అంగన్‌వాడీలకు పెద్ద కష్టం!

ABN , First Publish Date - 2020-03-23T10:06:43+05:30 IST

రాష్ట్రంలోని అంగన్‌వాడీలు ప్రమాదంలో పడ్డారు. కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించినా అంగన్‌వాడీలకు ఎలాంటి సెలవులు, మినహాయింపులు ఇవ్వలేదు.

అంగన్‌వాడీలకు పెద్ద కష్టం!

కరోనా ఉపశమన చర్యల నుంచి మినహాయింపు ఇవ్వని ప్రభుత్వం

‘టేక్‌ హోమ్‌ రేషన్‌’ ఆదేశాలు రద్దు

యథావిధిగా మధ్యాహ్న భోజనానికి ఆదేశం

మరోవైపు కరోనా గుర్తింపు సేవలకు సిబ్బంది

కేంద్రాల నిర్వహణ బాధ్యతపై ఆందోళన


అమరావతి, మార్చి 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అంగన్‌వాడీలు ప్రమాదంలో పడ్డారు. కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించినా అంగన్‌వాడీలకు ఎలాంటి సెలవులు, మినహాయింపులు ఇవ్వలేదు. పైగా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రకటించిన ‘టేక్‌ హోమ్‌ రేషన్‌’(లబ్ధిదారులకే నేరుగా ఆహార పదార్థాలు అందించడం)ను రద్దుచేసి సోమవారం నుంచి అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మధ్యాహ్న భోజనం వండి వడ్డించాలని ఆదేశించారు. మరోవైపు, కరోనా వ్యాధిలక్షణాలున్న వారిని గుర్తించేందుకు అంగన్‌వాడీల సేవలను ఉపయోగించుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఏకకాలంలో రెండు భిన్నమైన ఆదేశాలు ఇవ్వడంతో తమతోపాటు కేంద్రాలకు వచ్చే చిన్నారుల పరిస్థితి ఏమిటని అంగన్‌వాడీలు, ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 

రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోన్న సంగతి తెలిసిందే. కృష్ణా, విశాఖ, ప్రకాశం జిల్లాల్లో లాక్‌డౌన్‌ ప్రకటించాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. అయితే, రాష్ట్రంలో దీన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ఉద్యోగుల పనివేళలు, షిప్టుల విధానంపై ఉత్తర్వులు ఇచ్చింది. అయితే అంగన్‌వాడీలది ఇందుకు భిన్నమైన పరిస్థితి. టేక్‌ హోమ్‌ రేషన్‌(టీహెచ్‌ఆర్‌) కింద వారం, లేదా పదిరోజులకు సరిపడ అహారపదార్ధాలను నేరుగా లబ్ధిదారులకు అందించాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఉన్నతాధికారి శనివారం ఆదేశించారు. ఈ దిశగా అంగన్‌వాడీలు సిద్ధమవుతుండగా ఆదివారం మధ్యాహ్నం దీనికి పూర్తి విరుద్ధమైన ఆదేశమిచ్చారు. టేక్‌ హోమ్‌ రేషన్‌ను రద్దుచేస్తున్నామని, సోమవారం నుంచి అంగన్‌వాడీ కేంద్రాల్లోనే ఆహారాన్ని వండి వడ్డించాలని ఆదేశించారు. దీనికి కొనసాగింపుగా మరో ఉత్తర్వు ఇచ్చారు. కరోనా లక్షణాలున్న వారిని గుర్తించేందుకు వైద్య, ఆరోగ్య కార్యకర్తలతోపాటుగా అంగన్‌వాడీలు కూడా వెళ్లాలని, ఈ సేవల్లో పాల్గొనాలన్నది దాని సారాంశం. ఇలా వెళ్తే ఈ కేంద్రాల్లో చిన్నారులు, ఇతర లబ్ధిదారులకు ఆహారపదార్ధాలు వండి వడ్డించేవారు ఎవరు? వారి యోగక్షేమాలు చూసుకునేదెవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓ వైపు కరోనా వ్యాప్తి భయంతో లాక్‌డౌన్‌లు ప్రకటిస్తూ, పాఠశాలలకు సెలవులు ఇస్తూ మరోవైపు అంగన్‌వాడీ కేంద్రాలను యథావిధిగా కొనసాగించాలని ఆదేశించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఉండే ఈ కేంద్రాలే అన్నింటికంటే సున్నితమైనవి. వీటి సంరక్షణకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై ‘ఆంధ్రజ్యోతి’ ఓ ఉన్నతాధికారిని సంప్రదించగా తాము కూడా ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-03-23T10:06:43+05:30 IST