మహిళను ఎస్ఐ బెల్ట్‌తో కొట్టడం దారుణం: అనిత

ABN , First Publish Date - 2020-12-06T20:23:26+05:30 IST

ఏపీలో రక్షించాల్సిన పోలీస్ వ్యవస్థ పదే పదే విఫలమవుతోందని అనిత ఆరోపించారు.

మహిళను ఎస్ఐ బెల్ట్‌తో కొట్టడం దారుణం: అనిత

తిరుపతి: ఏపీలో రక్షించాల్సిన పోలీస్ వ్యవస్థ పదే పదే విఫలమవుతోందని తెలుగుదేశం పార్టీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. ఆదివారం తెలుగు మహిళా సదస్సులో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలని ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను తిరుపతి ఎమ్మార్‌పల్లె ఎస్సై బెల్ట్‌తో కొట్టడం దారుణమని అన్నారు. బాధిత మహిళకు టీడీపీ అండగా నిలబడుతుందని, ఎస్‌ఐని తక్షణమే సస్పెండ్ చేయాలని అనిత డిమాండ్ చేశారు. 


పూర్తి వివరాలు

న్యాయం చేయమని వేడుకునేందుకు వెళ్లిన బాధితురాలిపై ఎస్ఐ దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తిరుపతి ఎమ్మార్ పల్లె పోలీస్ స్టేషన్‌లో జరిగింది. ఉప్పర్‌పల్లికి చెందిన అక్కాచెల్లెళ్లు వనిత వాణి, శకుంతల ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుకుంటున్నారు. అయితే పశువులు వచ్చి వాటిని తిని ధ్వంసం చేశాయి. వాటిని అక్కా చెల్లెళ్లు బంధించారు. విషయం తెలుసుకున్న పశువుల యజమానులు అక్కడికి చేరుకుని అక్కాచెల్లెళ్లను దుర్బాషలాడారు. ఇంట్లో వస్తువులు ధ్వంసం చేశారు. వెంటనే బాధితులు 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. అయితే రక్షక్ సిబ్బంది సంఘటనా స్థాలానికి చేరుకునే సరికి దాడి చేసిన వ్యక్తులు పరారయ్యారు. ఈ ఘటనపై పీఎస్‌లో ఫిర్యాదు చేయాలని రక్షక్ సిబ్బంది సూచించారు. వారు  ఎమ్మార్‌పల్లె పీఎస్‌కు వెళ్లి ఎస్ఐ ప్రకాష్ కుమార్‌కు విషయం చెబుతుండగా దుర్బాషలాడి బెల్ట్‌తో దాడి చేసినట్లు బాధితులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీస్ స్టేషన్ ఎదుట బైటాయించారు.

Updated Date - 2020-12-06T20:23:26+05:30 IST