లేదని, ఊరికే సస్పెండ్ చేశారని మండిపడ్డారు. కసబ్ లాంటివాళ్లను అరెస్టు చేసి తీసుకెళ్లే విధంగా డాక్టర్ రెండు చేతులు వెనక్కి కట్టి, లాఠీతో కొట్టి తీసుకువెళ్లడం అమానుషమని అనిత అన్నారు.


ఇంతకుముందు నరసరావుపేటలో రెడ్డి కులానికి చెందిన డాక్టర్ కూడా ఇలాగేమాట్లాడితే ఎలాంటి చర్యలు తీసుకోలేదని అనిత విమర్శించారు. సుధాకర్ దళితుడు కాబట్టి కక్షగట్టి చర్యలు తీసుకున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. పోలీసులు తీరు బాగోలేదని ఆమె విమర్శించారు. మాస్కులు అడిగినంత మాత్రానా సస్పెండ్ చేస్తారా? ఈ విధంగా ఎంతమందిని ప్రభుత్వం సస్సెండ్ చేస్తుందని అనిత ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ వైఫల్యమని, డాక్టర్ సుధాకర్ ఆ విధంగా ఉండడానికి కారణం సీఎం జగన్ అని, ఆయనపై కేసులు పెట్టాలని అనిత డిమాండ్ చేశారు. డాక్టర్‌కు తమ మద్దతు ఉంటుందని అనిత స్పష్టం చేశారు.

Updated Date - 2020-05-17T22:02:11+05:30 IST